బ్లాక్‌హెడ్స్ విపరీతంగా వేధించే సమస్య. ముఖంపై, ముఖ్యంగా ముక్కుపై ఉండే బ్లాక్‌హెడ్స్ ఇబ్బందులకు గురిచేస్తాయి. రకరకాల సబ్బులతో రుద్దినా, ఎన్నిరకాల ఫేషియల్స్ చేసుకున్నా కొన్నిసార్లు ఈ సమస్య తీవ్రమవుతుంది. ఒక్కోసారి డెర్మటాలజిస్టులతో వారాల తరబడి చికిత్స తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. శరీరాన్ని ఎక్స్ ఫోలియేట్ చేయడం వల్ల చర్మం మృదువుగా మారుతుంది. చర్మంపై ఉన్న మృతకణాలు తొలగిపోతాయి. అందమైన చర్మం అంత సులువుగా రాదు. దాని కోసం క్లెన్సింగ్, మాయిశ్చరైజింగ్-అప్పుడప్పుడూ ‘స్క్రబ్స్’ ఉపయోగించడం వల్ల చర్మ ఛాయ కూడా అందంగా మారుతుంది. చర్మం తేమతో అందంగా, ఆరోగ్యంగా కనిపిస్తుంది.
ముఖంపై, ముఖ్యంగా ముక్కుపై బ్లాక్‌హెడ్స్ ఉంటే వీటిని తొలగించుకునేందుకు డెర్మటాలజిస్టుల దగ్గరికో, బ్యూటీ పార్లర్‌కో వెళ్లకుండా ఇంట్లోనే కొన్నిరకాల ఫేస్‌మాస్క్‌లు తయారుచేసుకోవచ్చు. ఎలాంటి రసాయనాలు లేని, ప్రకృతి సిద్ధమైన పదార్థాలతో వంటింట్లోనే తయారు చేసుకునే కొన్ని మాస్కులు ముక్కుమీద ఉండే బ్లాక్‌హెడ్స్‌ను పోగొడతాయి.
నిజానికి మొటిమలు వేరు, బ్లాక్‌హెడ్స్ వేరు. నూనె పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల, వాయు కాలుష్యం వల్ల ముఖంపై ముందుగా మొటిమల్లాగా మొదలై ఆ తర్వాత నల్లగా మారుతాయి. చర్మం పొడిబార కుండా చర్మగ్రంథుల నుంచి ‘సీబమ్’ ఆయిల్ వెలువడుతుంది. దీనివల్ల కూడా బ్లాక్‌హెడ్స్ ఏర్పడతాయంటున్నారు డెర్మటాలజిస్టులు. చర్మంపై బ్యాక్టీరియా ఉన్నా, మతకణాల వల్ల, మెడికేషన్ వల్ల, హార్మోనల్ తేడాల వల్ల కూడా బ్లాక్‌హెడ్స్ వచ్చే అవకాశం ఉంటుంది.
చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే రక్తధాతువులు ఆరోగ్యంగా ఉండాలి. రక్తానికి, చర్మానికి అవినాభావ సంబంధం ఉంటుంది. రక్తంలో మలినాలు చేరితే చర్మంపై చెడు ప్రభావం చూపిస్తుంది. శరీరంలో మలినాలు పేరుకోకుండా జాగ్రత్త పడాలి. నిత్యం 10 గ్లాసుల నీటిని తీసుకోవాలి. ప్రతి గంటకు కనీసం గ్లాసు నీటిని తాగడం అలవరుచుకోవాలి. పచ్చికూరగాయలు, టమాటా, క్యారెట్, బీట్‌రూట్ రసాల్లో ఏదో ఒకదాన్ని రోజూ తీసుకోవాలి. ముఖ్యంగా మలబద్ధకం లేకుండా చూసుకోవాలి. ఆహారంలో తేలికగా జీర్ణమయ్యే కాయగూరలు, తాజా పండ్లు ఉండేలా జాగ్రత్తపడాలి.
