టీచర్ల పై లాఠీలు.. బడుగులకు ఝూటా హామీలు.. ఇదీ రేవంత్‌ పాలన

టీచర్ల పై లాఠీలు.. బడుగులకు ఝూటా హామీలు.. ఇదీ రేవంత్‌ పాలన– ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాకేశ్‌రెడ్డిని గెలిపించాలి : విలేకర్ల సమావేశంలో ఎమ్మెల్యే హరీశ్‌రావు
నవతెలంగాణ -దేవరకొండ
ఎన్నికల విధులు నిర్వహించినందుకు డబ్బులు ఇవ్వాలని అడిగిన బడి పంతుళ్లపై లాఠీచార్జీ.. బడుగు జీవులకు ఝూటా హామీలు.. ఇదీ సీఎం రేవంత్‌ రెడ్డి పాలన అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. నల్లగొండ జిల్లా దేవరకొండలో బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే రమావత్‌ రవీంద్ర కుమార్‌ కుటుంబాన్ని సోమవారం ఆయన పరామర్శించారు. ఇటీవల రవీంద్రకుమార్‌ తండ్రి కన్నీలాల్‌ మృతిచెందిన విషయం విదితమే. అనంతరం అక్కడే విలేకర్ల సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ వంద రోజుల హామీ అమలు కాలేదు.. విద్యార్థి భరోసా కార్డు రాలేదు.. స్కూటీ ఇవ్వలేదు.. నిరుద్యోగ భృతి అమలు పట్ల భట్టి చేతులెత్తేశారని ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు ప్రియాంక, రాహుల్‌, రేవంత్‌ ఇచ్చిన ఏ హామీ కూడా అమలు కాలేదన్నారు. ఉద్యోగులకు మూడు డీఏలు అని చెప్పి, ఒక్క డీఏ కూడా రిలీజ్‌ చేయకుండా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉద్యోగులను మోసం చేసిందన్నారు. రిటైర్డ్‌ ఉద్యోగులకు పెన్షన్‌ బెనిఫిట్‌ ఇవ్వలేదన్నారు. ఉద్యోగులకు మెరుగైన పీఆర్‌సీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. విద్యావంతులు, నిరుద్యోగులు ఆలోచన చేసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయాలని కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రశ్నించే గొంతుకైన రాకేష్‌ రెడ్డికి ఓటు వేసి రేవంత్‌ రెడ్డికి గుణపాఠం చెప్పాలన్నారు. కాంగ్రెస్‌కు ఓటేయడమంటే ఆ పార్టీ ప్రభుత్వ మోసాన్ని బలపరిచినట్టు అవుతుందన్నారు. ప్రయివేటు కళాశాలల యాజమాన్యాలకు ఫీజురీయింబర్స్‌మెంట్‌ ఇవ్వకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాయని చెప్పారు. జర్నలిస్టులకు వంద కోట్లు ఇస్తామని హామీ ఇచ్చి వంద పైసలు కూడా ఇవ్వని కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఓటు ద్వారా బుద్ధి చెప్పాలన్నారు. రైస్‌ మిల్లుల్లో రైతుల ధాన్యం నుంచి నాలుగు కిలోల తరుగు తీస్తున్నారని, మార్కెట్‌కు తీసుకొచ్చి నెల రోజులైనా కొనుగోళ్లు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యాన్ని పట్టించుకునే నాధుడే లేడన్నారు. క్షేత్ర స్థాయిలో మంత్రులు, ఉన్నతాధికారుల పర్యటనలు లేవన్నారు. ధాన్యం బోనస్‌ విషయంలో సీఎం రేవంత్‌ రెడ్డి చేతులు ఎత్తేశారని విమర్శించారు. రైతుల ముఖాల్లో ఆనాడు చిరునవ్వు ఉంటే.. నేడు కన్నీరు కనిపిస్తోందని అన్నారు. ఆరు గ్యారంటీలను అమలు చేయకుండా, మొద్దు నిద్రపోతున్న కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని లేపాలంటే రాకేష్‌రెడ్డిని గెలిపించాలన్నారు. సీఎం రేవంత్‌ 30 వేల ఉద్యోగాలిచ్చినట్టు ప్రచారం చేసుకుంటున్నారని, ఒక్క నోటిఫికేషన్‌ కూడా ఇవ్వకుండా ఉద్యోగాలెలా ఇచ్చారని ప్రశ్నించారు. వండిపెట్టాక వడ్డించినట్టు కాంగ్రెస్‌ వ్యవహారం ఉందన్నారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామన్న బీజేపీి ఎక్కడ ఇచ్చిందో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్‌ చైర్మెన్‌ బండ నరేందర్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌ రెడ్డి, నోముల భగత్‌, బీఆర్‌ఎస్‌ నల్లగొండ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి, నాయకులు పల్లా ప్రవీణ్‌ రెడ్డి, గాజుల ఆంజనేయులు తదితరులు ఉన్నారు.