– 2,86,386 మంది దరఖాస్తు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) రాతపరీక్షలు ఆన్‌లైన్‌లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) విధానంలో సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. వచ్చేనెల రెండో తేదీ వరకు అవి జరుగుతాయి. ఈనెల 20, 21, 22, 24, 28, 29 తేదీల్లో పేపర్-2, ఈనెల 30, 31, వచ్చేనెల ఒకటి, రెండో తేదీన పేపర్-1 రాతపరీక్షలను నిర్వహిస్తారు. వచ్చేనెల ఒకటో తేదీన పేపర్-2 మ్యాథ్స్, సైన్స్ అభ్యర్థులకు మైనర్ మీడియంలో రాతపరీక్ష ఉంటుంది. సోమవారం నుంచి ప్రారంభమయ్యే రాతపరీక్షలకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. కరాష్ట్రవ్యాప్తంగా టెట్‌కు 2,86,386 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. వారిలో పేపర్-1కు 99,958 మంది, పేపర్-2కు 1,86,428 మంది ఉన్నారు.
15 నిమిషాల ముందే గేట్లు మూసివేత
ఈనెల 20 నుంచి వచ్చేనెల రెండో తేదీ వరకు ఆన్‌లైన్‌లో టెట్ పరీక్షలను విద్యాశాఖ అధికారులు నిర్వహిస్తారు. ప్రతిరోజూ ఉదయం తొమ్మిది నుంచి 11.30 గంటల వరకు మొదటి విడత, మధ్యాహ్నం రెండు నుంచి 4.30 గంటల వరకు రెండో విడతలో పరీక్షలు జరుగుతాయి. పరీక్ష ప్రారంభానికి 15 నిమిషాల ముందే పరీక్షా కేంద్రం గేట్‌ను మూసివేస్తారు. అంటే ఉదయం విడతకు 8.45 గంటలకు, మధ్యాహ్నం విడతకు 1.45 గంటలకే గేట్‌ను అధికారులు మూసివేస్తారు. బయోమెట్రిక్ విధానం అమల్లో ఉన్నందున అభ్యర్థులను పరీక్ష ప్రారంభానికి గంటన్నర ముందు నుంచే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. అభ్యర్థులు హాల్‌టికెట్‌తోపాటు బ్లాక్/బ్లూ బాల్ పాయింట్ పెన్ను, ఫొటో గుర్తింపు కార్డును వెంటతెచ్చుకోవాలని అధికారులు సూచించారు. కాలిక్యులేటర్లు, లాగరిథమ్ టేబుళ్లు, పేజర్, సెల్‌ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు, ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.