ఊరట..

Cool..‘క్షణ క్షణం మారుతున్న లోకాన్ని / సరిగా అర్ధం చేసుకున్న వాళ్లంతా/ పేద ప్రజల పక్షం వహించడమే/ పెద్ద అపరాధమై పోయింది’ అని బాధపడ్డాడు మహాకవి. నేడు న్యూస్‌క్లిక్‌ ఆన్‌లైన్‌ పోర్టల్‌ వ్యవస్థాపక సంపాదకులు ప్రబీర్‌ పుర్కాయస్థ విషయంలో అదే జరిగింది. దానినే తాజాగా సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ‘ఉపా’ కేసు బనాయించి సరైన ఆధారాలు చూపడంలో విఫలమాయ్యా రంటూ పోలీసులకు న్యాయస్థానం తలంటు పోసింది. అరెస్టు చెల్లదని స్పష్టమైన తీర్పునిచ్చింది. మార్చిలో ప్రొపెసర్‌ సాయిబాబాకు బెయిల్‌ ఇచ్చినప్పుడు, నిన్న ప్రబీర్‌కు బెయిల్‌ ఇచ్చే సందర్భంలోనూ సర్వోన్నత న్యాయస్ధానం రిమాండ్‌ కాపీని అందించకుండా వారి హక్కులను హరించడానికి మీరెవరంటూ పోలీసులకు గట్టిగా అక్షింతలు వేసింది. ఏడు నెలల నిర్భంధం తరువాత సుప్రీంకోర్టు చొరవతో ప్రబీర్‌ పుర్కాయస్థ బుధవారం విడుదల కావడం హర్షించదగ్గ పరిణామం.
అరెస్టుకు కారణాలేమిటో పోలీసులు రాతపూర్వకంగా నిందితులకు తెలపాల్సిందేనని గతంలో పంకజ్‌ బన్సాల్‌ కేసులో గీసిన గీతలు ఈ కేసుకూ వర్తిస్తాయని న్యాయస్ధానం స్పష్టంచేసింది. సహజ న్యాయసూత్రాల ఉల్లంఘనపైనా ద్విసభ్య ధర్మాసనం నిప్పులు చెరిగింది. ఈ తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు కాగా, ప్రజాస్వామ్య వాదులకు గొప్ప ఊరట. మనీ లాండరింగ్‌ కేసులో నిందితులను ఏకపక్షంగా, ఎడాపెడా అరెస్టు చేయకుండా ఈడీపై సుప్రీంకోర్టు ఆంక్షలు విధించింది. ఈడీ అధికారాలకు కళ్లెం వేస్తూ, అరెస్టుకు న్యాయస్థానం అనుమతి తప్పనిసరి అని గురువారం స్పష్టం చేసింది.
ఢిల్లీలో సిఎఎ వ్యతిరేక ఆందోళన వార్తలను, రైతుల ఉద్యమం విశేషాలను ‘న్యూస్‌క్లిక్‌’ నిరంతరంగా ప్రచురించింది. అధికార శ్రేణులకు మింగుడుపడని మరెన్నో అంశాల్ని వెలుగులోకి తెచ్చింది. దీంతో అధికారపార్టీ ప్రబీర్‌పై కక్ష కట్టింది. ఢిల్లీ ప్రత్యేక పోలీసు విభాగాన్ని గతేడాది అక్టోబర్‌ 3న సోదాలకు పంపింది. చైనా ప్రభుత్వం డబ్బుతో ఈ ఉద్యమాలకు దోహదం చేస్తున్నారని ‘న్యూయార్క్‌ టైమ్స్‌’లో అదే ఏడాది ఆగస్టులో ప్రచురించబడ్డ తలాతోకా లేని కల్పిత కథనాన్ని ఊతంగా చేసుకొని, కుట్ర కథనాన్ని అల్లింది. ఇలా చెప్పుకుంటూ పోతే జర్నలిస్టులపై డజన్ల కొద్దీ కేసులను ఉదహరించ వచ్చు. ప్రజాపక్షం వహించే జర్నలిజాన్ని నియంత్రించ డానికే ప్రభుత్వాలు ఈ చట్టాలను ఉపయోగిస్తున్నాయని ఇది స్పష్టంగా సూచిస్తోంది. ఈ నేపథ్యంలో పత్రికా స్వేచ్ఛ కోసం, నిజమైన జర్నలిజం కోసం పాత్రికేయ సమాజం మాత్రమే కాదు, పౌరసమాజమూ సమాయత్తం కావాలి. అలా చేయడంలో మనం విఫలమైతే, ప్రజాస్వామ్య సౌధమైన నాలుగోస్తంభం కూలిపోతుంది. సత్యాన్ని పలికితే అబద్దానికి కంటగింపు కలుగుతుందని చెప్పడానికి ఇదో తాజా ఉదాహరణ.
