వడ్లు కొనుగోలు చేయాలని రోడ్డు ఎక్కిన అన్నదాతలు..

– ప్రభుత్వ తీరుపై రైతుల ఆగ్రహం..
నవతెలంగాణ – వేములవాడ 
వేములవాడ – కరీంనగర్ ప్రధాన రహదారిపై వేములవాడ అర్బన్ మండలం అనుపురం గ్రామానికి చెందిన రైతులు ధర్నా, రాస్తారోకో కు దిగారు.. వడ్లు కొనుగోలు చేయాలని ఆందోళన బాట పట్టారు.. శుక్రవారం రైతులు రోడ్డుపై బైఠాయించడంతో రెండు వైపులా భారీగా వాహనాలు నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రైతులు నిరసనలు తెలిపారు.. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ వరి ధాన్యం త్వరగా కొనుగోలు చేసి కేంద్రం నుంచి ధాన్యాన్ని తరలించాలని కోరారు. ధాన్యం మ్యాచర్ కు వచ్చి 15 రోజులు గడుస్తున్న లారీలు రాకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షాలకు తడిసి ధాన్యం  మొలకెత్తుతున్నాయని వెంటనే సంబంధిత అధికారులు లారీలను కేటాయించి కొనుగోలు కేంద్రాల్లోంచి ధాన్యాన్ని తరలించాలని రైతులు డిమాండ్ చేశారు.  సుమారు గంట పాటు నిర్వహించిన ధర్నాతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచి పోవడంతో,విషయం తెలుసుకున్న పట్టణ సిఐ బి వీరప్రసాద్ సంఘటన స్థలానికి చేరుకొని రైతులను శాంతింప చేసి, మీ సమస్యను ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇవ్వడంతో రైతులు  ధర్నాను విరమించారు.  అనుపురం ఐకెపి సెంటర్ ను డిసిఒ సందర్శించి పది రోజుల్లో దాన్యం కొనుగోలు చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు.