సైలెన్స్‌

Silence– మూగబోయిన ఎన్నికల మైకులు
– కోడ్‌ భాషలో ప్రలోభాలు షురూ…
– చివరి అస్త్రాల ప్రయోగంలో రాజకీయపార్టీలు
– అంతుపట్టని ఓటరు నాడి…
– రేపే పోలింగ్‌
పది రూపాయలు, 20 రూపాయల నోట్లే ఓటర్ల తాయిలాలకు కోడ్‌భాషగా నిలుస్తున్నాయి. హవాలా సొమ్ము లావాదేవీల్లో సగం చినిగిన నోటును చూపిస్తే, మిగిలిన సగం ముక్కతో పోల్చిచూసి, సెట్‌ చేసినట్టే… రూ.10 నోటు ఇస్తే, చివరి మూడు అంకెలు చూసి క్వార్టర్‌ మద్యం, రూ.20 నోట్‌ ఇస్తే వెయ్యి రూపాయలు క్యాష్‌ చేతిలో పెడుతున్నారని సోషల్‌ మీడియా కోడై కూస్తోంది.
నవతెలంగాణ- హైదరాబాద్‌బ్యూరో
రాజకీయ రణగొణ ధ్వనులకు చెక్‌ పడింది. ఎన్నికల ప్రచారం పరిసమాప్తమైంది. ఇప్పటి వరకు నువ్వు అవినీతిపరుడివి అంటే… నువ్వే అవినీతిపరుడివి అని తిట్టుకున్న నోళ్లు ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటున్నాయి. వచ్చే 24 గంటల్లో ఓటర్లను సైలెంట్‌గా ఆకట్టుకొనేందుకు ప్రధాన రాజకీయపార్టీలు ఎక్కడికక్కడ లోకల్‌ మేనేజ్‌మెంట్‌ చేస్తున్నాయి. మద్యం షాపులు కూడా 48 గంటలు మూతపడటంతో శనివారం సాయంత్రానికే కాటన్ల కొద్ది ‘మందు’ పట్టణాలు, పల్లెలకు తరలిపోయింది. బూత్‌ లెవల్లో ఎవరి బలం ఎంత అనే లెక్కల్లో రాజకీయపార్టీల నేతలు తలమునకలై ఉన్నారు.
ప్రత్యర్థులు బలంగా ఉన్న చోట ఎక్కువ ఓట్లను ఎలా రాబట్టాలనే చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. అన్ని పార్టీలు పోల్‌ మేనేజ్‌మెంట్‌ పైనే ప్రధానంగా దృష్టిపెట్టాయి. ఇక ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేసింది. స్థానిక పోలీసులతో పాటు కేంద్ర బలగాలు ఎన్నికల బందోబస్తులో భాగస్వామ్యం అవుతున్నాయి. ఓటర్ల ప్రలోభాలకు ఆస్కారం ఉన్న ప్రాంతాల్లో ఎన్నికల సంఘం ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేసింది. ఎలాంటి సమాచారం అందినా తక్షణం స్పందించేందుకు ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ దళాలను సిద్ధం చేశారు. ఎన్నికల బరిలో నిలిచిన అన్ని పార్టీల అభ్యర్థుల వెంట ఎన్నికల సంఘం షాడో పార్టీలను ఏర్పాటు చేసింది. అభ్యర్థులు ఎక్కడికి వెళ్తే, వారిని వెంబడిస్తూ ఎన్నికల సూక్ష్మ పరిశీలకులతో కూడిన షాడో బృందాలు వెంటాడేలా ఈసీ ఏర్పాట్లు చేసింది. ఇన్ని రోజుల ఎన్నికల ప్రచారం ఒక ఎత్తు అయితే, చివరి రోజు ప్రయత్నాలు మరిన్ని ఫలితాలను ఇస్తాయని రాజకీయపార్టీలు భావిస్తున్నాయి. బస్తీలు, హౌటళ్లు, ఇతర ప్రాంతాల్లో మకాం వేసిన ఇతర నియోజకవర్గాల కార్యకర్తల్ని ఖాళీ చేయించే పనిలో పోలీసులు బిజీగా ఉన్నారు. ఎన్నికల సిబ్బంది ఆదివారం మధ్యాహ్నం నుంచి ఫెలిసిటేషన్‌ సెంటర్లకు తరలివెళ్లాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఫలానా నియోజకవర్గంలో మీరు ఎన్నికల విధులకు హాజరుకావాలని మాత్రమే ఆదేశాలు ఇచ్చిన ఎన్నికల సంఘం, ఆదివారం వారికి ఏ బూత్‌లో విధులు కేటాయించిందీ వెల్లడిస్తుంది. కేవలం 24 గంటల ముందు మాత్రమే ఎన్నికల సిబ్బందికి తాము విధులు నిర్వహించాల్సిన బూత్‌ నెంబర్‌ను వెల్లడిస్తారు. ఫెలిసిటేషన్‌ సెంటర్ల నుంచి ఎన్నికల సామాగ్రి తీసుకొని, వారిని ఆర్టీసీ బస్సుల్లో ఆయా బూత్‌లకు తీసుకెళ్తారు. ఆదివారం రాత్రి ఎన్నికల సిబ్బంది అక్కడే ఉండాలి. సోమవారం ఉదయం 6 గంటలకు పోలింగ్‌ ఏజెంట్ల సమక్షంలో మాక్‌ పోలింగ్‌ నిర్వహిస్తారు. ఉదయం 7 గంటల నుంచి ఓటర్లను అనుమతిస్తారు. సహజంగా ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది. వేసవికాలం కావడంతో ఓటర్ల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ సమయాన్ని పొడిగించారు. అయితే సమస్యాత్మక ప్రాంతాల్లో మాత్రం సాయంత్రం 4 గంటలకే పోలింగ్‌ ముగుస్తుంది. ప్రతి పోలింగ్‌ బూత్‌లోనూ ఈవీఎమ్‌ల నిర్వహణ, మరమ్మత్తుల కోసం ఈసీఐఎల్‌కు చెందిన ఇంజినీర్లను ఎన్నికల సంఘం అందుబాటులో ఉంచింది. శనివారం సాయంత్రం 6 గంటల నుంచి రాష్ట్రంలో 144వ సెక్షన్‌ అమల్లోకి వచ్చింది. సోమవారం జరిగే పోలింగ్‌ బూత్‌ల వద్ద తప్ప, మరెక్కడా ప్రజలు గుమికూడరాదని ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో రహస్య బ్యాలెట్‌తో జరుగుతున్న ఎన్నికల్లో ఓటరు నాడి మాత్రం ఎవరికీ అంతుపట్టకుండా ఉండటం విశేషం! ఎగ్జిట్‌పోల్‌ అంచనాలను కూడా ఒక్కో సంస్థ ఒక్కో రకంగా నిర్వహిస్తుండటం గమనార్హం. అయితే దీనివల్ల మెజారిటీ ప్రజల అభిప్రాయం పాక్షికంగా వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే దేశంలో మరో మూడు దశల ఎన్నికలు ఉన్న నేపధ్యంలో ఎగ్జిట్‌పోల్స్‌పై ఎన్నికల సంఘం నిషేధం విధించింది. ఈనెల 13న పోలింగ్‌ జరిగితే, ఫలితాల కోసం జూన్‌ 4వ తేదీ వరకు వేచిచూడాల్సిందే!