మణిపూర్‌లో హింసాకాండపై విచారణకు కమిటీ

న్యూఢిల్లీ : మణిపూర్‌లో చెలరేగిన హింసాకాండపై విచారణ చేయడానికి ముగ్గురు సభ్యులతో ఒక కమిషన్‌ను ఆదివారం కేంద్ర ప్రభుత్వం నియమించింది. గౌహతి హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి అజై లాంబ నేతృత్వంలో కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ఆరు నెలల్లో నివేదిక అందచేయాలని ఆదేశించారు. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదివారం ఒక నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ‘వీలైనంత త్వరగా కేంద్ర ప్రభుత్వానికి కమిషన్‌ నివేదిక ఇవ్వాలి. కమిషన్‌ మొదటి సిట్టింగ్‌కు ఆరు నెలల లోపు ఈ నివేదిక అందచేయాలి’ అని నోటిఫికేషన్‌లో తెలిపింది. కమిషన్‌ ప్రధానకార్యాలయం ఇంఫాల్‌లో ఉండనుంది. ఈ కమిషన్‌లో మిగిలిన ఇద్దరు సభ్యుల్లో ఒకరు అస్సాం-మేఘాలయ క్యాడర్‌కు చెందిన 1982 బ్యాచ్‌ ఐఎఎస్‌ మాజీ అధికారి హిమాన్షు శేఖర్‌ దాస్‌, మరొకరు తెలంగాణ క్యాడర్‌కు చెందిన 1986 మ్యాచ్‌ ఐపిఎస్‌ మాజీ అధికారి అలోక ప్రభాకర్‌. మే 3న మణిపూర్‌లో చెలరేగిన హింసాకాండలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారని, అనేక మంది గాయపడ్డారని, ఇళ్లు, అస్తులు దగ్ధమయ్యాయని నోటిఫికేషన్‌ పేర్కొంది. ఈ హింసాకాండకు విచారణ చేసేందుకు జ్యూడిషియల్‌ విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని మే 29న మణిపూర్‌ ప్రభుత్వం సిఫార్సు చేసింది. ‘మణిపూర్‌ ప్రభుత్వం సిఫార్సు మేరకు రాష్ట్రంలో హింసాకాండపై విచారణ జరిపేందుకు ఒక జ్యూడిషియల్‌ విచారణ కమిషన్‌ ఏర్పాటు చేయడం అవసరమని కేంద్ర ప్రభుత్వం అభిప్రాయపడింది’ అని నోటిఫికేషన్‌లో తెలిపారు.ఇంఫాల్‌- దిమపూర్‌ జాతీయ రహదారి-2పై దిగ్భంధనాలను తొలగించాలని మణిపూర్‌ ప్రజలకు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఆదివారం విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు అమిత్‌ షా ట్వీట్‌ చేశారు. ‘మణిపూర్‌ ప్రజలకు నా విజ్ఞప్తి ఏమిటంటే.. ఇంఫాల్‌-దిమాపూర్‌ జాతీయ రహదారి-2పై దిగ్బంధనాలను ఎత్తివేయండి. దీని ద్వారా ఆహారం, ముందులు, పెట్రోల్‌-డీజిల్‌, ఇతర నిత్యావసర వస్తువులు ప్రజలకు చేరతాయి.