– భూముల నుంచి ఖాళీ చేయించొద్దు
– భూసేకరణ ప్రక్రియ చేసుకోవచ్చు
– ఆర్‌ఆర్‌ఆర్ రోడ్డు భూసేకరణపై హైకోర్టు
నవతెలంగాణ-హైదరాబాద్
రీజినల్ రింగ్ రోడ్(ఆర్‌ఆర్‌ఆర్) ఉత్తర భాగం నిర్మాణంలో భూమి కోల్పోతున్న పిటిషనర్లను వాళ్ల భూముల నుంచి ఖాళీ చేయించవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తాము తదుపరి ఆదేశాలిచ్చే వరకు భూముల నుంచి వారిని వెళ్లగొట్టొద్దని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్‌హెచ్‌ఏఐ)ను ఆదేశించింది. భూసేకరణ ప్రక్రియను కొనసాగించుకోవచ్చని స్పష్టం చేసింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూన్ 14కు వాయిదా వేసింది. ఆర్‌ఆర్‌ఆర్ నిర్మాణంలో భాగంగా సిద్దిపేట్ జిల్లా గజ్వేల్ మండలం పాములపర్తిలో సర్వే నంబర్‌లో 263లో 14 ఎకరాల భూ యజమాని కట్ట ఆరులప్ప, మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఇస్లాంపూర్ గ్రామం సర్వే నంబర్ 375, 377, 336లోని 9.03 ఎకరాల భూమి మొత్తం పోతున్నదని శ్రీరాంరెడ్డి వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వాటిని న్యాయమూర్తి జస్టిస్ కాజా శరత్ విచారించారు. ఎన్‌హెచ్ 44, ఆర్‌ఆర్‌ఆర్ ఇంటర్ జంక్షన్‌ను దాదాపు 60 ఎకరాల్లో నిర్మిస్తున్నారు. దీని కోసం 2022, మే 25న 3ఏ నోటిఫికేషన్ ఇచ్చి 2023 ఆగస్టు 8న 3డీ ఎన్‌హెచ్‌ఏఐ నోటిఫికేషన్ జారీ చేసింది. దాదాపు 4,704.25 ఎకరాల్లో ఎన్‌హెచ్‌ఏఐ ఆర్‌ఆర్‌ఆర్ నిర్మాణం చేపట్టనుంది. ఇందులో దాదాపు 4,315.33 ఎకరాల ప్రయివేటు భూమిని సేకరించనున్నారు. మొత్తం భూ సేకరణలో ప్రయివేటు భూమి వాటా 91.73 శాతం ఉండగా ప్రభుత్వ భూమి ఐదు శాతం, అటవీ భూమి 3.27 శాతమని తెలిపారు. పిటిషనర్ల తరఫున న్యాయవాది గౌరారం రాజశేఖర్‌రెడ్డి వాదనలు వినిపించారు. జాతీయ రహదారుల చట్టాన్ని పాటించడంలో పలు వ్యత్యాసాలు ఉన్నందున 3ఏ, 3డీ నోటిఫికేషన్‌ను కొట్టివేయాలని కోరారు. భూమి కోల్పోతున్న వారిని గుర్తించాలనీ, 3డీ నోటిఫికేషన్ కంటే ముందే రిహ్యాబిటేషన్ అండ్ రిసెటిల్‌మెంట్(ఆర్‌ఆర్) ప్యాకేజీ అమలు చేయాలని గుర్తుచేశారు. రోడ్లు, ప్రాజెక్టులకు భూసేకరణ ఉపశమనం, పునరావాస చట్టం 2013 అమలు కాదనీ, ఆర్‌ఆర్ ప్యాకేజీ ముందే అమలు చేయాల్సిన అవసరం లేదని ఎన్‌హెచ్‌ఏఐ న్యాయవాది వాదించారు. వాదనల తర్వాత హైకోర్టు, కేంద్ర రోడ్డు రవాణా శాఖ కార్యదర్శి, ఎన్‌హెచ్‌ఏఐ తదితరులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వాయిదా వేసింది. ఈలోగా ప్రతివాదులు తమ వాదనలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.
