– గ్యారంటీల కోసం అప్పులకుప్పగా తెలంగాణ
– గ్యారేజీ నుంచి కారు బయటకెళ్లడం కష్టమే : ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకిచ్చిన హామీ మేరకు పంద్రాగస్టు లోపు రూ.2 లక్షల రుణమాఫీ చేయకుంటే ఆగస్టులో రాజకీయ సంక్షోభం తప్పదని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, ఎంపీ డాక్టర్ ఎంపీ కె.లక్ష్మణ్ బాంబు పేల్చారు. ఆరు గ్యారంటీల అమలు కోసం రూ.2 లక్షల కోట్లు అవసరమనీ, వాటి పేరిట తెలంగాణను మరింత అప్పులకుప్పగా మార్చే యత్నం జరుగుతున్నదని విమర్శించారు. దీంతో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ సంక్షోభం దిశగా వెళ్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి 370, ఎన్డీయే కూటమికి 400 సీట్లు వస్తాయని మరోమారు చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అవినీతిపరులపై చర్యలు తీసుకోలేదనీ, ధరణి సమస్యల పరిష్కారానికి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని విమర్శించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ చచ్చిన పాములా మారిందనీ, కారు గ్యారేజీ నుంచి బయటకు రావడం కష్టమేనని ఎద్దేవా చేశారు. ఎంపీ ఎన్నికల్లో ఆ పార్టీకి డిపాజిట్లు దక్కడం కూడా గగనమని తెలిపారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలో, బీఆర్ఎస్ విలీనం ఖాయమన్నారు. లోక్సభ ఎన్నికల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేల విడిచి సాము చేసి అలవిగాని హామీలు ఇచ్చారన్నారు. బీజేపీ రాజ్యాంగాన్ని మార్చుతుందని సీఎం రేవంత్ రెడ్డి చేసిన తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మలేదని చెప్పారు. హామీలు అమలు చేయకపోతే ప్రజలు కాదు, కాంగ్రెస్ నేతలే తిరగబడుతారని లక్ష్మణ్ హెచ్చరించారు. రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసినా ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రజలు ఆ పార్టీని విశ్వసించలేదన్నారు. ఫేక్ వీడియో తయారు చేసిన రేవంత్ రెడ్డి ఫేక్ సీఎం అని ఎద్దేవా చేశారు. లోక్సభ ఎన్నికల్లో సహకరించిన కార్యకర్తలకు, ప్రజలకు, మీడియాకు ధన్యవాదాలు తెలిపారు.