నడక ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీన్ని సులభమైన వ్యాయామాల్లో ఒకటిగా పేర్కొంటారు వైద్య నిపుణులు. రోజూ వాకింగ్ చేస్తే ఎన్నో రోగాలు నయమవుతాయని, శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుందని అనేక అధ్యయనాల్లో తేలింది. వేగవంతమైన నడకతో కలిగే ప్రయోజనాలను చూద్దాం.
కండరాలు, కీళ్ళకు బలం: వేగవంతమైన నడకను మీ దినచర్యలో భాగం చేసుకోవడం ద్వారా మీ శరీరం మరింత దృఢంగా తయారవుతుంది. వేగంగా కండరాలను కదిలించడం ద్వారా మీ కండరాలకు బలం చేకూరుతుంది. ముఖ్యంగా వెన్నునొప్పి సమస్యతో బాధపడుతున్న వారికి వేగంగా నడవడం కొంత ఉపశమనాన్ని అందిస్తుంది. ఇది రక్త ప్రసరణను పెంచడంలో కూడా సహాయపడుతుంది.
మెరుగైన జీవక్రియ: మీరు వేగంగా నడవడానికి, మీ శరీరానికి ఎక్కువ శక్తి అవసరం. వేగంగా నడవడం ద్వారా మీ శరీర జీవక్రియను మెరుగుపడుతుంది. మీ శరీర బలాన్ని సంపూర్ణంగా ఉపయోగించుకోవడంలో సహాయపడుతుంది. ఇది మీ శరీరంలో జీర్ణక్రియను కూడా ప్రేరేపిస్తుంది. మీ శరీరంలో కొవ్వు శాతాన్ని తగ్గించి పొట్ట వద్ద కొవ్వును తగ్గిస్తుంది.
హార్మోన్ల నియంత్రణ: విరామం లేకుండా పని చేయడం, శారీరక శ్రమ లేకపోవడం అనేవి హార్మోన్ల ఆరోగ్యంపై గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తాయి. కార్టిసాల్ వంటి ఒత్తిడి కలుగజేసే హార్మోన్లను తగ్గించడమే కాకుండా, ఎండార్ఫిన్లు, హార్మోన్లను కూడా ఉత్పత్తి చేస్తుంది. ఎండోర్ఫిన్లు కూడా శరీరంలో సానుకూల అనుభూతిని కలిగిస్తాయి. పిసిఓడి వంటి హార్మోన్ల అసమతౌల్యత కారణంగా ఉత్పన్నమయ్యే ఆరోగ్య సమస్యలను తగ్గించడానికి ఈ వేగవంతమైన నడక సహాయపడుతుంది.
అధిక బరువుకు చెక్: వేగవంతమైన నడక ద్వారా మీరు క్యాలరీల రూపంలో ఎక్కువ శక్తిని బర్న్ చేస్తారు. ఇది మీ కండరాల శక్తిని పెంచుతుంది. తద్వారా మీ శరీర బరువును నియంత్రిస్తుంది. మీ వయస్సుకు తగ్గట్లు శరీర బరువు ఉండేలా చేస్తుంది. ఏదైనా అదనపు కొవ్వు తగ్గించడానికి నడక చాలా సహాయపడుతుంది. అంతేకాక, నడుము చుట్టూ ఉన్న కొవ్వును కరిగించడానికి, గుండె వేగంగా కొట్టుకోవడానికి బ్రిస్క్ వాక్ ఎంతగానో ఉపయోగపడుతుంది. నడక సమయంలో గట్టిగా ఊపిరి పీల్చుకోవడం ద్వారా మీ కొవ్వు కరుగుతుంది. ఇది మీ కేలరీలను వేగంగా కోల్పోవటానికి సహాయపడుతుంది.
మెరుగైన ఆరోగ్యం: వేగవంతమైన నడక వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది మీకు శారీరక వ్యాయామంగా పనిచేస్తుంది. అంతేకాక, మీ గుండెకు ఆరోగ్యం చేకూర్చుతుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. డయాబెటిస్ నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది. మీ కండరాలలోని కణాలు శక్తిని పొందటానికి బాగా పనిచేస్తుంది. అంతేకాక, రక్తపోటును నియంత్రించడం, మెరుగైన రక్త ప్రసరణ, ఆక్సిజన్ ప్రసరణ, సమతుల్య కొలెస్ట్రాల్, రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణ వంటి ప్రయోజనాలను చేకూర్చుతుంది.