అక్రమ నిర్మాణాలను అధికారులు అడ్డుకోవాలి

నతెలంగాణ-మందమర్రి
తమ భూమిని జుమ్మిడి విశ్వనాథ్‌ అనే వ్యక్తి కబ్జా చేసి అక్రమ నిర్మాణం చేపడతున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని బాధిత మహిళ వడాల దుర్గమ్మ తెలిపారు. మంగళవారం బీఆర్‌ఎస్‌ నాయకులతో కలిసి వడాల దుర్గమ్మ ప్రెస్‌ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. మందమర్రి శివారులోని సర్వే నంబర్‌ 146/63 తనకు చెందిన భూమిని జుమ్మిడి విశ్వనాథ్‌ కబ్జా చేసి అక్రమ నిర్మాణం చేపడతున్నాడని మున్సిపల్‌ అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఫలితం లేకపోవడంతో హైకోర్టును ఆశ్రయించడంతో డబ్ల్యూ పి 1659/2024 కేసు నమోదు చేసి అక్రమ నిర్మాణాలపై రెండు వారాల్లో చర్యలు తీసుకోవాలని 28/02/2024 తేదీన ఆర్డరు ఇచ్చినప్పటికీ మున్సిపల్‌ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని తెలిపారు. విశ్వనాధ్‌ అధికార పార్టీకి చెందిన వ్యక్తి అని వివేక్‌ అనుచరుడు కాబట్టి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. 1/70 చట్టానికి తూట్లు పొడుస్తూ అక్రమ నిర్మాణలను ప్రోత్సహించడం దారుణమని, ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకుని హైకోర్టు తీర్పును అమలు చేసి తమకు న్యాయం చేయాలని, తన అనుచరుల పద్దతి మార్చుకోమని చెప్పి 1/70 యాక్ట్‌ను కాపాడాలని ఎమ్మెల్యే వివేక్‌ ని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు అనపర్తి మధుకర్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు ఎంవీ గుణ, బొడ్డు వినోద, పద్మ పాల్గొన్నారు.