– 8 లక్షల మందికి డిమాండ్ నోటీసులు
– వన్ టైమ్ సెటిల్‌మెంట్ అమలుతో మంచి ఫలితాలు
– ముందస్తు పన్ను చెల్లింపులోనూ సక్సెస్
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఆస్తిపన్ను సేకరణ, ఎర్లీబర్డ్ అమలులో రికార్డులు సృష్టించిన జీహెచ్‌ఎంసీ.. తాజాగా 2024-2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.2200 కోట్ల ఆస్తి పన్ను వసూళ్లపై దృష్టి సారించింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికిగాను ఆస్తిపన్ను వసూళ్లలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) రికార్డ్ స్థాయిలో వసూళ్లను సాధించిన విషయం తెలిసిందే. 2022-2023లో ఆస్తి పన్ను సేకరణ రూ.1660.38 కోట్లు కాగా, 2023-2024లో రూ.1921.58 కోట్ల పన్ను వసూలు చేసి రికార్డు సృష్టించింది. 2023-2024లో రూ.261 కోట్లకు పైగా ఆస్తిపన్ను అదనంగా వసూలైంది. 2024-2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ముందస్తు ఆస్తిపన్ను చెల్లింపు పథకం (ఎర్లీబర్డ్) అమలుతో దాదాపు రూ. 829 కోట్ల ఆదాయం జీహెచ్‌ఎంసీ ఖజానాకు చేరింది. బల్దియా చరిత్రలో మొట్టమొదటిసారి రెండు రికార్డులను తిరగరాశారు.
మరో రికార్డు కోసం కసరత్తు
2024-2025 ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి 30వ తేదీలోపు ఆస్తిపన్ను చెల్లించే వారికి 5శాతం పన్నులో ఎర్లీబర్డ్ పథకం ద్వారా రాయితీ కల్పించారు. ప్రతి ఏడాదీ ఎర్లీబర్డ్ పథకాన్ని వినియోగించుకోని వారికి జులై లేదా ఆగస్టు నెలలో ఆస్తిపన్ను చెల్లించాల్సిందిగా జీహెచ్‌ఏంసీ డిమాండ్ నోటీసులు జారీ చేస్తుండేది. సాధారణ నోటీసులకు పన్ను చెల్లింపుదారులు స్పందించకపోతే అలాంటి వారికి రెడ్ నోటీసులు జారీ చేసే వారు. ఈసారీ అందుకు భిన్నంగా మే 28 వరకు పన్నులు చెల్లించని వారికి డిమాండ్ నోటీసులు జారీ చేశారు. పెండింగ్‌లో ఉన్న పన్నులను చెల్లించాలంటూ గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు 8లక్షల మందికి ఎస్‌ఎంఎస్ ద్వారా (ఆన్‌లైన్‌లో) డిమాండ్ నోటీసులను జీహెచ్‌ఎంసీ అధికారులు జారీ చేశారు. ఈ అలర్ట్‌తో నగరవ్యాప్తంగా వినియోగదారులు ముందుకొచ్చి ఆస్తిపన్ను చెల్లిస్తారని అధికారులు భావిస్తున్నారు.
రెండ్రోజుల్లో రూ.5కోట్లకుపైగా…
జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ ఆదేశాలతో అధికారులు మంచి సక్సెస్ సాధిస్తున్నారు. దాంతో జీహెచ్‌ఎంసీకి ఆస్తిపన్ను ద్వారా వచ్చే ఆదాయం పెరుగుతోంది. ఆస్తిపన్ను చెల్లింపుదారులకు ఆన్‌లైన్‌లో ఫోన్ నెంబర్‌కు పన్ను చెల్లించాలనే సందేశంతో పాటు లింకును జీహెచ్‌ఎంసీ యంత్రాంగం పంపించింది. ఫోన్‌లో ఆ లింక్‌ను క్లిక్ చేసిన వెంటనే నోటీసు డౌన్‌లోడ్ అవుతుంది. చెల్లించాల్సిన మొత్తానికి సంబంధించిన సమాచారం డిమాండ్ నోటీసులో ఉంటుంది. నోటీసు చివరిలో ఆన్‌లైన్ చెల్లింపులు జరిపేందుకు అవకాశం కల్పించారు. టి వ్యాలెట్, డెబిట్ కార్డు, ఈ-పే, యూపీఐల ద్వారా చెల్లింపులు జరిపేందుకు అవకాశం కల్పించారు. చెల్లింపులను సులభతరం చేయడంతో నగరవాసుల నుంచి మెరుగైన స్పందన వస్తోంది. ఈ నెల 29, 30వ తేదీల్లోనే (ఆన్‌లైన్‌లోనే) రూ.5 కోట్లకుపైగా ఆస్తి పన్ను జీహెచ్‌ఎంసీ ఖజానాకు చేరిందని తెలిసింది. మరికొద్ది రోజుల్లో మరింత ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.