ఈడెన్‌లో వరుణుడు

ఈడెన్‌లో వరుణుడు– వర్షంతో ముంబయి, కోల్‌కత మ్యాచ్‌ ఆలస్యం
నవతెలంగాణ-కోల్‌కత
ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 17వ సీజన్‌ ప్లే ఆఫ్స్‌ రేసు ఆసక్తికరంగా మారింది. టెక్నికల్‌గా ఏ జట్లూ ప్లే ఆఫ్స్‌కు చేరలేదు. సుమారు 8 జట్లు ప్లే ఆఫ్స్‌ కోసం పోటీపడుతున్నాయి. గ్రూప్‌ దశ మ్యాచులు ఆఖరు వారంలోకి అడుగుపెడుతుండగా వరుణుడు సైతం స్టేడియంలోకి ఆసక్తిగా అడుగుపెట్టాడు. దీంతో శనివారం ఈడెన్‌గార్డెన్స్‌లో కోల్‌కత నైట్‌రైడర్స్‌, ముంబయి ఇండియన్స్‌ మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడింది. కోల్‌కత నైట్‌రైడర్స్‌ 16 పాయింట్లతో టాప్‌-2లో చోటు కోసం ప్రయత్నిస్తుండగా..
ముంబయి ఇండియన్స్‌ ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించింది.
ఈడెన్‌గార్డెన్స్‌లో సాయంత్రం నుంచే వర్షం మొదలైంది. 6.45 నిమిషాలకే టాస్‌ ఆలస్యం అంటూ అంపైర్లు అధికారికంగా వెల్లడించారు. రెండు సూపర్‌సోపర్లు, మైదాన సిబ్బంది ఈడెన్‌ గార్డెన్స్‌ అవుట్‌ఫీల్డ్‌ను సిద్ధం చేసేందుకు శ్రమపడినా.. వరుణుడు కురుస్తూనే ఉన్నాడు. అంపైర్లు వరుసగా పిచ్‌ తనిఖీలను సైతం వాయిదా వేస్తూ వచ్చారు. చివరగా 8.45 నిమిషాలకు పిచ్‌ను పరిశీలించి 16 ఓవర్ల మ్యాచ్‌ 9.15 గంటలకు ఆరంభం అవుతుందని ప్రకటించారు.