– రెంజల్ మండల వ్యవసాయ అధికారి లక్ష్మీకాంత్ రెడ్డి..
నవతెలంగాణ – రెంజల్
రైతులు రాబోవు ఖరీఫ్ సీజన్లో అవసరమైన విత్తనాలు కొనుగోలు విషయంలో తగు జాగ్రత్తలను పాటించాలని, రెంజల్ వ్యవసాయ అధికారి లక్ష్మీకాంత్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం మండలంలోని పెస్టిసైడ్స్ దుకాణాలను తనతో పాటు, వ్యవసాయ విస్తీర్ణ అధికారులు లైసెన్స్ కలిగిన వాటిని సందర్శించి రికార్డులను పరిశీలించారు. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ కల్తీ విత్తనాల విక్రయాలపై ప్రత్యేక దృష్టి సాధించిందని ఆయన పేర్కొన్నారు. లూజుగానున్న బస్తాలను తీసుకోరాదని, రైతులు కొనుగోలు చేసిన విత్తనాలకు తప్పనిసరిగా రసీదును తీసుకోవాలని ఆయన సూచించారు. పంట కాలం పూర్తయ్యే వరకు రైతులు తీసుకున్న రసీదులను జాగ్రత్తగా ఉంచుకోవాలని ఆయన అన్నారు. వ్యవసాయ శాఖ ద్వారా గుర్తింపు పొందిన డీలర్ల వద్ద మాత్రమే రైతులు విత్తనాలను కొనుగోలు చేయాలని ఆయన పేర్కొన్నారు. సెల్స్ రిజిస్టర్లలో విక్రయించిన ప్రతి దాన్యం బస్తాల వివరాలను పొందుపరచాలని డీలర్లకు ఆదేశించారు. దుకాణాలలో దాన్యం బస్తా నిలువలు, వాటికి సంబంధించిన ధరల పట్టికను తప్పనిసరిగా దుకాన్దారులు పాటించాలని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి లక్ష్మీకాంత్ రెడ్డి తో పాటు, వ్యవసాయ విస్తీర్ణ అధికారులు అజయ్, కవిత, కృష్ణవే ణి, తదితరులు పాల్గొన్నారు.