నీరజ్‌, నందిని పసిడి షో

నీరజ్‌, నందిని పసిడి షో– 27వ ఫెడరేషన్‌ కప్‌
భువనేశ్వర్‌ (ఒడిశా) : 27వ ఫెడరేషన్‌ కప్‌ జాతీయ చాంపియన్‌షిప్స్‌లో ఒలింపిక్‌ స్టార్‌ నీరజ్‌ చోప్రా పసిడి ప్రదర్శన చేశాడు. దోహా డైమండ్‌ లీగ్‌లో సిల్వర్‌ మెడల్‌ సాధించిన నీరజ్‌ చోప్రా 2021 తర్వాత తొలిసారి దేశవాళీ టోర్నీ బరిలోకి దిగాడు. అర్హత పోటీల నుంచి మినహాయింపు లభించటంతో నీరజ్‌ చోప్రా నేరుగా మెడల్‌ ఈవెంట్‌కు వచ్చాడు. మెన్స్‌ జావెలిన్‌ త్రోలో ఆడుతూ పాడుతూ బల్లెం విసిరి బంగారు పతకం సొంతం చేసుకున్నాడు. తొలి ప్రయత్నంలో 82 మీటర్ల దూరం విసిరిన నీరజ్‌ చోప్రా.. ఓ దశలో మను తర్వాతి స్థానంలో నిలిచాడు. చివరి రెండు ప్రయత్నాల్లో బల్లెం పట్టుకోని నీరజ్‌ చోప్రా 82.27 మీటర్ల దూరంతో పసిడి పతకం సాధించాడు. ఆఖరు రెండు ప్రయత్నాల్లో ఫౌల్‌గా నిలిచిన మను రెండో స్థానానికి పరిమితం అయ్యాడు. ఒక ఒలింపిక్‌ గోల్డ్‌ మెడలిస్ట్‌ నీరజ్‌ చోప్రా రాకతో ఫెడరేషన్‌ కప్‌ వేదిక కళింగ స్టేడియం ఊగిపోయింది. అథ్లెట్లు, అభిమానులు నీరజ్‌ చోప్రా ప్రదర్శనకు నీరాజనం పలికారు.
నందిని బంగారం : తెలంగాణ ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ స్టార్‌ నందిని అగసార ఫెడరేషన్‌ కప్‌లో బంగారు పతకం సాధించింది. మహిళల హెపథ్లాన్‌లో నందిని పసిడి ప్రదర్శన చేసింది. మొత్తం ఏడు విభాగాల్లో పోటీల అనంతరం నందిని అగ్రస్థానంలో నిలిచింది. 100 మీ హార్డిల్స్‌, హైజంప్‌, షాట్‌పుట్‌, 200 మీ పరుగు, లాంగ్‌జంప్‌, జావెలిన్‌ త్రో సహా 800 మీ పరుగు పందెంలో నందిని అదరగొట్టింది. 5460 పాయింట్లతో నందిని పసిడి ముద్దాడగా… 4997 పాయింట్లతో అనామిక (కేరళ), 4817 పాయింట్లతో దీపిక (తమిళనాడు) రజత, కాంస్య పతకాలు దక్కించుకున్నారు.