రాత్రికి రాత్రే బెల్ట్ కు మద్యం..!

– బెల్ట్ కు ఫుల్.. వైన్స్ కు నిల్

– కిరాణా దుకాణాల్లో జోరుగా అమ్మకాలు 
– బెల్ట్ కోసం ప్రత్యేక కౌంటర్ తో విక్రయం
– చిన్న గొడవకు డిపాజిట్ దాకా పంచాయతీ 
– ఎన్నికల కోడ్ బేఖాతర్- జాడ లేని తనిఖీలు 
– మాముళ్ల మత్తులో చోద్యం చూస్తున్న ఎక్సైజ్ శాఖ 
నవతెలంగాణ – పెద్దవంగర
పెద్దవంగర మండలంలో బెల్టుషాపుల నిర్వహణ జోరుగా కొనసాగుతుంది. అర్ధరాత్రి ఐనా మద్యం అమ్మకాలు మాత్రం ఆగడం లేదు. నడిరోడ్డు పైనే బెల్ట్ షాప్ లు దర్శనం ఇస్తున్నాయి. మండలంలో అనుమతి పొందిన ఏకైక వైన్స్ దుకాణం నుంచే వందల సంఖ్యలో మద్యం బాటిళ్లు, బీర్లు బెల్టు షాపులకు రాత్రికి రాత్రే తరలిస్తున్నట్టు సమాచారం. సంబంధిత ఎక్సైజ్ శాఖ కనుసన్నల్లోనే బెల్టు షాపుల నిర్వహణ జరుగుతుందని విమర్శలు సర్వత్రా గట్టిగానే వినిపిస్తున్నాయి. వైన్స్ కు నిల్, బెల్ట్ కు ఫుల్ మద్యం అందుబాటులో ఉండడంతో ఎక్కడ పడితే అక్కడ తాగినోళ్లకు తాగినంత.. అన్నట్టుగా తయారైంది మండలంలో బెల్ట్ షాపుల పరిస్థితి.
కిరాణా దుకాణాల్లో జోరుగా..
మండల పరిధిలోని గ్రామాలు, తండాల్లోని పలు కిరాణా దుకాణాల్లో పోలీసుల అండతో బెల్టుషాపులు నడుస్తున్నట్లు సమాచారం. ఏ సందులో చూసినా బెల్టు షాపులు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. వైన్స్ షాపు ల నుంచి మద్యాన్ని నేరుగా ఆటోలు, ప్రత్యేక వాహనాల్లో తరలిస్తూ వ్యాపారం చేస్తున్నారు. పదుల సంఖ్యలో ఊరూరా, కాలనీల్లో బెల్టు దుకాణాలు మండలంలో మొత్తం సుమారు 80 లోపు ఉన్నాయి. దీంతో మండలంలో బెల్ట్ వ్యాపారుల హవా జోరుగా సాగుతుంది. లైసెన్స్ ఉన్న వైన్స్ షాపు లో లభించని కేఎఫ్ లైట్ బీర్లు, చీప్ లిక్కర్ మొదలుకొని టాప్ బ్రాండ్ల మద్యం సైతం బెల్ట్ షాపు లో తెల్లవారుజామున 5 గంటల నుండి అర్దరాత్రి వరకు విక్రయిస్తున్నారు.
చిన్న గొడవకు డిపాజిట్ దాకా పంచాయతీ..
గ్రామాల్లోని బెల్ట్ షాపుల్లో దాదాపు అన్ని రకాల మద్యం ఫుల్ గా అందుబాటులో ఉంది. దీంతో రోజు కూలీ పనులు చేసుకునే నిరుపేదలు బెల్టు షాపులకు అలవాటుపడి కూలీ పనులకు సైతం పోకుండా నిత్యం కాలనీల్లో మద్యం మత్తులో సంబంధం లేని విషయాలకు గొడవలకు దిగుతున్నారు. ఈ గొడవ పరిష్కారానికి తెల్లారి ఉదయం పెద్ద మనుషులను ఆశ్రయిస్తూ, డిపాజిట్ పెట్టాల్సిన దుస్తితి ఏర్పడిందని వాపోతున్నారు. మండలంలో ఒక్కటే వైన్స్ షాపు ఉండడంతో నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. బెల్ట్ షాపులకు విక్రయాల కోసం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయడం కొసమెరుపు. అంతే కాదు స్టిక్కర్ పేరుతో మద్యం బాటిల్ పై ఎమ్మార్పీ రేటు కంటే రూ.20 నుంచి 50 వరకు అదనంగా బెల్ట్ షాపులకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. బెల్ట్ షాప్ నిర్వాహకులు వారు కొనుగోలు చేసిన ధరల కన్నా ఎక్కువ మొత్తాన్ని వసూలు చేస్తూ, మందు బాబుల నడ్డి విరుస్తున్నారు. దీనికి తోడు పలు గ్రామాల్లో మద్యం కల్తీ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ప్రజారోగ్యానికి చిల్లు పడుతుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల కళ్ళ ముందు, అధికారుల ముందు దర్జాగా బెల్ట్ షాప్ లు నిర్వహిస్తున్న అబ్కారీ శాఖ అధికారులలో చిన్నపాటి చలనం కూడా లేదని స్థానిక ప్రజలు మండిపడుతున్నారు.
మాముళ్ల మత్తులో చోద్యం చూస్తున్న ఎక్సైజ్ శాఖ..
మండలంలో ఈ దందా సంగతి తెలిసినా సంబంధిత అధికారులు చోద్యం చూస్తున్నారని తెలుస్తోంది. ఎలక్షన్ కోడ్ అమలు లో ఉన్న కూడా బెల్ట్ షాపులపై తనిఖీలు చేపట్టలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాకుండా కొందరు సిబ్బందికి ప్రత్యేకంగా వారం, నెలకు చొప్పున ముడుపులు అందుతుండడంతో ఏదైన ఫిర్యాదు రాగానే బెల్టు నిర్వాహకులకు సమాచారం అందించి, తనిఖీల విషయాలను చేరవేస్తున్నారని సమాచారం. దీంతో అప్రమత్తం చేస్తూ, బెల్ట్ షాపు నిర్వాహకుల నుండి తనిఖీల్లో ఏమి దొరకకుండా పరస్పర సహాకారం అందిస్తున్నారనే వాదనలు సైతం వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ‘బెల్ట్ షాపు ల నియంత్రణ’ కు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.