హాస్టల్స్‌లో వసతుల్ని కల్పించి చెప్పండి రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఉత్తర్వులు
ప్రభుత్వ పాఠశాలు, వసతి గృహాల్లో మరుగుదొడ్లు, బాత్ రూమ్స్, వంట గదుల్లో వసతులు వంటి ఇతర మౌలిక వసతులపై స్టేటస్ రిపోర్టు ఇవ్వాలని రాష్ట్రానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం పాఠశాలలకు వేసవి సెలవులు ఉన్నందున మౌలిక వసతుల కల్పన చర్యలు చేపట్టాలని ఆదేశించింది. ఇందుకు ప్రభుత్వానికి జూన్ 10 వరకు సమయం ఇచ్చింది. అదే తేదీకి విచారణను వాయిదా వేస్తున్నట్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరథే, జస్టిస్ అనిల్ కుమార్ జూకంటిలతో కూడిన డివిజన్ బెంచ్ ఇటీవల ఆదేశించింది. ప్రభుత్వ హాస్టళ్లలో బాలల హక్కుల పరిరక్షణ కోసం జాతీయ కమిషన్-2018 నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు సౌకర్యాలు అందించడం లేదనీ, 10 మందికి ఒక బాత్రూమ్, ఏడుగురికి ఒక మరుగుదొడ్డి, 50 మందికో వార్డెన్ ఉండాలన్న నిబంధనలు అమలు కావడం లేదంటూ హైదరాబాద్‌కు చెందిన కీర్తినేడి అఖిల్ శ్రీ గురుతేజ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దీనిని హైకోర్టు విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వం తీసుకువచ్చిన విద్యాహక్కు, బాలల హక్కుల వంటి పలు చట్టాలతో పాటు రాజ్యాంగ నిబంధనల ప్రకారం విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. దీనిపై ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ ఇమ్రాన్ ఖాన్ ప్రతివాదన చేస్తూ, ఇప్పుడు విద్యార్థులకు వేసవి సెలవులనీ, మౌలిక సమస్యలపై అధికారులు చర్యలు తీసుకుంటారని, గడువు ఇవ్వాలని కోరారు. ఇప్పటి వరకు విద్యార్థులు హాస్టళ్లలో ఉండటంతో నిర్మాణాలు, ఇతర పనులు చేయడానికి ఇబ్బంది అయ్యిందన్నారు. ఇప్పుడు వేసవి సెలవులు రావడంతో విద్యార్థులు హాస్టళ్ల నుంచి వెళ్లిపోయారని, సెలవులు జూన్ 11న ముగియనున్నాయని వివరించారు. దీంతో విచారణను జూన్ 10కి వాయిదా వేసిన హైకోర్టు, అప్పటిలోగా మౌలిక వసతుల కల్పన చర్యలు తీసుకుని వాటిని నివేదించాలంది.
పైగా ల్యాండ్స్ వివాదాన్ని కింది కోర్టు తేల్చాలి సివిల్ కోర్టుకు హైకోర్టు ఆదేశం
పైగా భూముల వివాదంపై కింది కోర్టు జారీ చేసిన మధ్యంతర దరఖాస్తులను పరిష్కరించాలనీ, ఆ తర్వాతే తుదితీర్పు వెలువరించాలని హైకోర్టు స్పష్టం చేసింది. మధ్యంతర దరఖాస్తులను తొలుత పరిష్కరించాలనీ, ఆ తర్వాత ఇరుపక్షాల ఆధారాలను పరిశీలించి తగిన తుది ఉత్తర్వులు ఇవ్వాలంది. పైగా భూమి దస్తావేజుల రద్దుకు సంబంధించిన వివాదంలో వాదప్రతివాదుల ఆధారాలను, మధ్యంతర పిటిషన్లను పరిష్కరించకుండా కింది కోర్టు తుది తీర్పు చెప్పడానికి వీల్లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. దస్తావేజును రద్దు చేస్తూ సివిల్ కోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేసింది. ఈ వివాదాన్ని సివిల్ కోర్టుకే తిరిగి పంపుతూ ఉత్తర్వులు జారీ చేసిందిమధ్యంతర పిటిషన్లను పరిష్కరించకుండా కింది కోర్టు ఇచ్చిన తీర్పును సైరస్ ఇవైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ దాఖలు చేసిన రెండో అప్పీల్ పిటిషన్లపై విచారణను ముగించింది. పైగా భూముల్లో కొంత భాగం నిజాం పేరుతో 1966 మేలో చేసిన విక్రయ దస్తావేజును రద్దు చేయాలంటూ బుగ్లీద్ జాహి పైగా వారసురాలిగా హమీదున్నీసా బేగం 12వ జూనియర్ సివిల్ జడ్జి కోర్టును ఆశ్రయించారు. 