చర్మం ఆరోగ్యం కోసం రోజూ నాణ్యమైన సబ్బుతో స్నానం చేయడంతో పాటు.. క్లెన్సింగ్, మాయిశ్చరైజింగ్ వంటివి తప్పనిసరిగా పాటించే పద్ధతులుగా మారిపోయాయి. అయితే రోజూ ఇలా ఎంత చేసినా అప్పుడప్పుడూ మరికొంత కేర్ తీసుకుంటే కానీ చర్మం అట్రాక్టివ్‌గా కనిపించదు. అందుకే అప్పుడప్పుడైనా సరే చర్మాన్ని స్క్రబ్ చేస్తూ ఉండాలి. దీని కోసం మార్కెట్లో లభించే బాడీ స్క్రబ్స్ కంటే ఇంట్లో తయారుచేసుకొనే స్క్రబ్స్ మంచి ఫలితాన్ని అందిస్తాయి.
ముందుతరాల వారు నలుగుపిండి ఉపయోగించే వారు. పెసరపిండి, శెనగపిండి, పసుపు కలిపి దీన్ని తయారు చేస్తారు. ఇది చర్మరంధ్రాల్లోని మురికిని వదిలిస్తుంది. దీని వల్ల చర్మం మృదువుగా మారడంతో పాటు ప్రకాశవంతంగా కనిపిస్తుంది. పైగా చర్మంపై ఉన్న అవాంఛిత రోమాలు సైతం తగ్గుముఖం పడతాయి. పసుపు ముఖ వర్ఛస్సుని పెంపొందిస్తుంది. దీనిలో ఉన్న యాంటిబయోటిక్, యాంటిసెప్టిక్ గుణాల వల్ల ముఖంపై మొటిమలు రాకుండా ఉంటాయి. పైగా చర్మం ఛాయ సైతం మెరుగుపడుతుంది. పసుపు శరీరంపై ఉన్న అవాంఛిత రోమాలను తగ్గిస్తుంది. సహజసిద్ధమైన పదార్థాలతో తయారుచేసిన ఉత్పత్తులను చర్మానికి ఉపయోగిస్తే ఎలాంటి ఇబ్బందీ లేకుండా చర్మం మెరిసిపోతూ కనిపిస్తుంది. అలాంటి సహజసిద్ధమైన ఉత్పత్తుల్లో ముఖ్యమైనది సున్నిపిండి. బామ్మల కాలం నుంచి చర్మ సౌందర్యం కోసం ఉపయోగిస్తూ వస్తున్న ఈ పిండి – పొడి చర్మానికి మంచి స్క్రబ్‌గా, మంచి ప్యాక్‌గా పనిచేసి ఎన్నో చర్మ సమస్యలను దూరం చేస్తుంది.
క్లెన్సింగ్, ఎక్స్ ఫోలియేటింగ్, మాయిశ్చరైజింగ్ వంటివన్నీ చేసే సున్నిపిండిని చాలామంది సబ్బుకి ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తుంటారు. సున్నిపిండిలో నీళ్లు, పాలు, నిమ్మరసం, పెరుగు – ఇలా అందుబాటులో ఉన్నవి కలపాలి. దాన్ని అప్లై చేయడానికి ముందు శరీరం మొత్తానికి నూనెను రాసుకోవాలి. ఆ తర్వాత సున్నిపిండితో శరీరం మొత్తం స్క్రబ్ చేసుకోవాలి. నూనెరాసిన తర్వాత సున్నిపిండిని అప్లై చేసుకోవడం వల్ల చర్మానికి ఇది పూర్తిగా అంటుకుంటుంది. దీనిని రుద్దడం వల్ల చర్మంపై ఉన్న మురికి తొలగిపోవడంతో పాటు.. రక్త ప్రసరణ కూడా బాగా జరుగుతుంది. చర్మం రంగు కూడా మెరుగు పడుతుంది. ముఖంపై అప్లై చేసుకున్న తర్వాత శరీరం మొత్తం రుద్దుకోవడం వల్ల కాస్త ఎక్కువ సమయం పాటు ముఖంపై ఉన్న చర్మం వీటి గుణాలను పీల్చుకుంటుంది. తద్వారా చర్మం మెరుస్తూ కనిపిస్తుంది.
