– ధాన్యం కొనుగోళ్లలో పెద్ద కుంభకోణం
– త్వరలో ఆధారాలతో సహా బయటపెడతాం
– రూ.500 బోనస్ బోగస్ మాటలే : బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ధాన్యం కొనుగోళ్ల విషయంలో పౌర సరఫరాల శాఖలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్నదనీ, త్వరలో ఆధారాలతో సహాయ బయటపెడతామని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి చెప్పారు. అదో పెద్ద కుంభకోణమని ఆయన ఆరోపించారు. క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తామన్న సీఎం మాటలు బోగస్ మాటలుగా మారాయని విమర్శించారు. సన్నధాన్యానికే రూ.500 బోనస్ ఇస్తామని ఎన్నికల సమయంలో ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. సన్నాలకే కాదు దొడ్డు వడ్లకూ రూ.500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీజేపీ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని కోమటిరెడ్డి, జగ్గారెడ్డి లాంటోళ్లు మాట్లాడితే స్పందించాల్సిన అవసరం తమకు లేదన్నారు. కాంగ్రెస్‌ది ఎప్పుడు పడిపోతుందో తెలియని ప్రభుత్వమనీ, తమతో చాలా మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని మరోమారు బాంబు పేల్చారు. శుక్రవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎమ్మెల్యేలు రామారావు పటేల్, పాయల్ శంకర్, పి.రాకేశ్‌రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రైతులను మోసం చేసిన గత బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు గద్దెదించితే నేడు రేవంత్‌రెడ్డి సర్కారు అంతకంటే ఎక్కువ మోసం చేస్తున్నదని విమర్శించారు. 45 రోజులుగా కల్లాల్లో ధాన్యం పెట్టుకుని రైతులు ఎదురు చూస్తున్నా ఎందుకు కొనుగోలు చేయడం లేదని నిలదీశారు. రాత్రింబవళ్లు ధాన్యం కుప్పల దగ్గర కాపలా కాస్తూ రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారనీ, అకాల వర్షాలతో తిప్పలుపడుతూ కొందరు పిడుగుపాటుతో మరణించిన ఘటనలు కూడా ఉన్నాయని వివరించారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత తాలు, తేమ పేరుతో మిల్లర్లు ఇష్టానుసారంగా బస్తాకు నాలుగు కేజీలు తరుగు తీయడమేంటని ప్రశ్నించారు. కాంటా వేసిన ధాన్యానికి రసీదు ఇవ్వాలనీ, రైస్ మిల్లులకు పోయిన ధాన్యానికి సైతం రైస్ మిల్లర్లు తరుగు ఎలా తీస్తారని నిలదీశారు. కొనుగోలు కేంద్రాల నుంచి కోట్లాది రూపాయలు లంచాల రూపంలో చేతులు మారుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో ఈ మాఫియాను నడిపిస్తున్నదెవరు? అని ప్రశ్నించారు. రైతుల సమస్యలపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కనీసం స్పందించకపోవడం దారుణమని విమర్శించారు. గత ప్రభుత్వం చెల్లించాల్సిన రైతుబంధును రాష్ట్ర ప్రభుత్వం నేటికీ పూర్తిస్థాయిలో వేయలేదనీ, మరోవైపు ఐదెకరాల లోపు ఉన్న వారికే రైతు బంధు ఇస్తామని పరిమితులు పెట్టి లీకులివ్వడం దారుణమని చెప్పారు. రైతు రుణమాఫీ చేయలేదనీ, రైతు కూలీలు, కౌలు రైతులకు రూ. 12 వేలు ఇవ్వలేదనీ, రాష్ట్ర ప్రభుత్వం 30 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసిందని తప్పుడు లెక్కలు చెబుతోందని విమర్శించారు. వర్షాల నేపథ్యంలోని కల్లాల్లోని ధాన్యాన్ని త్వరితగతిన కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించేదాకా తమ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామనీ, త్వరలోనే కార్యాచరణ రూపొందించుకుని ముందుకు సాగుతామని చెప్పారు. సినిమా డైలాగులకు పరిమితం కాకుండా ఎంత మంది మిల్లర్లపై కేసులు పెట్టారు? ఎంత మందిపై చర్యలు తీసుకున్నారు? అనే దాని గురించి చెప్పాలని ప్రశ్నించారు.