– పెద్దఎత్తున ల్యాప్‌టాప్‌లు,సెల్ఫోన్లు, సిమ్‌కార్డులు స్వాధీనం చేసుకున్న సీఐడీ
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో పెద్ద ఎత్తున క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న ఒక ముఠాను అరెస్ట్ చేసినట్టు సీఐడీ అదనపు డీజీ షికా గోయెల్ బుధవారం తెలిపారు. దేశంలో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌ల జోరు సాగుతున్న నేపథ్యంలో కేసర కేశవరావు అనే వ్యక్తి ఒక ముఠాను తయారు చేసి పెద్ద ఎత్తున క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్నట్టు సీఐడీకి సమాచారమందింది. దీంతో సీఐడీ అధికారులు.. కేశవరావును బుధవారం అరెస్ట్ చేశారు. అతనిచ్చిన సమాచారం మేరకు ప్రవీణ్ షిండేతో పాటు మరో ఇద్దరు బెట్టింగ్‌కు పాల్పడుతున్న యువకులను కూడా అరెస్ట్ చేశారు. కేశవరావు వద్ద నుంచి రెండు ల్యాప్‌టాప్‌లు, 20కి పైగా సెల్ఫోన్లు, మరో 20కి పైగా సిమ్‌కార్డులు, పెద్ద సంఖ్యలో డెబిట్ కార్డులతో పాటు, 20కి పైగా బ్యాంకు పాస్‌బుక్‌లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లు మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకు భారీ మొత్తంలో బెట్టింగ్‌లకు పాల్పడినట్టు షికా గోయెల్ తెలిపారు. బెట్టింగ్‌లలో బుకీలుగా మారినవారికి ఒక్కొక్కరికి 30 శాతం కమిషన్‌ను కూడా కేశవరావు చెల్లించేవాడని ఆమె తెలిపారు. కేశవరావు ముఠాతో పాటు మరికొంతమంది కూడా బెట్టింగ్‌లకు పాల్పడుతున్నట్టు సమాచారమున్నదనీ, వారిని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తామని ఆమె తెలిపారు.