సౌందర్యసాధనలో నిమ్మకాయకు ప్రత్యేక స్థానం ఉంది. నిమ్మలోని ఆస్ట్రిజెంట్ లక్షణాలు చర్మంలోని స్వేద గ్రంథులను శుభ్రం చేస్తాయి. తేనెలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. అవి చర్మానికి రక్షణగా నిలిచి, బ్లాక్‌హెడ్స్‌ను దూరం చేస్తాయి. ఒక టేబుల్ స్పూను నిమ్మరసం తీసుకుని, దానికి అర టీ స్పూను తేనెను చేర్చి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముక్కుపై పొరలాగా వేయాలి. 15 నిమిషాల తర్వాత పొర ఎండిపోయి గట్టి పడుతుంది. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడగాలి. ఈ మాస్క్ వారానికి మూడు నాలుగుసార్లు వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. నిమ్మకాయలోని ఆల్ఫా హైడ్రాక్సీ ఆమ్లాలు చర్మంపై రంధ్రాలను క్లియర్ చేస్తాయి. 30 మి.లీ డిస్టిల్ వాటర్ లో కొన్ని చుక్కల నిమ్మరసం, టీట్రీ ఆయిల్ని కలపండి. కాటన్ ప్యాడ్లలో ముంచి, 15 నిమిషాలు ఆరనివ్వండి. ముఖంపై రంధ్రాలను తగ్గించే యాంటీ బాక్టీరియల్ మిశ్రమం తయారవుతుంది.
బలమైన యాంటీ బాక్టీరియల్ లక్షణాలతో లోడ్ చేయబడిన నిమ్మకాయలు మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను వదిలించుకోవడానికి సరైనవి. నిమ్మకాయలలోని ‘విటమిన్ సి’ సహజంగానే ప్రకాశవంతమైన ఏజెంట్లుగా పని చేస్తాయి. సగం నిమ్మకాయముక్క తీసుకొని, చక్కెరలో అద్దుతూ మోకాళ్లు, మోచేతులపై రాస్తే, నల్లటి మచ్చలు తగ్గుతాయి. చక్కెర స్క్రబ్ చర్మంపై మృతకణాలని తీసివేస్తుంది.
చర్మంలోని మృతకణాలను తొలగించడంలో బేకింగ్ సోడా బాగా తోడ్పడుతుంది. బ్లాక్‌హెడ్స్‌కు మృత కణాలు కూడా ఒక కారణమే. నిమ్మతో కలవడం వల్ల బేకింగ్ సోడా మరింత శక్తివంతంగా పనిచేస్తుంది. ఒక టేబుల్‌స్పూను బేకింగ్ సోడాలో అర టేబుల్‌స్పూను నిమ్మరసాన్ని మిక్స్ చేసి బ్లాక్‌హెడ్స్ ఉన్న చోట అప్లరు చేయాలి. కాసేపు అలాగే వదిలేసి ఆ తర్వాత గోరువెచ్చటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.
ఎగ్‌వైట్ (గుడ్డులోని తెల్లసొన)ను డైట్‌లో భాగంగా ఆహారంలో తీసుకుంటుంటారు చాలామంది. అయితే కేవలం డైట్‌లోనే కాదు చర్మసంరక్షణకు కూడా ఎగ్‌వైట్ ఉపయోగపడుతుంది. నీళ్లలా కాకుండా నూనెలా గాఢత కలిగి ఉంటుంది కాబట్టి ముక్కు మీద వేస్తే జారకుండా అలాగే ఉండిపోతుంది. ఇది చర్మాన్ని గట్టిపరిచి బ్లాక్‌హెడ్స్ రాకుండా చేస్తుంది. గుడ్డులోని తెల్లసొనను మాత్రమే తీసుకుని దానికి కొద్దిగా నిమ్మరసాన్ని కలపాలి. బ్లాక్‌హెడ్స్ ఉన్న చోట ఈ మాస్క్‌ను వేయాలి. ఎగ్‌వైట్ మాస్క్ ఆరిన తర్వాత మరోసారి దానిపై ఇంకో పొర వేయాలి. ఆ తర్వాత ఇరవై నిమిషాల పాటు ఆరనిచ్చి నీటితో శుభ్రంగా ముఖాన్ని కడుక్కోవాలి. గుడ్డు సొన వాసనపోయేవరకు ముఖాన్ని సబ్బుతో కాకుండా కేవలం నీటితోనే శుభ్రంగా కడగాలి.
