– రెండేళ్లుగా సేవలకు పెద్దవంగర దూరం
– అప్డేషన్ కు తొర్రూరు, కొడకండ్ల మండలాలకు
– మండలంలో పునరుద్ధరించాలని ప్రజలు వేడుకోలు
నవతెలంగాణ – పెద్దవంగర
ప్రభుత్వ పథకాలు పొందాలన్నా, ఇతర గుర్తింపు పత్రాలు తీసుకోవాలన్నా, విద్యార్థులు పై చదువులకు వెళ్లాలన్నా, ప్రస్తుతం మహిళలు ఆర్టీసీ బస్సు ఎక్కాలన్నా ఆధార్ తప్పనిసరి. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీల అమలు దరఖాస్తుల స్వీకరణకు సైతం ఆధార్ కార్డు కీలకం. ఇంతటి ప్రాధాన్యత సంతరించుకున్న ఆధార్ కార్డులో మార్పులు, చేర్పులు చేసుకోవడానికి, కొత్తగా పొందడానికి, ఉన్నవారు ఫోన్ నంబర్ లింక్ చేసుకోవడానికి ఆధార్ సెంటర్ లేక మహబూబాబాద్ జిల్లాలోని పెద్దవంగర మండల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆధార్ సేవల కోసం జిల్లాలోని తొర్రూరు, జనగాం జిల్లా కొడకండ్ల మండలాలకు వెళ్లాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, మండల కేంద్రంలో ఆధార్ కేంద్రం ఏర్పాటు కోసం చర్యలు తీసుకోవాలి.
ప్రభుత్వ పథకాలకు ఆధారే పెద్ద దిక్కు..
ముఖ్యంగా ప్రభుత్వ పథకాలు అందుకోవాలంటే ఆధార్ కార్డు తప్పనిసరి. దీంతో పాటుగా వివాహం కావడం, ఇంటిపేరు, కేరాఫ్ చిరునామా, ఉద్యోగ, ఉపాధి రీత్యా, నివాసం, మొబైల్ నంబర్ మారడంతో అప్డేషన్ కు ఆవశ్యకత ఏర్పడింది. రేషన్ బియ్యం తీసుకోవాలన్నా, ప్రతి ఒక్కరు ఆధార్ కలిగి ఉండాలి. మరి ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఆధార్ నమోదు సెంటర్ మండలంలో సుమారు రెండేళ్ళ క్రితం మూతపడింది. దీంతో అప్పటి నుండి మండల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
గతంలో ఉండే.. కానీ…
గతంలో మండల కేంద్రంలో ఆధార్ కేంద్రం ఉండేది. కానీ ఆధార్ కేంద్రం నిర్వాహకుడు ఆధార్ నమోదు ప్రక్రియలో మిస్టెక్స్ చేయడం వల్ల ఆధార్ కేంద్రాన్ని సుమారు రెండేళ్ళ క్రితం సంబంధిత అధికారులు బ్లాక్ చేశారు. అప్పటి నుంచి మండల వాసులు ఆధార్ సేవలకు దూరమయ్యారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి మండలంలో ఆధార్ కేంద్రాన్ని పునరుద్ధరించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
ఆధార్ సెంటర్ ను ఏర్పాటు చేయాలి.
నా ఆధార్ కార్డులో బయోమెట్రిక్ అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంది. మండలంలో ఆధార్ సెంటర్ లేకపోవడంతో తొర్రూరు మండలానికి వెళ్లాల్సిన పరిస్థితి. అక్కడికి వెళ్లాక సర్వర్ రాకపోవడంతో సమయం, డబ్బు వృధా అవుతుంది. మండలంలో ఆధార్ సెంటర్ ను వెంటనే ఏర్పాటు చేయాలి: చెరుకు యాకయ్య (పెద్దవంగర).
వేలు ముద్రలు పడడం లేదు…
ప్రతి నెలా పెన్షన్ డబ్బులు తీసుకోవడానికి వేలు ముద్రలు పడకపోవడంతో ఇబ్బంది పడుతున్నా. మండల కేంద్రంలో ఆధార్ కేంద్రం లేకపోవడంతో ఇంకా ఆధార్ అప్డేషన్ చేయించలేదు. పెద్దవంగర పట్టణ కేంద్రంలో ఆధార్ కేంద్రం ఏర్పాటు చేస్తే మండల ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది: సుంకరి లక్ష్మీనర్సమ్మ (పెద్దవంగర).