– ప్రధాని మోడీపై ఒక్క అవినీతి మరకా లేదు : వికారాబాద్ సభలో కేంద్ర హౌంమంత్రి అమిత్ షా
నవతెలంగాణ-వికారాబాద్ ప్రతినిధి
దేశ రక్షణ విషయంలో కాంగ్రెస్‌కు సర్జికల్ దాడులు చేసే దమ్ముందా అని కేంద్ర హౌంమంత్రి అమిత్ షా అన్నారు. ప్రధాని మోడీపై ఒక్క అవినీతి మరకా లేదన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి మద్దతుగా శనివారం వికారాబాద్‌లో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో అమిత్ షా మాట్లాడుతూ.. కొంచెం ఉష్ణోగ్రతలు ఎక్కువైనా విదేశాలకు వెళ్లే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తమకు పోటీనే కాదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ రెండూ ఒక్కటేనని అన్నారు. బీజేపీ ఉన్నంతకాలం పీఓకేను పాకిస్థాన్‌కు అప్పగించడం సాధ్యం కాదన్నారు. బీజేపీకి 400 సీట్లు వస్తే రిజర్వేషన్ రద్దు చేస్తారని సీఎం రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. మజ్లిస్ ఓటు బ్యాంకుకు రేవంత్‌రెడ్డి భయపడుతున్నారని ఆరోపించారు. బీజేపీ మాత్రం ఓటు బ్యాంకు కోసం ఎన్నడూ భయపడలేదన్నారు. తెలంగాణ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్, మజ్లిస్‌ను రాష్ట్రం నుంచి తరిమే శక్తి బీఆర్‌ఎస్‌కు లేదని, కేవలం బీజేపీకే ఉందని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతికి అడ్డాగా మారిందన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఏటీఎంలా మార్చుకుందని ఆరోపించారు. వికారాబాద్‌లో బుల్లెట్ ట్రైన్ ఆపుతామని తెలిపారు. చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.