బ్లాక్‌హెడ్స్‌తో బాగా ఇబ్బంది పడుతున్నవారికి షుగర్ స్క్రబ్ చక్కని పరిష్కారాన్ని చూపుతుంది. ఈ స్క్రబ్‌లో షుగర్‌తో పాటు జొజొబా ఆయిల్‌ను వాడాల్సి ఉంటుంది. మృతకణాలపై ఇది బాగా పోరాడి బ్లాక్‌హెడ్స్ తిరిగి రాకుండా చేస్తుంది. మూడు టేబుల్ స్పూన్ల జొజొబా ఆయిల్‌ను ఒక కప్పు తెల్ల చక్కెర (వైట్ షుగర్)లో కలపాలి. ఈ మిక్స్చర్ కాస్త గట్టిగానే ఉండాలి. జొజొబా ఆయిల్ అందుబాటులో లేకుంటే ఆలివ్ ఆయిల్‌గానీ, ఆల్మండ్ ఆయిల్‌గానీ వాడొచ్చు. ఈ మిశ్రమాన్ని బ్లాక్‌హెడ్స్ ఉన్న చోట రాసి, మసాజ్ చేయాలి. ఆ తర్వాత కాసేపు ఆరనిచ్చి, గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. వారానికి రెండుసార్లు ఈ స్క్రబ్‌ను వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
ఎండ ముఖంపై నేరుగా పడకుండా చూసుకోవాలి. అలాగే ముఖానికి టమాటా రసాన్ని లేపనంలా రాసుకుని పది నిమిషాల తరువాత శుభ్రపరుచుకుంటే, ముఖచర్మం కాంతిమంతంగా ఉంటుంది. బొప్పాయి పండు గుజ్జుతో ముఖాన్ని మర్దన చేసుకుని లేపనంలా రాసుకోవాలి. పది నిమిషాల తరువాత చల్లని నీటితో కడిగితే చాలు. సహజసిద్ధంగా ముఖం కాంతిమంతంగా, ఆరోగ్యంగా మారుతుంది.
మూలికల చూర్ణాలతో కూడా చక్కని స్క్రబ్‌ని ఇంట్లోనే తయారు చేసుకుని వాడుకోవచ్ఛు ఎండబెట్టిన కమలాపండు తొక్కలు, ఖర్జూరాలు, బావంచాల చూర్ణాన్ని సమానంగా కలిపి పల్చని వస్త్రంలో జల్లించుకోవాలి. ఆ మదువైన చూర్ణానికి సమానంగా సెనగపిండి లేదా పెసరపిండి కలిపి ప్రతి రోజూ రాత్రి నిద్రపోయే ముందు ఈ మిశ్రమంతో ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. దీంతో చర్మం శుభ్రంగా, కాంతిమంతంగా మారుతుంది. రసాయనిక ఉత్పత్తుల వల్ల కలిగే ఫలితాలలో మంచి కన్నా చెడు జరిగే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. అందువల్ల బయట షాపుల్లో చర్మ సౌందర్యాన్ని సంరక్షించేందుకు లభ్యమయ్యే రెడీమేడ్ ప్రొడక్ట్స్ వినియోగం పట్ల తగిన జాగ్రత్తలను వహించాలి. మెరిసే చర్మ సౌందర్యం కోసం నెల నెలా వందల రూపాయలు ఖర్చు చేస్తుంటారు. కానీ కెమికల్స్ ఎక్కువగా ఉండే ఫేస్ క్రీమ్స్ కంటే ఇంటి పట్టున సహజ సిద్ధంగా తయారు చేసుకునే ఫేస్ ప్యాకే సరైనవి.
జర జాగ్రత్త :
ఇంట్లో తయారుచేసిన బాడీస్క్రబ్స్‌ని సరిగ్గా ఉపయోగిస్తే పెద్దగా దుష్ప్రభావాలేమీ ఉండవు. కాకపోతే వీటిని సరిగ్గా ఉపయోగించకపోవడం వల్ల చాలా నష్టాలుంటాయి. సున్నితంగా స్క్రబ్ చేయడం వల్ల చర్మంపై ఉన్న మృత కణాలు తొలగిపోతాయి. మరీ ఎక్కువగా లేదా గట్టిగా స్క్రబ్ చేయడం వల్ల చర్మంపై ఉన్న ఆరోగ్యకరమైన చర్మ కణాలు కూడా తొలగిపోయే ప్రమాదం ఉంటుంది. దీని వల్ల చర్మానికి రక్షణ కవచం దెబ్బతిని మొటిమలు, ముడతలు వంటి చర్మ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా చక్కెర, ఉప్పు వంటి బరక వస్తువులతో స్క్రబ్ చేస్తున్నప్పుడు ఇష్టం వచ్చినట్లు కాకుండా ఒక పద్ధతి ప్రకారం సున్నితంగా మసాజ్ చేయాలి. దీని ద్వారా చర్మానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది.
– తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి
8008 577 834