– ప్రొఫెసర్ హరగోపాల్
నవతెలంగాణ – బంజారాహిల్స్
రాజ్యాంగాన్ని పరిరక్షించుకుంటేనే మానవ మనుగడ సాధ్యమవుతుందని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం చచ్చిపోయిందని, రాజ్యాంగాన్ని మార్చేందుకు మనువాద బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేసిందని అన్నారు. అందుకే ఆ పార్టీ నేతలు 400 సీట్ల వేటలో పడి ప్రచారాలు చేస్తున్నారని తెలిపారు.
తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ‘భారత రాజ్యాంగం – హక్కులు- రిజర్వేషన్లు’ అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. అధ్యయన వేదిక ప్రధాన కార్యదర్శి సాదిక్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో హరగోపాల్ మాట్లాడారు. రాజ్యాంగాన్ని మార్చితే మధ్యయుగంలోకి వెళ్లే ప్రమాదం ఉందని, మానవ మనుగడే ప్రశ్నార్థకం అవుతుందని అన్నారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే 2024 తర్వాత రాజ్యాంగాన్ని రక్షించుకునే ఉద్యమాలు చేయాల్సి వస్తుందని చెప్పారు. ప్రొఫెసర్ కాశిం మాట్లాడుతూ.. దేశంలో ప్రజాస్వామ్యం సంక్షోభంలో ఉందన్నారు. గతంలో రాజ్యాంగానికి సవరణలు చేశారు తప్ప మార్చలేదని గుర్తు చేశారు. మోడీ వ్యామోహం చాలా ప్రమాదకరమని, యువత ఆలోచించాలని సూచించారు. రాజ్యాంగాన్ని, రాజ్యాంగ సంస్థలను రక్షించుకోవాలంటే బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు.
రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ.. ఢిల్లీ ప్రభుత్వం విద్యను పేద పిల్లలకు ఉచితంగా అందించడమే నేరమైందని.. ఏవో కారణాలతో కేజ్రీవాల్‌ను జైలులో పెట్టారని ఆరోపించారు. ప్రపంచ దేశాలు విద్య పైనే ఎక్కువ నిధులు ఖర్చు చేస్తే మన దేశంలో మాత్రం ఏటా నిధుల కోత విధిస్తున్నారని చెప్పారు. హిందూ సమాజాన్ని చీల్చినదే మనువాదులు అని విమర్శించారు. బీసీ నేత జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. మనువాదాన్ని అమలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, రిజర్వేషన్లు కావాలంటే ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు రామచంద్రమూర్తి, జయసారథిరెడ్డి, కాంగ్రెస్ నేత సంగిశెట్టి దశరథ్, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు, జనం సాక్షి ఎడిటర్ రెహమాన్, అధ్యయన వేదిక ఉపాధ్యక్షుడు జంగిటి వెంకటేష్, ట్రెజరర్ వేల్పుల సురేష్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ కంచె రాజు తదితరులు మాట్లాడారు.