మోడీ ఆఖరి ఆక్రోశాల అర్థమేంటి?

What is the meaning of Modi's last rant?”జానపద కథల్లో శక్తులన్నీ కలసి ఎవరికో పట్టం కట్టాలని చూసినట్టు భారత దేశంలో, పాలక వ్యవస్థలన్నీ కలసి నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వాన్ని మూడోసారి ప్రతిష్టించడానికి పథకాలు వేస్తున్నాయి. ఎన్నికల్లో ఓటు వేసి గెలిపించవలసిన ప్రజలను మానసికంగా సిద్ధం చేయాలనుకుంటున్నాయి. ఇప్పుడు ఆయన మూడోసారి అధికారంలోకి రావడం అసాధ్యమని తెలిసినా అదే మోత సాగించడంలో పరమార్థం అదే. ఎలాగూ గెలిచే మోడీని ఎదుర్కోవడం వృథా అని నూరిపోయడం అందులో భాగమే. తెలుగునాట సీనియర్‌ మాజీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు కూడా అదే తరహాలో మోడీని మోయడం అనివార్యమని నమ్ముతూ ఆ ప్రచారానికి ఊతమిస్తున్నారు. గత పదేండ్ల నుంచి మోడీకే వత్తాసునిస్తున్న ముఖ్యమంత్రి జగన్‌ కూడా బీజేపీ జోలికి పోకుండా తన వంతు సహాయం అందిస్తున్నారు. జాతీయ మీడియా దాదాపుగా మోడియాగా మారిపోగా తెలుగు మీడియా కూడా ప్రాంతీయంగా తమకు నచ్చిన వారికి మద్దతిస్తూ జాతీయ స్థాయిలో బీజేపీకి అనుకూలమైన రాగాలే వినిపిస్తున్నది. ఏతావాతా బీజేపీ హ్యాట్రిక్‌ విజయం గురించి వారికన్నా ఎక్కువగా ఈ శక్తులు ప్రచారం చేస్తున్నాయి. వామపక్షాలు గానీ, బీజేపీ ఎన్‌డిఎకు వ్యతిరేకంగా ఏర్పాటైన ‘ఇండియా’ దండగమారి ప్రయత్నమనీ, వామపక్షాలు ఏదో సైద్ధాంతికంగా వ్యతిరేకించడం తప్ప చేయగలిగింది లేదనీ అహోరాత్రులు అపహాస్యం చేస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలుగా పోరాడటం సహజంగా జరుగుతుందనే కనీస ప్రజాస్వామిక సంప్రదాయాన్ని కూడా భరించలేకపోతున్నాయి. నిజంగానే ఇది చాలా విడ్డూరమైన పరిస్థితి. ‘మోడీ బిల్డప్‌నే మోయడం అవసరమా?’ శీర్షికతో ఇదే కాలమ్‌లో మొన్న ఏప్రిల్‌ 5న వ్యాసం ఇదీ. ఇప్పుడొక్కసారి వెనక్కు తిరిగిచూస్తే ఎవరో ఏదో అనడం కాదు. ఆ మోడీనే తనను తాను సమర్థించుకోలేక సతమతమవుతున్న స్థితి. ఏపీ, తెలంగాణలలో పోలింగ్‌ ముగిసిపోయింది గనక ప్రజల తీర్పు లెక్కింపు జరిగేలోగా కండ్లముందు నడుస్తున్న చరిత్ర సూటిగానే చెప్పుకోవచ్చు.
ఎవరైనా అనుకున్నారా?