40 ఏండ్ల తరువాత దస్తావేజు రద్దు కోరడం సరికాదంటూ 2017లో వేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. దీన్ని సవాల్ చేస్తూ హమీదున్నీసా బేగం సివిల్ కోర్టులోని 11వ అదనపు చీఫ్ సివిల్ జడ్జి వద్ద మొదట అప్పీలు దాఖలు చేశారు. ఆమె చనిపోవడంలో మహమ్మద్ మొయిజుద్దీన్ ఖాన్ వారసుడిగా వివాదాన్ని కొనసాగించారు. దీనిపై విచారించిన 11వ అదనపు చీఫ్ సివిల్ జడ్జి హమీదున్నీసా బేగం నిజాంకు చేసిన దస్తావేజుతోపాటు, సైరన్ ఇన్వెస్టిమెంట్‌కు నిజాం చేసిన దస్తావేజులను రద్దు చేస్తూ గత ఏడాది డిసెంబరు 7న తీర్పు వెలువరించింది. దీనిని సవాల్ చేస్తూ దాఖలైన రెండో అప్పీల్ పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాదే ఆస్టిస్ ఎన్.వి శ్రవణ్ కుమార్లతో కూడిన ధర్మాసనం ఇటీవల విచారణ జరిపింది. చట్ట ప్రకారం మూడేండ్లలోపు దస్తావేజులను రద్దు కోరవచ్చుననీ, ఏండ్ల సుదీర్ఘకాలం తర్వాత రద్దు చేయడం చెల్లదని పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది కెజి రాఘవన్ వాదించారు. హామీదున్నీసా నిజాం పేరుతో రిజిస్టర్ చేశారని, అయితే నిజాంను ప్రతివాదిగా చేర్చకుండా నిజాం నుంచి భూమి కొనుగోలు చేసిన సైరస్ ఇన్వెస్ట్మెంట్స్‌ను చేర్చడం సరికాదన్నారు. హమీదున్నీసా నిజాం పేరుతో చేసిన దస్తావేజులను గుర్తిస్తూ 1969లో హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. ఆ ఉత్తర్వులను రద్దు చేయకుండా దస్తావేజుల రద్దు చెల్లదన్నారు. హమీదున్నీసా వారసుడు మ్యుటేషన్‌ను తిరస్కరణకు గురికావడంతోపాటు ఇతర ఆధారాలను సమర్పించినా కింది కోర్టు పట్టించుకోలేదన్నారు తుది తీర్చులో మధ్యంతర పిటిషన్ల ప్రస్తావనే లేదన్నారు. కంపెనీ తరఫున ఆథరైజేషన్ ఉందని తెలిపారు. హమీదున్నీసా వారసుడి తరపు సీనియర్ న్యాయవాది ఎం. గురుస్వామి వాదనలు వినిపిస్తూ కంపెనీ తరపున అప్పీలు దాఖలు చేయడానికి పిఎస్ ప్రసాద్‌కు ఆథరైజేషన్ లేదని, ఈ కారణం మీదనే అప్పీలు విచారణార్హం కాదన్నారు. ఆధరైజేషన్ పోర్జరీదని అన్నారు. ముంబాయి హైకోర్టులో కంపెనీకి, పి ఎస్ ప్రసాద్‌కు కుదిరిన రాజీ వివరాలను వెల్లడించలేదన్నారు. ఇరుపక్షాలు సమర్పించిన ఆధారాలను పరిశీలించకుండా, మధ్యంతర దరఖాస్తులపై నిర్ణయం తీసుకోకుండా తుది తీర్పు వెలువరించిన కింది కోర్టు చర్యను తప్పుపట్టింది. మధ్యంతర పిటిషన్లను పరిష్కరించకుండా తుది తీర్పు చెప్పడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఈ వివాదాన్ని తిరిగి సివిల్ కోర్టుకే పంపుతున్నట్లు ప్రకటించింది. అప్పీళ్లపై విచారణను మూసేసింది.