ఎన్నికల నిర్వహణకు పటిష్ఠ చర్యలు: కలెక్టర్

– సమస్యాత్మక కేంద్రాల్లో గట్టి నిఘా
– అన్ని కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
జిల్లాలో శాసన మండలి పట్టభద్రుల ఉప ఎన్నిక సజావుగా నిర్వహించేందుకు పటిష్ఠ చర్యలు చేపట్టామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ అన్నారు.శుక్రవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో  శాసన మండలి పట్టభద్రుల ఉప ఎన్నిక సందర్బంగా రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో యస్.పి.రాహుల్ హెగ్డే తో కలసి పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 71 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసామని మహిళ ఓటర్లు 34176 మంది, పురుష ఓటర్లు 17321 మంది మొత్తం 51497 మంది ఉన్నారని తెలిపారు. అదేవిదంగా 16 రూట్లలో 71 కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని అలాగే 16 సెక్టార్ అధికారులను నియమించడం జరిగిందని అన్నారు. జిల్లాలోని 71 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ చేపడుతున్నట్లు అలాగే 19 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో బయట కూడా వెబ్ కాస్టింగ్ చేయనున్నట్లు తెలిపారు. అదేవిదంగా 22 పోలింగ్ కేంద్రాల్లో 800 మంది ఓటర్లు ఉండగా అట్టి చోట రెండు జంబో బాక్స్ లు ఏర్పాటు చేస్తున్నామని మిగతా చోట జంబో, బిగ్ సైజ్ బాక్స్ లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.26న  పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ సిబ్బంది చేరుకుంటారని 27న ఉదయం 8.00 గంటల  నుండి సాయంత్రం 4 .00 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని అన్నారు. పోలింగ్ రోజున పోలింగ్ ఏజెంట్లను కేంద్రాలకు ముందుగా పంపాలని సూచించారు.
అన్ని కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించామని అలాగే. నేటి సాయంత్రం 4.00 ల నుండి 27 సాయంత్రం 4.00 వరకు జిల్లాలో మద్యం షాపులు పూర్తిగా బంద్ చేయాలని, సభలు, సమావేశాలు, ప్రచారాలు నిలిపివేయాలని తెలిపారు.ఎన్నికల రోజున జిల్లా అంతటా 144 సెక్షన్ అమలులో ఉంటుందని అన్నారు. పోలింగ్ అనంతరం కలెక్టరేట్ రిషప్షన్ సెంటర్లలో అందచేయడం తదుపరి కౌంటింగ్ నిమిత్తం నల్గొండ దుప్పలాపల్లి ఎఫ్.సి.ఐ లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ కి తరలించడం జరుగుతుందని అన్నారు.అనంతరం యస్.పి. రాహుల్ హెగ్డే మాట్లాడుతూ 19 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో గట్టి నిఘా పెంచామని అలాగే  16 రూట్లలో గట్టి భద్రత ఏర్పాటు చేశామని ప్రతి మండలంలో సబ్ ఇన్స్పెక్టర్ పర్యవేక్షణ ఉంటుందని  ఎక్కడకూడా ఎలాంటి సంఘటనలు జరుగకుండా పక్క ప్రణాళికతో ముందస్తు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అంతకు ముందు కలెక్టరేట్  లో ఏర్పాటు చేసిన ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ ను  పరిశీలించి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ వివరాలను తెలుసుకున్నారు.ఎన్నికల విధులు నిర్వహించే 242 మంది ఉద్యోగులు తమ ఓటు హక్కు సద్వినియోగం చేసుకున్నారని కలెక్టర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సి.హెచ్. ప్రియాంక, బి.ఎస్. లత, అదనపు యస్.పి నాగేశ్వర రావు, ఎన్నికల పర్యవేక్షకులు శ్రీనివాస రాజు, తహసీల్దార్ శ్యామ్ సుందర్ రెడ్డి,  కాంగ్రెస్ పార్టీ నుండి టి. కరుణాకర్ రెడ్డి, బి.జె.పి. నుండి అబిడ్, బి.ఆర్.ఎస్ నుండి సత్యనారాయణ, సి.పి.ఎం. నుండి కోటా గోపి, బి.ఎస్.పి నుండి స్టాలిన్, వై. సి.పి నుండి డి. రమేష్ తదితరులు పాల్గొన్నారు.