కొందరు మందిని ముంచెటోల్లు ఉంటరు. ఏమైనా పరాయివాల్లది దొబ్బి తిందాం అనే రకం వాల్లు. అసొంటోల్లు పొత్తుల ఏం పని చేసినా అవుతలి వాల్లు మునిగినట్టే. అసొంటోల్లను ‘ఈతాకు ఏసి తాటాకు దొబ్బినట్లు’ అంటరు. ఈతాకు చానా చిన్నగుంటది. తాటి ఆకు పెద్దగ వుంటది. ఇగో నేను కూడా పొత్తులనే అనే పెద్ద మొత్తం సంపాదించేటోల్లు అన్నట్లు. ఇదే సామెతను తెలంగాణ ఉద్యమంల పొత్తుల బర్రెకు ఉపయోగించారు. ఎట్లనంటే ఉమ్మడి రాష్ట్రం పొత్తుల బర్రె అనుకుంటే మేత మేసే తల ముందటికాళ్లు ఒకరు చూసుకోవాలె. వెనుక కాళ్లు వైపు పాలు ఇచ్చే పొదుగు ఒకరు చూసుకున్నట్టున్నది అనుకునేవాళ్లు. అంటే తల పక్క ఆయన మేత వేయాలి, పొదుగు పక్క ఆయన పాలు పిండుకోవాలి అన్నట్లు ఉదహరించారు.
‘ఉప్పేసి పొత్తు కూడుడు’ కూడా అంటరు. అంటే ఏదైనా పెద్ద ఎత్తున వంటకాలు అయితే, అన్ని సామానులు ఒకలు వేస్తే కేవలం ఉప్పు మాత్రమే అందులో వేసి ఇదంత పొత్తులదే అన్నట్టు వ్యవహరించే వాల్లు వుంటరు. ఇటువంటి వాల్లు అంతటా వుంటరు. వీళ్లు ఒక వ్యూహంతోనే తేనె మాటలు తియ్యటి మాటలు మాట్లాడుతరు. పైసల కాడికి, పని కాడికి వచ్చేటప్పుడు ఇట్లా ఉపాయంగ మొదలుకుంటరు. వీల్లను కనిపెట్టుడు కష్టమే. అందుకే ‘సోపతి చేసి చూడాలె, బంగారం రాకి చూడాలె’ అనే సామెత పుట్టింది. బంగారంను ఆకురాయి మీద రాకుతేనే అసలుదా నకిలీదా అనేది తెలుస్తది. అట్లనే సోపతి చేస్తేనే, పొత్తుల ఏదన్న వ్యవహారం చేస్తేనే అసలు సంగతి తెలుస్తది అంటరు. అంతెందుకు ఎవరికైనా అవసరాలకు పైసలు బదులు ఇచ్చి చూడు, తర్వాత తిరిగి అడుగుతే ఎన్ని కతలు వుంటయో. అందరు ఇట్లని కాదు. ఉప్పు కప్పురంబు ఒక్క పోలికనుండు అన్నట్లు అందరూ అట్ల కాదు. మనుషులను పశనతు పట్టాలె. మనతోనే సోపతి చేసి మనతోనే విద్యలు నేర్చుకొని మనతోనే పేరు తెచ్చుకుని మనకే పంగనామాలు పెట్టెటోల్లు మన చుట్టూ వుంటరు
– అన్నవరం దేవేందర్, 9440763479 .