మంచి పరిశోధనా గ్రంథం

మంచి పరిశోధనా గ్రంథం‘తెలంగాణ కథ-వర్తమాన జీవన చిత్రణ’ అనే పరిశోధనాంశంపై ఎం.దేవేంద్ర సమర్పించిన సిద్ధాంత గ్రంథం ఇది. ఇందులో ముందుగా తెలంగాణ కథను యుగవిభజన చేసుకున్నారు. మొదట 1902 నుండి 1956 వరకు వచ్చిన కథలని తొలితరం కథలుగా 1957 నుండి 1975 వరకు వచ్చిన కథలను మలితరం కథలుగా 1976 నుండి 1990 వరకు వచ్చిన కథలను మూడవతరం కథలుగా విభజించారు.1990 నుండి 2010 వరకు ఉన్న రెండు దశాబ్దాల కాలాన్ని నాలుగవ తరంగా పేర్కొంటూ దాన్ని తన పరిశోధనాంశంగా దేవేంద్ర స్వీకరించారు. ఈ కాలంలోని కథని వారు వర్తమాన కథగా పేర్కొంటున్నారు. సిద్ధాంత గ్రంథంలోకి వెళ్లే ముందు తెలంగాణ తొలితరం కథ, మలితరం కథ, మూడోతరం కథలను – అందులోని సమకాలీన జీవన చిత్రణను క్లుప్తంగా వివరించిన విధానం బాగుంది.
వర్తమాన కథకుల విషయానికి వస్తే ఒకప్పటి కంటే ఈ రెండు దశాబ్దాలలో కథావేగం, కథ పరిణతి పెరిగింది. జీవన వాస్తవికతను చిత్రించడంలో తెలంగాణ కథ బహుముఖాలుగా విస్తరించింది. నాలుగవ తరంలో అన్ని వర్గాల నుండి కథకులు ఎదిగి వచ్చి తమ అస్తిత్వాలను, అనుభవాలను, సామాజిక పోకడలను కథలుగా రాశారు. ఇది ఒక మంచి సాహిత్య పరిణామంగా చెప్పవచ్చు. ఈ రెండు దశాబ్దాల తెలంగాణ కథ బహుముఖ కోణాలను స్పృశించింది. మారుతున్న పరిస్థితుల కనుగుణంగా కథలు చదివే పాఠకులు ఎక్కువయ్యారు. పత్రికల్లో కథలను క్రమం తప్పకుండా వేస్తూ ఆదరిస్తున్నాయి. ఈ రెండు దశాబ్దాలలో కథా రచయితలను గమనించినట్లయితే, అన్ని వర్గాల నుండి కథకులుగా ఎదిగిన తీరు కనబడుతుంది. తెలంగాణాలో రెండు దశాబ్దాల (1990-2010) కథలను సేకరించినప్పుడు కథా సంపుటాలు, కథ సంకలనాలలో మూడు వేల కథలకు పైగా పరిశోధకురాలు దృష్టిలోకి రావడం గమనించదగ్గ విషయం. ఒకప్పుడు విమర్శకులు తెలంగాణ కథలో శిల్పం కంటే జీవితం ఉంటుందనే విషయాన్ని తోసి పుచ్చి, ఇప్పటి కథలో శిల్పం, జీవితం రెండు ఉన్నాయని పరిశోధకురాలు నిర్ధారిస్తున్నారు. వారి పరిశోధనాంశం జీవన చిత్రణ కాబట్టి వారు శిల్పంపై దృష్టి కేంద్రీకరించలేదు. జీవితం సమగ్ర చిత్రణలో అంది వచ్చిన కథలనే స్వీకరించి వాటిని విశ్లేషించడం ఈ సిద్ధాంత గ్రంథంలో కనిపిస్తుంది.