‘హిందూ, ముస్లిం మధ్య తేడా చూపితే నేను ప్రజా జీవితానికి అనర్హుడవుతాను’ అని మోడీ మీడియా ముందు వాపోతారనీ, అటూ ఇటూ తిప్పి మాట్లాడతారనీ ఎవరైనా అనుకున్నారా? బహుశా చెప్పినా చాలా మంది నమ్మి ఉండేవారు కారేమో! 2002 గుజరాత్‌ మారణహోమంపై మీడియా ప్రశ్నలు దాటేయడమేగాక చర్చ నుంచి లేచిపోయిన మోడీ ఇప్పుడు తనే ఆ ప్రస్తావన తెచ్చి మరీ మాట్లాడుతున్నారు. గోద్రా అల్లర్లకు తనను బాధ్యుడుగా చిత్రించడం చాలా బాధ కలిగించినందువల్లనే అలా చేశానని ప్రకటిస్తున్నారు. నిజానికి వాటిని గోద్రా అల్లర్లు అనడం సంఘ్‌పరివార్‌, బడా మీడియా కలసి చేసిన కుట్ర. గోద్రాలో రైలుబోగీ దగ్ధం, కొంతమంది భక్తులు మరణించడం అందరినీ కలచివేసింది. తర్వాత అంతకు కొన్ని వేల రెట్లు భయానకమైన హత్యాకాండ, మహిళలపై, పిల్లలపై హింస కొనసాగింది. మోడీ ముఖ్యమంత్రి కాగా ఆయన సహాయకుడుగా హోంశాఖ చూసిన వ్యక్తి అమిత్‌ షా. ఆ పరిస్థితి చక్కదిద్దకపోగా ఆ మారణకాండ మంటలు చల్లారక ముందే ముందస్తు ఎన్నికల కోసం వెంటబడి మళ్లీ గద్దెక్కి కూర్చున్న నేపథ్యం మోడీది. నేరుగా అంబానీలే ఆయన్ను గుజరాత్‌లో పుట్టిన అపర గాంధీగా ఆకాశానికెత్తారు. గుజరాత్‌లో గాంధీ, ధీరూభారు అంబానీ, మోడీ పుట్టారని అనిల్‌ అంబానీ కీర్తించినప్పుడే ఆయన కార్పొరేట్‌ ముద్దుబిడ్డ అని తేలిపోయింది. భారత ప్రధాని కాలేకపోయినా భారతరత్నతో సరిపెట్టుకోవలసి వచ్చిన అద్వానీ ఎన్నికల్లో దేశాన్ని ఆకర్షించలేకపోతున్నారని అప్పటికే అర్థమైపోయింది. 2004లో యుపిఎ అధికారంలోకి వచ్చిన కొద్ది కాలానికే ఆయన పాకిస్తాన్‌లో జిన్నాను పొగిడారనే పేరిట అద్వానీపై చర్య తీసుకుని పక్కన పెట్టారు. అయినా ఆ తర్వాత ఎలాగూ నెగ్గలేని 2009 ఎన్నికల్లో తనను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించి ఒక తంతు ముగించారు. ఇక రామ రథయాత్రీకుని రాజకీయ పాత్ర చాలదని రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ గుర్తించిన పిదపనే మోడీని రంగంలోకి దింపారు. నాగపూర్‌-ముంబాయి లింకుతో జరిగిన పని ఇది.
చంద్రబాబు గతం, జగన్‌ ప్రస్తుతం
ఇక్కడ చంద్రబాబు లింకు కూడా చెప్పుకోవలసి వుంటుంది. బలం లేకున్నా మాయాజాలంతో మొదటిసారి ఈ దేశ ప్రధాని పదవి చేపట్టి 13 రోజులకే దిగిపోయిన వాజ్‌పేయి 1998లో 13 నెలలు కొనసాగి మళ్లీ తిరిగి రాగలిగారంటే చంద్రబాబు, టీడీపీ ఇచ్చిన మద్దతే తొలి కారణం. ఎందుకంటే 1990లో అద్వానీ రథయాత్ర తర్వాత ఎన్టీఆర్‌ బీజేపీతో తెగతెంపులు చేసుకున్నారు. అంతకు ముందు వారికి కేటాయించిన సీట్లు కూడా వామపక్షాలతోనే పంచుకున్నారు. 1994 ఎన్నికల్లో ఉభయ కమ్యూనిస్టులకు కలసి 34 స్థానాలు వచ్చాయి. తను నిలదొక్కుకోవడానికి మొదట్లో వామపక్షాల మద్దతుపైనే ఆధారపడిన చంద్రబాబు 1998 ఎన్నికల తర్వాత హఠాత్తుగా ప్లేటుమార్చి అటు దూకారు. ప్రాంతీయ పార్టీలు బీజేపీతో చేతులు కలపడం అప్పుడే మొదలైంది. 