ఉమ్మడి మహబూబ్‌నగర్‌ ప్రాజెక్టుల సలహాదారునిగా రంగారెడ్డి

– సర్కారు ఉత్తర్వులు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా నీటిపారుదల ప్రాజెక్టుల సలహాదారులుగా ఎన్‌.రంగారెడ్డి నియమితులయ్యారు. గతంలో సీఎం సలహాదారులుగా పనిచేసిన రంగారెడ్డి, ప్రధానంగా పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో కీలకపాత్ర పోషించారు. ముక్కుసూటి అధికారిగా పేరు ఉండటంతో ఆయన్ను గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కొనసాగించలేదనే ప్రచారం సాగునీటి పారుదలశాఖలో ఉంది. కల్వకుర్తి, నెట్టెంపాడు, రాజీవ్‌ భీమాతోపాటు పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేసేందు కుగాను రాష్ట్ర ప్రభుత్వం ఈ నియామకాన్ని చేపట్టింది. ఈమేరకు నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్‌ బొజ్జా మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. నెలరోజుల తర్వాత రంగారెడ్డి బాధ్యతల్లోకి వస్తారని సమాచారం.