తెలంగాణ జీవితాన్ని గురించి చెప్పిన రచయితల్లో తెలంగాణలో పుట్టి, తెలంగాణలో పెరిగి స్థిరపడి కథలు రాస్తున్న రచయితలు ఉన్నారు. మూడవతరం కథా రచయితలుగా కథాప్రయాణం సాగించి ఆ తర్వాత నాలుగవతరంలో రచనలు కొనసాగిస్తున్న వారు ఉన్నారు. వీరు కాకుండా కొత్తగా ఎదిగిన కథకులు కూడా ఈ కాలంలో మనకు కనిపిస్తారు. రచయితల ప్రత్యేకతలను గురించి వివరిస్తూ, జీవన చిత్రాణలను విశ్లేషించడం ఇందులో చూడవచ్చు. ముందుగా తెలంగాణలో చోటు చేసుకున్న రెండు దశాబ్దాలలోని ఆర్థిక సామాజిక రాజకీయ పరిణామాలను విశ్లేషణాత్మకంగా వివరించారు. తర్వాత తెలంగాణ కథా రచయితల పరిచయంతో పాటు తెలంగాణ కథకు సాహిత్య సంస్థల కృషిని గురించి కూడా వివరించారు. తర్వాత ఆయా కథారచయితల కథలలో చోటు చేసుకున్న వైయక్తిక జీవనం… అనగా కుటుంబ జీవితం – సంబంధాలు, తర్వాత గ్రామ జీవితం, నగర జీవితం, వలస జీవితం, గిరిజన జీవితం అనే విభాగాలుగా విభజించుకొని వివరించారు.
‘తెలంగాణ కథ -ప్రపంచీకరణ’ అనే మూడవ అధ్యాయంలో ప్రపంచీకరణ నిర్వచనాలు, వాటి అనుకూల, ప్రతికూల భావనలు అవి ప్రజాజీవనంపై వాటి ప్రభావాన్ని వివరించారు. ముందుగా ప్రపంచీకరణలో వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, విద్యారంగాలలో చోటు చేసుకున్న మార్పులను గురించి వివరించారు. తర్వాత కులవృత్తుల విధ్వంసాన్ని, మానవ సంబంధాలలో వస్తున్న మార్పులను విశ్లేషించి చూపారు. నాల్గవ అధ్యాయం ‘తెలంగాణ కథ -అస్తిత్వ స్పృహ’. అస్తిత్వ స్పృహ అంటే వివరించి, అందులో భాగంగా వచ్చిన ప్రాంతీయ అస్తిత్వం, వర్గాస్తిత్వం, సాహిత్యంలో అస్తిత్వ చేతన, అస్తిత్వ దూరాల గురించి చెబుతూ స్త్రీవాదం, దళితవాదం, బహుజనవాదం, మైనారిటీ వాదం, ప్రాంతీయ చైతన్యం ఎలా తెలుగు కథలలో చోటు చేసుకున్నాయో వివరించి చూపారు.
ఐదవ అధ్యాయం ‘తెలంగాణ కథ- సంస్కృతి’. ఇందులో సంస్కృతి అంటే ఏమిటో వివరించి, అందులో భాగమైన నమ్మకాలు, విశ్వాసాలు, పండుగలు, కళలు, ఉత్సవాలు, జాతరలు, ఆచారాలు, ఆహార్యం, ఆహారం, భాష మొదలైన అంశాలన్నీ తెలంగాణ కథలలో ఎలా భాగమయ్యాయో వివరించి చూపారు.
తెలంగాణ జీవితంలోని సమస్యలను, సంఘర్షణలను ప్రధానంగా ఈ సిద్ధాంత గ్రంథంలో వివరించి, తెలంగాణ నేలపై కథా స్రవంతి ఆవిష్కరింపబడిన తీరు, కథ, కథా నేపథ్యాలు, కథాకాలంనాటి పరిస్థితులు, కథ పరమార్ధాలు- ఉద్దేశాలు, తెలంగాణ జీవితాన్ని ఏ విధంగా నిర్వహించాయో నిశితంగా పరిశీలించారు. కులాల వారీగా, మతాలవారీగా, వృత్తి పనుల వారిగా తెలంగాణలో కనిపించే వివాహాలు, పండుగలు, నమ్మకాలు, ఆచారాలు తెలంగాణ సౌందర్యాన్ని ఇనుమడింపజేస్తున్నాయని విశ్లేషించి, వాటిని వివరించారు. అలా తెలంగాణ ప్రాంత ప్రత్యేకతను, సంస్కృతిని తెలియజేస్తూనే ఇక్కడ జీవితంలో ఉన్న సంఘర్షణలు, సమస్యలను చిత్రీకరించిన మొట్టమొదటి పరిశోధన గ్రంథముగా దీని గురించి చెప్పుకోవచ్చు. పరిశోధకురాలు డాక్టర్‌ ఎం.దేవేంద్ర విస్తృత పరిశోధనలతో అనేక కొత్త విషయాలను ఇందులో తెలిపిన రీతి చాలా బాగుంది. ఇది భవిష్యత్‌ తరాలకు ఒక మంచి రిఫరెన్స్‌ పుస్తకముగా నిలిచిపోతుందని చెప్పవచ్చు.

– కె.పి అశోక్‌ కుమార్‌
9700000948