పోలింగ్ సిబ్బంది రాండమైజేషన్ పూర్తి: కలెక్టర్

– బ్యాలెట్ బాక్స్ లను  క్లోజ్డ్ కంటైనర్లతో  రిసెప్షన్ కేంద్రాలకు తీసుకురావాలి 
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్ 
వరంగల్, ఖమ్మం, నల్గొండ శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నిక  సందర్భంగా పోలింగ్ కేంద్రాలలో అన్ని సౌకర్యాలతో పాటు, పోలింగ్ సిబ్బందికి భోజనం,బ్యాలెట్ బాక్సులు  తరలించేందుకు వాహనాలు తదితర అన్ని విషయాల  పై మరోసారి దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన  వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల  శాసన మండలి పరిధిలోని జిల్లాల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, ఆర్డీవోలను  కోరారు. శుక్రవారం  ఆమె వరంగల్, ఖమ్మం, నల్గొండ శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నికల పరిశీలకులు, ఐఏఎస్ అధికారి రాహుల్ బొజ్జ  సమక్షంలో ఎన్నికల పోలింగ్ సిబ్బంది  రాండమైజేషన్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో నిర్వహించారు.అనంతరం జిల్లా కలెక్టర్ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులతో మాట్లాడుతూ శాసనమండలి ఉప ఎన్నికల్లో పాల్గొనే సిబ్బందికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. బ్యాలెట్ బాక్స్ లకు ప్రత్యేకంగా సరఫరా చేసే గుడ్డతో సీల్ చేసి క్లోజ్డ్ కంటైనర్లతో  రిసెప్షన్ కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు.పోలైన బ్యాలెట్ బాక్సులు, ఫ్యాటీటరీ మెటీరియల్ తో సహా అన్ని 12 జిల్లాల నుండి నిర్దేశించిన సమయంలో నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలోని అనిశెట్టి దుప్పలపల్లి  వద్ద ఏర్పాటు చేసిన కౌంటింగ్ సెంటర్ కు  తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ  అదనపు కలెక్టర్  కలెక్టర్ జె. శ్రీనివాస్, స్పెషల్ కలెక్టర్ నటరాజ్ తో పాటు, 12 జిల్లాల  సహాయ రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు.