‘కుక్కలు కూడా ఆలోచించవు, ఫలానా జాతిలోనే పుట్టాలనీ… ఎందుకని?… ఎందుకంటే అవి ఆలోచించ లేవు కాబట్టి. పోనీ ఆలోచించే మనుషులకు సాధ్యమా? సాధ్యం కాదు. ఎందుకనీ?… నిజంగానే సాధ్యంకాదు కాబట్టి.(ఫలానా మతంలోనో ఫలానా కులంలోనో పుట్టాలని అనుకుని ఎవరూ పుట్టలేరు గనుక). అలా హీనంగా ఆలోచించేవారిని మనుషులని అనుకోలేం’ – రూమీ. తత్వవేత్త.
చదువుకుంటూ, ఆలోచించుకుంటూ మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు సలీం.
‘లవ్ జీహాద్’ అంటే తెలుసు. మరి ఈ ‘ఓట్ జీహాద్’ ఏంటబ్బా? ముస్లింలు హిందువులను లొంగదీసుకునేందుకు ఈ లవ్ జీహాద్‌ను ఉపయోగి స్తారు. అందుకోసం వారు ఎంత కైనా తెగిస్తారు. ప్రాణంపోయినా సరే. జీహాద్ అంటే అదే’
ఆరెస్సెస్, విశ్వ హిందూ పరిషత్, జై భజరంగ్ దళ్ వాళ్ళు కొన్నేళ్ళ క్రితం ఈ ‘లవ్ జీహాద్’ మాటను సృష్టించి వదిలారు. ఇప్పుడు ప్రధాని మోడీ ఈ ‘ఓట్ జీహాద్’ మాటను కనిపెట్టి, జనంలోకి తాజాగా వదిలాడు. ముస్లింలపై ద్వేషం నింపడానికి.
‘కాంగ్రెస్ పార్టీ ఓట్ జీహాద్‌ను ప్రోత్సహిస్తుంది. అదీ బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని ముస్లింలను రెచ్చగొడుతుంది. ఈనాడు భారతదేశం ఓ కీలక మలుపులో ఉంది. మీకు ఓట్ జీహాద్ కావాలా? కొనసాగుతున్న రామరాజ్యం కావాలా? మీరే తేల్చుకోండి.
పాకిస్తాన్ ఉగ్రవాదులు భారత్‌కు వ్యతిరేకంగా జీహాద్ పేరుతో బెదిరిస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ ఈ మోడీకి వ్యతిరేకంగా ఓట్ జీహాద్ అంటున్నది. ఇది దేశ వ్యతిరేక ప్రకటన కాదా…?
మీకో విషయం చెప్పాలి. నేను 400 సీట్లు గెలుచుకోవాలని ఊరికే కోరడం లేదు. కాశ్మీరులో ఆర్టికల్ 370ని కాంగ్రెస్ తిరిగి తీసుకోకుండా రావాలంటే 400 సీట్లు కావాల్సిందే..
అయోధ్యలో సర్వాంగ సుందరంగా నిర్మించిన రామమందిరానికి బాబ్రీమసీద్ తాళం పడకుండా ఉండాలంటే నాకు 400 సీట్లు కావాల్సిందే.
కాంగ్రెస్ ముస్లిం మైనార్టీలను తన ఓటు బ్యాంకు అనుకుంటున్నది. వాళ్లకు ప్రయోజనాలు చేకూర్చాలని ఓబీసీ రిజర్వేషన్ కోటాను దోచుకోవాలని చూస్తుంది. కాంగ్రెస్ రాత్రికి రాత్రే తన ముస్లిం ఓటు బ్యాంకులోని వారిని ఓబీసీలుగా ప్రకటించాలని చూస్తుంది. మరి ఈ ఘోరాన్ని అడ్డు కోవాలంటే నాకు 400 సీట్లు కావాల్సిందే.
అసలు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు పార్లమెంటులో ఇప్పటికే, 400 సీట్లు ఉన్నాయి. ఆ విషయం కాంగ్రెస్‌తో సహా దేశ ప్రజలు తెలుసుకోవడం మంచిది.
