– రాష్ట్ర సీఐడీ నుంచి సీబీఐకి వెళ్లిన ప్రక్రియ
నవతెలంగాణ – ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన ఎస్‌ఐబీ మాజీ ఐజీ ప్రభాకర్‌రావు కోసం రాష్ట్ర పోలీసులు రెడ్ కార్నర్ నోటీసు జారీ చేశారు. రెండు రోజుల క్రితమే ప్రభాకర్‌రావు అరెస్టును ఆదేశిస్తూ నాంపల్లి కోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా, ఆయన దేశంలో లేకపోవడంతో ఆచూకీ కోసం ఇంటర్‌పోల్ విభాగానికి రాష్ట్రంలో నోడల్ విభాగమైన సీఐడీ నుంచి రెడ్‌కార్నర్ నోటీసు జారీ అయింది. ఈ నోటీసు ఆధారంగా ఇంటర్‌పోల్‌ను సంప్రదించి ప్రభాకర్‌రావును అరెస్టు చేయాలని పోలీసులను కోరుతూ సీఐడీ విభాగం నుంచి సీబీఐకి రెడ్‌కార్నర్ నోటీసు రిక్వెస్టుకు వెళ్లింది. దీని ఆధారంగా సీబీఐ అధికారులు ఇంటర్‌పోల్‌కు ప్రభాకర్‌రావు సమాచారాన్ని పంపించి ఆయన ఆచూకీ కనిపెట్టి అదుపులోకి తీసుకుని తమకు అప్పగించాలని సీబీఐ కోరుతోంది. దీనికి సంబంధించిన ప్రక్రియ ఇప్పటికే మొదలైందని సీఐడీ విభాగానికి చెందిన ఒక ఉన్నతాధికారి తెలిపారు. ఇదే కేసులో ఆరో నిందితుడైన ఐ న్యూస్ సీఈఓ శ్రవణ్‌కుమార్‌కు కూడా రెడ్‌కార్నర్ నోటీసు జారీ అయినట్టు తెలిపారు. దీంతో ఫోన్‌ట్యాపింగ్ కేసు దర్యాప్తు ముమ్మరమైందని స్పెషల్ టీం అధికారులు తెలిపారు.