‘రైతు’ కేంద్రంగా రాసిన కవిత

A poem centered on 'Raithu'‘దేవుడు తప్పిపోయాడు’ పేరుతో తెలుగు సాహితీలోకంలో తనదైన ముద్ర వేసుకున్న కవి విల్సన్‌రావు కొమ్మవరపు. ఈ మధ్యకాలంలో రెండవ కవితా సంపుటిగా ‘నాగలి కూడా ఆయుధమే’ ను తీసుకొచ్చారు. వారు సజనకాంత్రి పత్రిక సాహిత్యపేజీ నిర్వాహకులు. వారి రెండవ కవితాసంపుటిలోని ‘నాగలి కూడా ఆయుధమే’ కవితను విశ్లేషించుకుందాం.

ఈ ఆధునిక యుగంలో మనిషిని బతికించుకోవడం కోసం ఏ స్వార్థం లేకుండా గొప్ప పాత్ర పోషించేవాడు రైతు. అప్పులపాలై, పెట్టుబడులు లేక ఇబ్బంది పడుతూ కూడా మళ్ళీ పంట పండించాలనే ఆశతో మరో అడుగు ముందుకు వేస్తూనే ఉంటాడు. మనిషి జీవితంలో శ్రమజీవి అయిన రైతు పాత్ర లేనిదెప్పుడు. అలాంటి రైతు గిట్టుబాటు ధరలు లేక రోడ్డున పడ్డాడు. ఉద్యమం చేపడుతున్నాడు. ఇలాంటి తరుణంలో కవులు బాధ్యతగా ఆ సమస్యలపట్ల సంఘీభావం తెలుపుతూ కవిత్వం రాయాల్సిన అవసరం ఉంది. చాలా మంది రాస్తున్నారు కూడా. ఆ సంఘటన నేపథ్యంలోంచే రైతుల్లో స్థైర్యం నింపుతూ, వారి పక్షాన గొంతెత్తి మాట్లాడుతూ కవి విల్సన్‌ రావు ఈ కవితను రాశారు. శీర్షికలోనే కవి ఒక తిరుగుబాటు ధోరణిని లేవనెత్తుతూ నాగలిని ఆయుధంగా ప్రకటించాడు. ఇది రైతులో భరోసానింపే కవిత.
కవి చెప్పినట్టు రైతు జీవితంలో సంఘర్షణ లేని రోజు లేదు. పొద్దున లేచి బాయి దగ్గరికి వెళ్ళిన దగ్గర నుండి మొదలుపెడితే ఇంటికి వచ్చి రాత్రి పడుకునే దాకా ఎన్నో మానసిక ఇబ్బందులు. ఎన్నో శారీరక ఇబ్బందులు. నిత్యం ప్రాణాలతో చెలగాటమాడటం. ఇవన్నీ రైతు దినచర్యలు. ఇన్ని చేసినా రైతుకు మిగిలేది శూన్యమే. అందుకే కవి రైతుకు ప్రతిఫలంగా కలలే మిగులుతున్నాయని ఎత్తుగడలోనే చెప్పేశాడు. రైతు నమ్మేది కేవలం మట్టినేనన్న విషయాన్ని మన ముందు పరిచాడు. వాస్తవానికి రైతుకు బువ్వ పండించడం తప్ప ఏ రాజకీయాలు తెలియవు. పసి బాలుడుతో సమానం.
రైతు దష్టికోణం చాలా పెద్దది. విశాలతా హదయం. నేనెందుకు పంట పండించాలే. నలుగురి కడుపులను ఎందుకు నింపాలే అని ఏనాడూ అనుకోడు. భూమి తల్లిని నమ్ముకొని పంట తీస్తూనే ఉంటడు. ఈ కోణాన్ని వ్యక్తపరుస్తూ భూమికి గుండె ఉంటుందని, ఊపిరి ఉంటుందని రైతు గుర్తించి చెమటచుక్కలు ధారపోస్తాడని కవి రెండవ స్టాంజాలో చెప్పారు. ఇది అక్షరాల నిజం. రైతు అర్థం చేసుకున్నంతగా ఈ సమాజాన్ని అర్థం చేసుకునే వాడు లేడు. రైతు బాధ్యతాయుతంగా వ్యవహరించినంతగా ఇంకొకరు బాధ్యతలను నిర్వర్తించరు.
మూడవ స్టాంజాలో రైతు జీవితానికి సంబంధించిన భద్రత గురించి కవి మాట్లాడుతున్నాడు.
చివరి దశలో ఉద్యోగులకు, వ్యాపారస్తులకు రకరకాల స్కీంలు, ప్లాన్‌లు ఉంటాయి. ఏదో విధంగా వారు జీవితాన్ని నెట్టుకొస్తారు. రైతు ఎంత పని చేసినా ఏ పథకాల లబ్ది చేకూర్చేది లేదు. కాబట్టి రైతుకు దుఃఖ సందర్భాలు ఎన్నో ఉంటాయని కవి వాపోతున్నాడు.
చట్టసభలు చేయాల్సిన న్యాయాన్ని అడుగుతున్నాడు. అభివద్ధి అంటే రైతుల జీవితాలు మెరుగుపడటమని గట్టిగా వాదిస్తున్నాడు. న్యాయం చేయని సభలను దారం తెగిన పతంగులని ఎద్దేవా చేస్తున్నాడు. ముగింపు కొచ్చేసరికి రైతుకున్న బలాన్నంతా విప్పి చెబుతున్నాడు. రైతుల వెనుక ఉన్న సమూహాలను గుర్తు చేస్తున్నాడు. రైతు ఒంటరి వాడు కాదని హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. నాగలి అనేది శ్రమజీవికి ఎంత ఉపయోగపడుతుందో వివరిస్తూ చివరకు నాగలిని ఆయుధంగా ప్రకటించి గొప్ప ముగింపునిచ్చాడు.
నిజానికి రైతు జీవితం గురించి ఎంత రాసినా తక్కువే. కానీ కవి ఈ కవితా వస్తువుకు న్యాయం చేస్తూ రైతు జీవితాన్ని, అతడికి జరగాల్సిన న్యాయాన్ని సమాంతరంగా నడిపిస్తూ సమన్వయం సాధించాడు. రైతును కేంద్రంగా చేసుకుని కవిత రాయటమే కాకుండా పుస్తకానికి పేరుగా కూడా ఈ కవితా శీర్షికనే పెట్టి రైతు సాధకబాధకాలను ఆలోచించేలా చేశాడు. ఈ కవితో పాటు మన కవులమంతా అప్పుడప్పుడు రైతుకు భరోసాగా అక్షరాయుధాన్ని సంధిస్తేనే నాగలి నిలబడుతుంది. మనల్ని నిలబెడుతుంది. నాగలి కూడా ఆయుధమన్న మాట ఋజువవుతుంది.