2004లో ఘోర పరాజయం పాలైన తర్వాత 2009లో మారానని ప్రకటించి మళ్లీ 2014లో అటే అడుగులు వేశారు. మోడీకి సారీలు చెప్పి మరీ పొత్తు కుదుర్చుకున్నారు. ఇదేదో జగన్‌ దుర్మార్గాలను ఎదుర్కొనడం కోసమే చంద్రబాబు బీజేపీతో కలిశారని సమర్థించే కొందరు మిత్రులు తెలుసుకోవలసిన ఇటీవలి చరిత్ర ఇది. కచ్చితంగా చెప్పాలంటే 1999-2024 మధ్య ఆరుసార్లు జరిగిన వివిధ ఎన్నికల్లో కేవలం 2009 ప్రత్యేక పరిస్థితులలో మాత్రమే వామపక్షాలు టీడీపీతో కలసి పోటీ చేశాయి. ఇక జగన్‌ వైసీపీ విషయానికొస్తే కాంగ్రెస్‌తో విడగొట్టుకుని ప్రాంతీయ పార్టీగా ఏర్పడిన తర్వాత ఆయన బీజేపీకే దగ్గరగా వున్నారు. పాలక పార్టీల ఎన్నికల రాజకీయాలలో తన ఓటు బ్యాంకు బీజేపీతో నేరుగా పొత్తు పెట్టుకుంటే నిలవదని ఆయనకు తెలుసు. అలాగే హిందూత్వ రాజకీయాలతో దేశాన్ని పాలించే బీజేపీకి కూడా అది కుదిరే పని కాదు. అందుకే ఎన్నికలలో మాత్రం వేరుగా పోటీ చేస్తూ ముందూ వెనకా కలిసే వ్యవహరిస్తుంటారు. కనుక చంద్రబాబు, జగన్‌ ఇద్దరికీ కామన్‌ పాయింట్‌ ఇదే. పొత్తు పార్టీలు, తొత్తు పార్టీలూ అని సీపీఐ(ఎం) అంటున్న మాట ఇదే. దేశంలో ఎక్కడికన్నా ఏపీలోనే బీజేపీకి ఎక్కువ సీట్లు వుంటాయని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ ఎప్పుడూ అంటుంటారందుకే.
ఏపీ, తెలంగాణలకు అన్యాయం
చంద్రబాబు వెంటబడి బీజేపీతో పొత్తు పెట్టుకున్నా తర్వాత ఉమ్మడి ప్రణాళిక కూడా లేకుండా ప్రచారంలో ఎన్ని పిల్లిమొగ్గలు వేశారో, జెండాలు వద్దంటూ స్థానికంగా టీడీపీ కార్యకర్తలు పక్కన పెట్టించారో చూశాం. ముస్లిం రిజర్వేషన్ల విషయంలో ఈ తేడా మరీ బాహాటంగా కనిపించింది. ఆ రిజర్వేషన్లు తొలగిస్తామని మోడీ, అమిత్‌ షాలు పదేపదే ప్రకటించడమే గాక సవాళ్లు విసురుతుంటే నేను కాపాడతానని జగన్‌ గట్గిగా చెప్పవలసి వచ్చింది. చంద్రబాబు కూడా అదే చెప్పినా బీజేపీతో కలవడం వల్ల మైనార్టీ వర్గాలలో కొంత సందేహం తప్పలేదు. పైగా అది ఆయన పార్టీ అభిప్రాయమే గానీ మాకు సంబంధం లేదని అమిత్‌ షా ఒకటికి రెండుసార్లు స్పష్టం చేశారు. న్యూస్‌ లాండ్రీ శ్రీనివాసన్‌ మోడీపై, బీజేపీ మత రాజకీయాలపై, చంద్రబాబు పిల్లిమొగ్గల గురించి, నిరంకుశ పోకడలపై ప్రశ్నలు వేస్తే జవాబు ఇవ్వలేక తంటాలు పడ్డారు. ఇక జగన్‌ కూడా ‘ఆ ఒక్కటి దక్క’ అన్నట్టే మాట్లాడారు. ఆగర్భ శత్రువుల్లా పోట్లాడుకునే ఈ ఇద్దరూ రాహుల్‌ గాంధీ మోడీ కన్నా మెరుగని తామెప్పుడూ చెప్పలేదని ఒకటికి రెండు సార్లు వివరణ ఇచ్చుకున్నారు. చంద్రబాబు అయితే మోడీ క్రియాశీల నాయకత్వం కింద ఎన్‌డిఎ ఏర్పడినట్టు ఉమ్మడి ప్రకటనలో పదేపదే ప్రకటించారు. తన విజన్‌ 2020 పక్కన పెట్టిన మోడీని విజనరీ నాయకుడని కీర్తించారు. మోడీ ఇద్దరు నేతలతోనూ ఆడాల్సిన రాజకీయ క్రీడే ఆడారు. జగన్‌ పేరు ప్రస్తావించకుండా