గుర్రం గుడ్డిదైనా దానాకేం తక్కువ బుక్కది

Even if the horse is blind, it is a lesser bookపని చేసినా చెయ్యకున్నా దేహానికి ఆహారం అవసరమే. శ్రమతో సంబంధమే లేదు. మనుషులకైనా జంతువులకైనా పనీపాట లేకుంట తిరిగేవాళ్లను చూసి ‘గుర్రం గుడ్డిదైనా దానాకేం తక్కువ బుక్కది’ అన్న సామెత పుట్టింది. గుర్రాలకు ఇచ్చే ఆహారాన్ని దాన అంటరు. ఎక్కువ వేరుశనగలతో చేస్తరు. గుడ్డి గుర్రం అయినా టాంగ కట్టుతె నడవదు బాట తెలువది. దానిని ఇంటికాడ కట్టేసుడే వుంటది. అయినా దానా అన్నిటికన్నా తక్కువ ఏం బుక్కది అంటరు. బుక్కుడు అంటే తినుడు అనే అర్ధం. గుర్రాల సంగతి ఎట్లున్నా గానీ ఒక మొగని సంగతి చూద్దాం. ‘చాదస్తపు మొగడు చెప్పితె వినడు, గిల్లితే ఏడుస్తడు’ అనే సామెత వివరణ అవసరం లేకున్నా అర్ధం అవుతది. కొందరు మరీ చాదస్తపు జీవితం అనుభవిస్తరు. కాలానుగుణంగా మారడు. భార్యను సంతోషపెట్టడు. అయితె ఆమె గిల్లితెనన్న ఎందుకోనని స్పందించాలె గద. ‘నిమ్మకు నీరెత్తినట్టు’ అట్లనే వుంటడు. ఇట్లాంటోల్లు అన్ని రంగాల్లో కన్పిస్తనే వుంటరు. మల్ల వీల్లు ఎట్లుంటరంటే ఏతులు ఎక్కువ కొడుతరు. అందుకే ‘ఏతులోనికి మాడుమీద మూడే ఎంటికలు’ అనే సామెత కూడా వచ్చింది. ఏతులు అంటే గప్పాలు, పొంకనాలు అనే పేర్లు కూడా వున్నాయి. వీల్లు ‘అందితే జట్టు అందకపోతే కాళ్లు’ అన్న చందంగా వుంటారు. వాల్లు పై చేయి అయితే జుట్టు పట్టుకుని ఆడిస్తరు. లేదా అమాంతం రెండు కాళ్లు అందుకుని శరణు వేడుకుంటరు. వీల్ల మాట, ముచ్చట సాఫ్‌ సీదా వుండది. అంతా వంకర మాటలు వంకర బుద్ధులు వుంటాయి. కలియుగంల రకరకాల మనుషులు ఉంటరు. నడుస్తనే వుంటది. ‘చల్తీకానాం గాడీ’ అనుకుంట నడిపించాలె. లేకుంటే ‘అయ్యగారు వచ్చేదాకా అమావాస్య ఆగదు’ కదా. అమావాస్య నాడు అయ్యగారిని రమ్మని పిలిస్తే తాను రాకున్నా అమావాస్య వస్తుంది. రోజు గడుస్తుంది.

– అన్నవరం దేవేందర్‌, 9440763479