వచ్చే మూడ్రోజులు వర్షసూచన

Rain forecast for the next three days– అక్కడక్కడా ఈదురు గాలులు వీచే అవకాశం
– రాష్ట్రంలో 60 ప్రాంతాల్లో వర్షపాతం నమోదు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలో వచ్చే మూడ్రోజులు పలు జిల్లాలకు వర్షసూచన ఉన్నట్టు వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరిక జారీ చేసింది. ఆ జాబితాలో ఆదిలాబాద్‌, కొమ్రంభీమ్‌ అసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, నాగర్‌కర్నూల్‌ జిల్లాలను చేర్చింది. మంగళవారం ఉదయం 8:30 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు రాష్ట్రంలో 60 ప్రాంతాల్లో వర్షం కురిసింది. భదాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మండాలపల్లిలో అత్యధికంగా 4.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 11 ప్రాంతాల్లో మోస్తరు వాన పడింది. వాతావరణం చల్లబడటంతో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే కొంత మేర తగ్గాయి. జగిత్యాల జిల్లా జైనలో అత్యధికంగా 42.9 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. కేవలం ఐదు జిల్లాల్లోనే 42 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్‌, దాని పరిసర ప్రాంతాల్లో వచ్చే 48 గంటల పాటు ఆకాశం మేఘావృతమై ఉంటుంది. సాయంత్రం, రాత్రి సమయాల్లో అక్కడక్కడా ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే సూచనలున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రత 39 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల మేర నమోదయ్యే అవకాశముంది.