ధాన్యం,బియ్యం టెండర్లపై హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలి

– సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌ అవినీతిపై న్యాయపోరాటం :రవీందర్‌ సింగ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ధాన్యం, బియ్యం టెండర్లపై హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మెన్‌, బీఆర్‌ఎస్‌ నేత రవీందర్‌ సింగ్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం హైదరాబాద్‌ తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌ అవినీతిపై న్యాయపోరాటం చేయనున్నట్టు తెలిపారు. కార్పొరేషన్‌ అవినీతిపై సీఎం రేవంత్‌ రెడ్డి సమాధానమివ్వాలని డిమాండ్‌ చేశారు. 15 రోజుల క్రితమే బీఆర్‌ఎస్‌ అవినీతిపై ప్రశ్నించడంతో రూ.200 కోట్ల మేర టెండర్లు దక్కించుకున్న వారు ధాన్యం కొనకుండా భయపడ్డారని తెలిపారు. రూ. 57కు సన్న బియ్యం కొనాలని ప్రభుత్వమే టెండర్లలో రేటు నిర్ణయించింది నిజం కాదా ? అని ప్రశ్నించారు. అవినీతిలో మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పాత్ర లేకపోతే టెండర్లు రద్దు చేసి నిజాయితీ నిరూపించుకోవాలని సవాల్‌ విసిరారు. బీజేపీ నేత మహేశ్వర్‌ రెడ్డి, సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఒక్కటేనని విమర్శించారు. ఆర్‌ ఆర్‌ యాక్ట్‌ను కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదో చెప్పాలని కోరారు.