– నేటి సాయంత్రానికి పోలింగ్ స్టేషన్లకు చేరుకోనున్న సిబ్బంది
– 13 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఉదయం 7నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు పోలింగ్
– ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్
– పోలింగ్ స్టేషన్లకు 100 మీటర్ల దూరంలో నిషేధాజ్ఞలు
– ఇతర ప్రాంతాలవారు వెంటనే ఖాళీ చేసి వెళ్లి పోవాలి
– 13న సెలవివ్వని కంపెనీలు, సంస్థలపై చర్యలు
– ఫిర్యాదులపై 100 నిమిషాల్లో చర్యలు : రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్
– సమస్యాత్మక ప్రాంతాల్లో మూడంచెల భద్రత
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
” పోలింగ్‌కు సర్వం సిద్దమైంది. నేటి సాయంత్రానికి ఎన్నికల సిబ్బంది తమకు కేటాయించిన పోలింగ్ స్టేషన్లకు చేరుకుంటారు. సమ్యస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించిన 13 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు, మిగతా 106 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. 160 కంపెనీల కేంద్రబలగాలు, 60 వేల మంది రాష్ట్ర పోలీసులు, 15 వేల మంది యూనిఫామ్ పోలీసులు విధులు నిర్వహిస్తారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేసాం” అని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు. శనివారం హైదరాబాద్ బీఆర్కే భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రచార గడువు ముగిసిన నేపథ్యంలో సభలు, సమావేశాలు, ర్యాలీలు, బల్క్ ఎస్ఎంఎస్లకు అనుమతి లేదని తేల్చి చెప్పారు. పార్టీలు, అభ్యర్థులు నేడు, రేపు ప్రకటనలు ఇవ్వాలనుకుంటే ఈసీ అనుమతి తీసుకోవాలని సూచించారు. జూన్ 1న జరిగే చివరి దశ పోలింగ్ పూర్తయ్యే వరకు పత్రికలు, టీవీలు, సోషల్‌మీడియా, ఇతర ప్రచార సాధనాలు ఎగ్జిట్ పోల్స్ ప్రకటించరాదని చెప్పారు. శనివారం సాయంత్రం 6 గంటల నుంచి రాష్ట్రంలో 144వ సెక్షన్ అమల్లోకి వచ్చిందనీ, నిబంధనలకు విరుద్దంగా ప్రజలు గుమికూడరాదని హెచ్చరించారు. ఇతర ప్రాంతాల నుంచి ప్రచారానికి వచ్చిన నాయకులు, కార్యకర్తలు వెంటనే ఖాలీ చేసి తమ తమ ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. ఈసీ నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. మద్యం, డబ్బులు పంపిణి జరగకుండా సాధారణ పరిశీలకులు, పోలీస్ అబ్జర్వర్స్, వ్యయ పరిశీలకులు నిత్యం పర్యవేక్షిస్తారని పేర్కొన్నారు.
రాష్ట్రంలో మొత్తం 3,32,32,318 3 ఓటర్లు ఉన్నారనీ, అందులో 1,65,28,365 మంది పురుష ఓటర్లు, 1,67,01,192 మంది మహిళా ఓటర్లు, 18 నుంచి 20 సంవత్సరాల వయసున్న యువ ఓటర్లు 9,02,960 మంది ఉన్నారని వికాస్‌రాజ్ తెలిపారు. ఇప్పటి వరకు 96 శాతం ఓటర్ స్లిప్పుల పంపిణీ పూర్తయిందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 35,809 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు వివరించారు. ఒక్క ఈవీఎం మిషన్‌లో నోటాతో కలిపి 16 గుర్తులు మాత్రమే వస్తాయనీ, ఈ క్రమంలో ఏడు నియోజక వర్గాల్లో 3, తొమ్మిది నియోజకవర్గాల్లో రెండేసి చొప్పున ఈవీఎంలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఆదిలాబాద్ లోక్‌సభ స్థానంలో 12 మంది బరిలో ఉన్నందున అక్కడ ఒక్క ఈవీఎం సరిపోతుందని తెలిపారు. ఈ సారి అభ్యర్థుల సంఖ్య భారీగా ఉండటంతో1.5 లక్షల ఈవీఎంలు ఉపయోగిస్తున్నామని వివరించారు. మూడు పోలింగ్ స్టేషన్లలో వరుసగా 10,12, 14 మంది ఓటర్లు, 25 మంది ఓటర్లు ఉన్న పోలింగ్ స్టేషన్లు 11 ఉండగా, 50 మంది ఓటర్లు ఉన్న పోలింగ్ స్టేసన్లు 23, 100 మంది ఓటర్లు ఉన్న పోలింగ్ స్టేషన్లు 54 ఉన్నాయని తెలిపారు. మొత్తం 1లక్ష 88 వేల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు, 21,680 హౌం ఓట్లు పోలయ్యాయని పేర్కొన్నారు. పోలింగ్ స్టేషన్లలో ఈవీఎంలు మొరాయిస్తే ఈసీ నిబంధనల ప్రకారం సెక్టర్ ఆఫీసర్లు మారుస్తారని తెలిపారు. ఈవీఎంలు సరఫరా చేసిన ఈసీఐఎల్ కంపెనీ ఇంజినీర్లు అసెంబ్లీ సెగ్మెంట్ల వారిగా ఇద్దరేసి చొప్పున అందుబాటులో ఉంటారని వివరించారు. ఇప్పటి వరకు సీ విజిల్ ద్వారా 2,342, 1950 టోల్‌ఫ్రీ నెంబర్ ద్వారా 1,511, ఎన్జీఎస్పీ పోర్టల్ ద్వారా 1,526 ఫిర్యాదుల వచ్చాయని తెలిపారు. పోలింగ్ పూర్తయ్యే వరకు వచ్చిన ఫిర్యాదులను గరిష్టంగా 100 నిమిషాల్లో పరిష్కరిస్తామని తెలిపారు.
రాష్ట్రంలో పోలింగ్ శాతం పెంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు, రిసెప్షన్ కేంద్రాలు, పోలింగ్ కేంద్రాల వద్ద కావాల్సిన అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తున్నట్టు వివరించారు. ఓటు హక్కు అవశ్యకతను తెలిపేందుకు కాలేజీలు, విద్యాసంస్థలు, సివిల్ సొసైటీలు, స్వచ్చందసంస్థలు, మీడియా తదితర మార్గాల సాయం తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్క ఓటరు బాద్యతగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. డిసెంబర్ ఒకటి నుంచి ఇప్పటి వరకు ఎన్నికల ప్రవర్తన నియమావళి లో భాగంగా ఫ్లయింగ్ స్క్వాడ్ ద్వారా రూ.320 కోట్ల విలువ చేసే నగదు, బంగారం, ఇతర ఆభరణాలు, డ్రగ్స్, నార్కొటిక్స్, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఇందుకు సంబంధించి 8.600 కేసులు నమోదు చేసినట్టు పేర్కొన్నారు.