హా…హా…హా. అసలు ఆర్టికల్ 370 రద్దు చేయడానికే మేం ఈ 400 నెంబర్ ఉపయోగించాం. అంతే కాదు ఎస్సీ, ఎస్టీ కోటాను కాపాడేందుకు, కాంగ్రెస్ – ఇండియా ప్రతి కుట్రను అడ్డుకోవాలంటే 400 కావాల్సిందే.
దళితుల ఓబిసిల రిజర్వేషన్‌లు లాక్కోవాలని ప్రతిపక్షాలు పొంచి చూస్తున్నాయి. ఈ మాటను లల్లూ ప్రసాద్ యాదవ్ చెప్పారు. ఎస్సీ,ఎస్టీ, బీసీలకు ఇస్తున్న రిజర్వేషన్ ఎప్పటికీ లాక్కోమని, ప్రస్తుతం ఉన్న ఓబిసి కోటాను దోచుకుని ముస్లింలకు రిసర్వేషన్ కల్పించబోమని నేను హామీ అడిగా… హా..హా… వారు తెలుకుట్టిన దొంగల్లా నోరు మూసుకున్నారు.
మీకు మరో విషయం చెప్పాలి.
అసలు బాబా సాహెబ్ అంబేద్కర్‌ను కాంగ్రెస్ చిన్నచూపు చూసింది. చిన్నచూపు అంటే చిన్న మాట అవుతుంది. అంబేద్కర్‌కు, మన రాజ్యాంగానికి కాంగ్రెస్ ఎప్పుడో వెన్నుపోటు పొడిచింది. ఈ వెన్నుపోటు కార్యక్రమం నెహ్రూ కాలం నుంచే మొదలైంది. రాజ్యాంగ నిర్మాణంలో అంబేద్కర్ పాత్ర చాలా తక్కువని, నెహ్రూ రాసిన పీఠికే గొప్పని కాంగ్రెస్ ఆనాడే చెప్పుకున్నది. రాజ్యాంగాన్ని, అంబేద్క ర్‌ను కాంగ్రెస్ ద్వేషిస్తుందని చెప్పడానికి ఇంతకంటే వేరే ఉదాహరణ కావాలా? – ఇలాంటి కాంగ్రెస్‌ను రాజకీయాల నుండి శాశ్వతంగా దూరం చేయడమే మనం అంబేద్కర్‌కిచ్చే ఘనమైన నివాళి, తెల్సిందా.
చివరగా ఓ మాట… నేనేదో ముస్లింలకు వ్యతిరేకినని కాంగ్రెస్ ప్రచారం చేస్తున్నది. హిందువుల ఆస్తులను ముస్లింలకు పంచుతానని కాంగ్రెస్ తన మ్యానిఫెస్టోలోనే చెప్పుకుంది. బీజేపీ అలా చెప్పలేదు. చెప్పదు కూడా.అయినా ముస్లింలు చాలా తెలివైన వారు. కాంగ్రెస్ అబద్దాలను వారు నమ్మరు. అందుకే ఇప్పుడు ఇది కాంగ్రెస్‌కు పెద్ద సమస్యై కూర్చుంది. ముస్లిం సమాజం ఆలోచించాలి. దేశం ప్రగతి పథంలో ఉంది. మీ వద్ద ఏమైనా పొరపాట్లు ఉన్నాయని భావిస్తే దానికి కారణాలు ఏమిటో తెలుసుకోండి. ముస్లింలు తమ భవిష్యత్ గురించి ఆలోచించుకోండి.
-ఇది ప్రధాని మోడీ ఎన్నికల ఉపన్యాసమా? ఒక మతం వారిపై మరో మతం వారిని ఎగదో యడమా?వింటున్న వారి అందరి ముఖాలు భయంతో నిండిపోయాయి. స్టేజీపైనా, చుట్టుపక్కల మాత్రం కొందరు కాషాయ రిబ్బన్‌లు కట్టుకుని చప్పట్లు ఈలలతో వీరంగం వేస్తున్నారు.
తడిసి ముద్దైన చెమటతో సలీంకు హఠాత్తుగా మెలుకువ వచ్చింది. ఎదురుగుండా పేపర్‌లో అచ్చం కలలోని ఉపన్యాసమే నిజమైన వార్తగా వచ్చింది.
– శైలి, 99597 45723