– చివరి అంకానికి సార్వత్రిక సమరం
– 57 లోక్‌సభ స్థానాలకు, 47 ఒడిశా అసెంబ్లీ స్థానాలకు పోలింగ్
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
సార్వత్రిక సమరం చివరి అంకానికి చేరింది. పోలింగ్ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. సార్వత్రిక ఎన్నికల ప్రకటనతో మార్చి 16 నుంచి దేశవ్యాప్తంగా మొదలైన ఎన్నికల సందడి గురువారం సాయంత్రం 5 గంటలతో ముగియనుంది. దీంతో లోక్‌సభ ఎన్నికల చివరి దశ (ఏడో దశ) ప్రచారానికి తెరపడింది. శనివారం పోలింగ్ జరగనుంది. ఈ దశలో ఏడు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతాల్లోని 57 లోక్‌సభ స్థానాలకు ఓటింగ్ జరగనుంది. అలాగే ఒడిశాలో 47 అసెంబ్లీ స్థానాలకూ పోలింగ్ జరగనుంది. ఉత్తరప్రదేశ్ (13 సీట్లు), బీహార్ (8 సీట్లు), పంజాబ్ (13 సీట్లు), జార్ఖండ్ (3 సీట్లు), చండీగఢ్ (1 సీటు), పశ్చిమ బెంగాల్ (9 సీట్లు), ఒడిశా (6 సీట్లు), హిమాచల్ ప్రదేశ్ (4 సీట్లు) ఉన్నాయి. అన్ని స్థానాలకు పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది.ఈ చివరి దశ ఎన్నికల్లో ఓటింగ్ జరుగుతున్న ప్రధాన స్థానాల్లో ప్రధాని నరేంద్ర మోడీ వారణాసి సీటు కూడా ఉంది. దీంతో పాటు పశ్చిమ బెంగాల్‌లోని డైమండ్ హార్బర్ స్థానం నుంచి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ, బీహార్‌లోని పాటలీపుత్ర స్థానం నుంచి లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మిసా భారతి పోటీ చేస్తున్నారు.