గిరిజన రాష్ట్రంలో ఎవరి జెండా ఎగిరేది?

– జార్ఖండ్‌లో ఎన్డీయే-ఇండియా మధ్య పోటీ
– ఇక్కడ ఇండియా బ్లాక్‌కి హేమంత్‌ కీలకం
– భూకబ్జా ఆరోపణలపై ఇప్పటికే జైలులో మాజీ సీఎం
– ఫలితాలే రెఫరెండం అవుతాయి : రాజకీయ విశ్లేషకుల అంచనాలు
రాంచీ: దేశం మొత్తం భౌగోళిక ప్రాంతంలో జార్ఖండ్‌ విస్తీర్ణం 2.42 శాతం. మొత్తం జనాభాలో 2.77 శాతం. ఇంకా ప్రాతినిధ్య పరంగా, 543 సభ్యులన్న లోక్‌సభలో ఈ రాష్ట్రానికి ఉన్నది 14 సీట్లు. అంటే, ఇది 2.5 శాతం అన్నమాట. అయితే, జాతీయ రాజకీయాల్లో గిరిజనుల పరంగా ఈ రాష్ట్రానికి ప్రత్యేకత ఉన్నది. జాతీయంగా షెడ్యూల్డ్‌ తెగల(ఎస్టీ) కోసం రిజర్వ్‌ చేయబడిన 47 సీట్లలో ఐదు స్థానాలను ఈ రాష్ట్రమే కలిగి ఉన్నది. ఇందుకు, ప్రధానంగా ఇక్కడ అధికంగా ఉండే గిరిజన జనాభానే కారణం. ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన జార్ఖండ్‌ ముక్తి మోర్చా(జేఎంఎం), బీజేపీ, కాంగ్రెస్‌లతో పాటు ఇతర ప్రాంతీయ పార్టీలకు కూడా ఈ సీట్లు ముఖ్యం. ఇక్కడ అధిక సీట్లను గెలవటం ద్వారా ఆదివాసీల్లో తమకూ స్థానం ఉన్నదనే ప్రచారాన్ని పార్టీలు చేసుకోవాలని చూస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.జార్ఖండ్‌ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి బీజేపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వాలు ఏవీ పూర్తి కాలాన్ని పాలించలేపోయాయి. ఖనిజ వనరులు సమృద్ధిగా ఉన్నప్పటికీ రాజకీయ అస్థిరత రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకున్నది. అయితే లోక్‌సభ ఎన్నికల్లో కాషాయ పార్టీ తన పనితీరును మెరుగుపరుచుకున్నది. 2004లో ఒక సీటు నుంచి, 2014లో 14కి 12 స్థానాలను బీజేపీ కైవసం చేసుకున్నది. 2009లో ఆర్జేడీలు తుడిచిపెట్టుకుపోగా, కాంగ్రెస్‌ ఒక్క సీటుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 2014లో కాంగ్రెస్‌కు స్థానం దక్కకపోగా.. 2019లో ఒక్క సీటును మాత్రమే కైవసం చేసుకున్నది. అయితే, జేఎంఎం కనీసం ఒక సీటును నిలుపుకోవడం ద్వారా ఈ అన్ని ఎన్నికలలో కాషాయ పార్టీకి పోటీ ఇచ్చింది.ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలతో పాటు ఈ ఏడాది చివర్లోనే ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. జార్ఖండ్‌లోని గిరిజన జనాభా, ప్రధానంగా హౌ, ముండా, సంతాల్‌, ఓరాన్‌ కమ్యూనిటీలు, 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలోని 3.2 కోట్ల జనాభాలో 26.21 శాతం ఉన్నారు. రాబోయే జనాభా లెక్కల్లో ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని అంచనా.