సిమ్లా: ప్రముఖ బాలీవుడ్ నటి, మండి నియోజకవర్గ బీజేపీ ఎంపీ అభ్యర్థి కంగనా రనౌత్‌పై హిమాచాల్‌ప్రదేశ్ కాంగ్రెస్ మంత్రి విక్రమాదిత్య ఫైర్ అయ్యారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాసౌలీలో నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. ‘ఆమె మండి నియోజకవర్గంలో ఎలాగో ఓడిపోతుంది.. ముంబైకి సాగనంపే ఏర్పాట్లు పూర్తయ్యాయి.’ అని ఎద్దేవా చేశారు. ముంబై నుంచి వచ్చి ఈ రాష్ట్రంలో ఎంపీగా పోటీ చేస్తున్న ఆమెను మళ్లీ ముంబైకి రిటర్న్ పంపుతున్నామని ర్యాలీలో అన్నారు. రాష్ట్రంలో మండి, సిమ్లా, కాంగ్రా, మహీపూర్, నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ అత్యధిక మెజార్టీతో గెలుస్తుందన్నారు. కాగా విక్రమాదిత్య కంగనాపై గత నెలలో కూడా విమర్శలు చేశారు. కంగనా వర్షాకాలంలో వచ్చే కప్పలాంటిదని, ఎన్నికల ప్రచారం అనంతరం ఆమె మండి నుంచి వెళ్లిపోతారన్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లో నాలుగు లోక్‌సభ స్థానాలకు జూన్ 1న పోలింగ్ జరగనుంది.