2014 నుంచి ఏడేళ్లలో 10,552 మందిపై ‘ఉపా’ కేసులు నమోదైతే, నేరాభియోగాలు రుజువైంది కేవలం 253 మందిపైనేనంటే- కర్కశ చట్టం ఎంత దారుణంగా దుర్వినియోగమవుతోందో వేరే దృష్టాంతాలు అక్కరలేదు. అసలు అభియోగాలే లేకుండా ఎందరో జైళ్లలో మగ్గుతున్నారు. బ్రిటిష్‌ పాలకులు డిఫెన్స్‌ ఆఫ్‌ ఇండియా రెగ్యులేషన్‌ చట్టం-1915 తేస్తే.. నాటి ఎమర్జెెన్సీలో నాసాలు, మీసాలు వచ్చాయి. నేటి మోడీ ప్రజాస్వామ్యంలో ‘ఉపా’లు విజృంభిస్తున్నాయి. మలయాళ వార్తాఛానల్‌ ‘మీడియా వన్‌’ కేసులోనూ తగిన ఆధారాలు లేకుండా జాతీయ భద్రత ముసుగులో ప్రజాహక్కుల్ని ఎవరూ కాలరాయలేరని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ప్రాథమిక హక్కులే వట్టిపోతే నియంతృత్వానికి కోరలు మొలుస్తాయి. అందుకు అవకాశం కల్పిస్తున్న ‘ఉపా’ను వదిలించుకోవడం ప్రజాస్వామ్య మనుగడకే తక్షణావసరం.
ప్రజాస్వామ్య సూత్రాలనూ, పార్లమెంటరీ నియమాలనూ తుంగలో తొక్కి తెచ్చిన వ్యవసాయ చట్టాలు, లేబర్‌ కోడ్‌ల వెనుక దాగిన వాస్తవాలను వెలుగులోకి తెచ్చినందుకే ‘న్యూస్‌క్లిక్‌’పై ఈ నిర్భంధం. లేదంటే, ఇటు ప్రజలనూ, అటు పార్లమెంటునూ విశ్వాసంలోకి తీసుకోకుండా ఏకపక్షంగా దోపిడీదారుల కొమ్ముగాస్తున్న ఈ ప్రభుత్వ తీరు దేనికి సంకేతం..? మనకు మన రాజ్యాంగం హామీ ఇచ్చిన అతి ముఖ్యమైన హక్కు అసమ్మతి హక్కు. ఒక వ్యక్తి చట్టాన్ని ఉల్లంఘించనంతవరకూ, కలహాలను రేకిత్తించనంతవరకూ, తన భిన్నమైన, తాను నమ్ముతున్న అభిప్రాయాన్ని ప్రచారం చేయడానికీ, దానికి మద్దతు కూడగట్టడానికీ అతనికి హక్కు ఉంది. కానీ ఆచరణలో ఈ హక్కు దిక్కులేనిదైన వాస్తవాన్ని మనం చూస్తున్నాం. నేడు దేశంలో ప్రజాప్రతినిధులకే దిక్కులేకుంటే ఇక సాధారణ పౌరులకు ఎక్కడుంటుంది? అందుకే ఈ హక్కు కోసం కొన్ని దేహాలు నెత్తుటి మడుగుల్లో తేలియాడు తున్నాయి… మరికొన్ని ప్రాణాలు చెరసాలల్లో మగ్గుతున్నాయి… మన ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి..? దేశం అప్రమత్తం కావడానికి ఇంతకుమించిన హెచ్చరికలేం కావాలి?