ఓ తుంటరి కందిరీగ రివ్వున ఎగురుతూ అడవిలోనే ఉన్న ఓ చెరువు దగ్గరకు చేరుకుంది. అక్కడ చెరువులో ఉన్న కలువ పూలు సువాసనలు వెదజల్లుతూ అందంలో చంద్రునితో పోటీ పడుతున్నాయి. అక్కడి దృశ్యం కందిరీగను మైమరపింప చేసింది.
”ఆహా..ఎంత రమణీయంగా ఉంది ఇక్కడి వాతావరణం! ఇన్ని రోజులూ ఇంతటి అద్భుతమైన అందాలను చూడలేకపోవడం నా దురదృష్టం” అని మనసులో అనుకుంటూ కలువ పూవుపై వాలింది.
కలువపూల వాసన మరింత మధురంగా కందిరీగను తాకింది. కలువ పూవులోని మకరందాన్ని ఆస్వాదిస్తున్న కందిరీగకు బెక బెక మంటూ ఓ గొంతు కర్ణకఠోరంగా వినిపించడంతో కోపంగా కప్ప వైపు చూసింది.
”ఏంటి కప్ప పిల్లా… నేను మకరందాన్ని తాగుతూ.. ఇక్కడి అందాలను ఆస్వాదిస్తూ ఉంటే నీ అసహ్యమైన గొంతుతో ఇక్కడి ప్రశాంత వాతావరణాన్ని కలుషితం చేస్తున్నావు? నీకిది భావ్యమా…?” అంటూ కోప్పడింది కందిరీగ.
”అక్కడ అందంగా కనపడుతున్న కలువ పువ్వు నీ పాలిటి యమపాశం కానుంది. నీకు అసహ్యంగా అనిపిస్తున్న నా గొంతు నీ మేలు కోరుతోంది. కలువ పూవుపై ఇంకా ఎక్కువ సేపు నువ్వు ఉండటం క్షేమం కాదు. త్వరగా అక్కడి నుండి దూరంగా ఎగిరిపో… ఎందుకంటే చంద్రుడి వెన్నెల ఉన్నంత సేపు కలువ పూవు విచ్చుకుని ఉంటుంది. సూరీడు రాగానే ముడుచుకుని పోతుంది. అప్పుడు నీ ప్రాణం కలువ పూవులో కలిసిపోతుంది. జాగ్రత్త!” అన్నది కప్ప.
మకరందం మత్తులో నిండా మునిగిపోయిన కందిరీగ, కప్ప మాటలను లెక్కపెట్టలేదు.
రాత్రంతా కలువ పూలపై వాలుతూ మకరందాన్ని తాగుతూ సమయాన్ని మరిచిపోయింది.
అలా చూస్తుండగానే రాత్రి కరిగిపోయింది.
ఎర్రటి దివిటీలా ఆకాశంలో సూర్యుడు ఉదయించాడు.
చంద్రుని చల్లని వెన్నెలలో వికసించిన కలువలు, సూర్యుడి వేడికి భయపడి ముడుచుకున్నాయి.
కలువ పూల రెక్కల్లో కందిరీగ బందీ అయ్యింది.
కప్ప మాటలు లక్ష్య పెట్టకపోవడం వల్లనే ఈ గతి పట్టిందని బాధ పడింది. అతి సర్వత్రా వర్జయేత్ అని పెద్దలు ఊరకనే అనలేదని అనుకుంది.
మళ్లీ వెన్నెల కురిసేదాక బతికి ఉంటే మళ్లీ ఇలాంటి పని చేయనని మనసులో గట్టిగా ఒక నిర్ణయానికి వచ్చింది కందిరీగ.
– వడ్డేపల్లి వెంకటేష్