రైతులకు విత్తనాలివ్వాల్సిందే..

రైతులకు విత్తనాలివ్వాల్సిందే..– 48 గంటల టైమిస్తున్నాం
– లేదంటే రైతుల తరఫున ఉద్యమం : ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఏ జిల్లాలో ఏ రైతుకు ఏ విత్తనాలు అవసరమో గుర్తించి వెంటనే అందివ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీ ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ డిమాండ్‌ చేశారు. 48 గంటల్లోగా రైతులకు విత్తనాలను అందివ్వకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. బుధవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రైతులకు సరిపడా విత్తనాలిచ్చే స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేదనీ, ఏ జిల్లాలో ఏ విత్తనాలు అవసరమనే అవగాహన కూడా సర్కారుకు లేదని విమర్శించారు. భార్యాపిల్లలతో సహా లైన్లో నిలబడ్డా విత్తనాలు దొరికే పరిస్థితి లేదని వాపోయారు. ఆదిలాబాద్‌లో నాసిరకం విత్తనాలు అమ్ముతున్నారని ఆరోపించారు. ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్ముతూ పట్టుబడితే గంటకే బెయిల్‌పై ఎలా వస్తారు? వారికి ఎవరి సహకారం ఉంది? చట్టాలేమయ్యాయి? అంటూ ప్రశ్నించారు. ఏ కంపెనీ ఏ రకం విత్తనాలు తయారు చేస్తుందనే క్లారిటీ లేదని విమర్శించారు. రైతు సర్కారు అని చెప్పుకుంటున్న రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఫసల్‌ బీమా పథకంలో రాష్ట్ర వాటా ఎందుకు కట్టడం లేదని నిలదీశారు. ఈ సమస్యపై చీఫ్‌ సెక్రటరీ కి మెమెరాండం ఇచ్చామని తెలిపారు. రాష్ట్ర సర్కారుకు సోనియా, రాహూల్‌, ప్రియాంక మీద ఉన్న ప్రేమ రైతుల మీద లేదని విమర్శించారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు, వైఫల్యాలపై అంతా నెట్టి కాంగ్రెస్‌ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నదన్నారు. లోగో, పాట, కాళేశ్వరం , అప్పులు అంటూ కాలం గడిపే యోచనలో రాష్ట్ర సర్కారు ఉందని విమర్శించారు.