వైసీపీని, రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం ద్వారా టీడీపీకి కాస్త ఊరట కలిగించారు. వాస్తవానికి వారిద్దరి మీద, తద్వారా ఏపీ మీద కూడా పెత్తనం చేయడమే మోడీ విధానం లక్ష్యం. ఉత్తరాదిన వచ్చే స్థానాలు తగ్గుతూ దక్షిణాన అసలే ఠికాణా లేదు గనక వీరిని ముందుంచుకుని పబ్బం గడుపుకోవాలన్న ప్రయాస మాత్రమే. ఇంత బాహాటంగా కనిపించకపోయినా తెలంగాణలోనూ కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ల మధ్య బీజేపీ రాజకీయం సాగిస్తున్నది. బీఆర్‌ఎస్‌ కాంగ్రెస్‌లో కలసిపో తుందని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తమ పార్టీలోకి వచ్చే స్తాడని. ఆగష్టు సంక్షోభం తప్పదనీ రకరకాల మాటలతో రాజకీయ టక్కుటమార విద్యలు ప్రదర్శిస్తున్నారు బీజేపీ నేతలు. జూన్‌ 2న విభజన చట్టం గడువు ముగిసిపోతుంటే ఇప్పటికీ ఏదీ ఒక కొలిక్కిరాని పరిస్థితి. తాజాగా రేవంత్‌రెడ్డి ఏపీభవనాలు వంటివి స్వాధీనం చేసుకోవాలని, అన్ని అంశాలు పరిష్కరించాలని అన్నట్టు వార్తలొచ్చాయి. కానీ ఓట్ల లెక్కింపు జూన్‌ నాలుగు గనక ఏపీలోనూ, కేంద్రంలోనూ ఏం జరిగేది ఆ తర్వాతనే చూడగలం.
సడలిన విశ్వాసం సంకేతాలు
తాత్కాలిక మనుగడ కోసం కోరి ధృతరాష్ట్ర కౌగిలి ఆశ్రయించిన తెలుగు రాష్ట్రాల నేతలు, వారి పనుపున బీజేపీ భజనగీతాలు పాడిన తెలుగు మీడియాధిపతులు ఇప్పుడైనా కళ్లు తెరుస్తారా? జాతీయ మీడియాలో కొందరైనా దీన్ని గుర్తిస్తుంటే అంతర్జాతీయ మీడియా మోడీ బీజేపీల సర్కస్‌లను సూటిగానే బహిర్గత పరుస్తున్నది. మోడీపై విదేశీ మీడియా కుట్రలంటూ గగ్గోలు కూడా మొదలైంది. ప్రగతిశీల శిబిరానికి దగ్గరగా వున్నా మోడీ మోతలో ఊగిసలాడిన మీడియా వర్గాలు కూడా కొంత సవరించుకుంటున్నాయి. ఆఖరుకు మోడీనే ముస్లింల విషయంలో సంజాయిషీ ఇచ్చినట్టు నటించాల్సి వచ్చింది. అదానీ పేరు కూడా ప్రస్తావించాల్సి వచ్చింది. కొంతమంది తొందరపాటుతో దీనిపై సూత్రీకరణలు మొదలెట్టారు గానీ అదీ తొందరపాటే. మోడీ మాటల్లో నిజాయితీ ఎంత మాత్రంలేదు. అయినా వారణాసిలో నామినేషన్‌ సందర్భంగా రాజ్యాంగంపై ఆయన చేసిన ప్రమాణ స్వీకారానికి అటూ ఇటు పవన్‌ కళ్యాణ్‌, చంద్రబాబు హాజరు వేయించుకుని రావడం ఇందుకు నిదర్శనం. ఎవరికీ మెజార్టీ రాకూడదనేది తమ ఆకాంక్ష అని వైసీపీ అంటున్నా మొగ్గు మోడీ వైపేనన్నది నిస్సందేహం. ఇప్పటికే 70 శాతం భారతీయులు ఓటేసే ప్రక్రియ పూర్తయింది. మిగిలిన చోట్లనైనా బీజేపీ ఆధిక్యత నిలుస్తుందా అనేది సందేహా స్పదంగా వుంది. అయినా మోడీనే మోయడానికి వీరు సిద్ధం కావడం ఆశ్చర్యకరం. తెలుగు రాష్ట్రాల కీలక నేతల అవకాశవాదాలు ఎలా వున్నా దేశ ప్రజలూ రాష్ట్ర ప్రజలూ కూడా మత రాజకీయాలను, నిరంకుశ పోకడలనూ ఆమోదించడం లేదనేది స్పష్టం. జూన్‌ నాలుగున గానీ దీని పూర్తి సన్నివేశం అర్థం కాదు. అది కూడా అనిశ్చితినే తెస్తుందా? అనే ప్రశ్న కూడా వుండనే వుంటుంది.
– తెలకపల్లి రవి