నాగలి కూడా ఆయుధమే!
సంఘర్షణ మాకేమీ కొత్త కాదు
శ్రమకు ప్రతిఫలంగా
కలలే మిగులుతున్నప్పుడు
కలగనటమే ఒక దుశ్చర్య ఐనప్పుడు
నిత్యం మట్టికి మొక్కడమొక
సహజాతం మాకు.
భూమికీ ఒక గుండె ఉందని
ఆ గుండెలో కొంత తడి ఉందని తెలిసాక
దాని ఊపిరితో ఊపిరి కలిపి
ఒక జ్వలనచేతనలో
నాలుగు చెమట చుక్కలు
ధారపోయకుండా ఉండలేము.
అలసటెరుగని దుక్కిటెద్దులు
నెమరేతకు దూరమై
భద్రత లేని సాగుతో
అభద్ర జీవితం గడుపుతున్న
నిత్య దుఃఖిత సందర్భాలు!
ఆకలి డొక్కలు నింపే
చట్టాలు చేయాల్సిన చట్టసభలు
భూమి గుండెకు ఊపిరి పోయడం
ఒక మానవోద్వేగమని తెలియక
నాగలిని నిలువునా చీల్చేస్తున్నప్పుడు
అభివద్ధి ఎరుగని చట్టాలన్నీ..
దారం తెగిన పతంగుల నాట్య విన్యాసాలే!
ఇప్పుడు
నాగలి ఒంటరి కాదు
నాగలి ఒక సమూహం
నాగలి ఈ దేశపు జీవితం
నాగలి ఉత్పత్తికి జీవం
నాగలే మా సర్వస్వం
ఇప్పుడు నాగలే మా ఆయుధం..
– కొమ్మవరపు విల్సన్‌ రావు