– టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మెన్ మధు యాష్కీగౌడ్
– అధిక మొత్తంలో నగదు ఉందనే నెపంతో ఆయన ఇంటిపై దాడి
నవతెలంగాణ-హయత్‌నగర్
పోలీసుల దాడులకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు భయపడబోరని టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మెన్, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ తెలిపారు. హైదరాబాద్ హయత్ నగర్‌లోని ఆయన ఇంట్లో నగదు పంపిణీ కోసం అధిక మొత్తంలో డబ్బులు ఉంచారన్న ఫిర్యాదుతో ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు ఆదివారం ఆయన ఇంటిపై దాడి చేశారు. ఇంట్లో డబ్బులు దొరకకపోవడంతో అధికారులు తిరిగి వెళ్లిపోయారు. అనంతరం మధుయాష్కీగౌడ్ మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లోనూ తన ఇంటిపై దాడి చేశారని, కార్యకర్తలను భయభ్రాంతులను గురి చేయాలన్న ఉద్దేశంతోనే పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్కాజిగిరిలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందన్న భయంతో బీజేపీ నాయకులు తన ఇంట్లో కోట్ల రూపాయలు ఉన్నాయంటూ తప్పుడు ఫిర్యాదు చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రంలో అధికారంలో ఉన్నామన్న ధీమాతో పోలీసులతో దాడి చేయిస్తున్నారని, వారికి ఓటమి భయం పట్టుకుందని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికలకు భిన్నంగా ఎల్బీనగర్‌లో కాంగ్రెస్ ముందంజలో ఉందని, 30 వేల మెజార్టీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎల్బీనగర్‌లో కాంగ్రెస్ ఇన్‌చార్జిగా పని చేస్తున్నందుకే తన ఇంటిపై దాడి చేశారని తెలిపారు.