పదేండ్లలో వ్యవస్థలన్నీ నాశనం

పదేండ్లలో వ్యవస్థలన్నీ నాశనం– లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి తగిన గుణపాఠం
– ఇండియా బ్లాక్‌దే అధికారం :సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జాన్‌వెస్లీ, అబ్బాస్‌
నవతెలంగాణ- వనపర్తి
మోడీ హయాంలో పదేండ్లలో వ్యవస్థలన్నింటినీ నాశనం చేశారని.. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పారని.. ఇండియా బ్లాక్‌ అధికారం చేపట్టబోతుందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జాన్‌వెస్లీ, ఎండీ.అబ్బాస్‌ అన్నారు. సీపీఐ(ఎం) వనపర్తి జిల్లా రాజకీయ శిక్షణా తరగతుల ప్రారంభం సందర్భంగా స్థానిక ఎమ్‌వైఎస్‌ బ్యాంకెట్‌ హాల్లో గురువారం వారు మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకొచ్చాక.. కులమతాల మధ్య చిచ్చుపెట్టి.. ఎన్నో అల్లర్లకు ఘర్షణలకు కేంద్ర బిందువు అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. బడా కార్పొరేట్‌ శక్తులను ప్రోత్సహించడానికి ప్రధానమంత్రి మోడీ దేశ ప్రజలపై విపరీతంగా భారాలు మోపారని అన్నారు. వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేయడానికి, కార్పొరేట్‌ శక్తులకు అప్పగించేందుకు పార్లమెంటులో చట్టాలనే మార్చే స్థాయికి దిగజారారని విమర్శించారు. దేశంలోని బడుగు, బలహీన, కార్మికవర్గ సమస్యలపై పార్లమెంటులో ప్రధాని ఏనాడూ చర్చించలేదన్నారు. కేవలం సంపన్నులకు మేలు చేసేందుకే వ్యవస్థలన్నింటినీ ప్రయివేటుపరం చేస్తున్నారన్నారు. నల్ల వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఢిల్లీలో పోరాటం చేస్తే.. నిరసనలను అణచివేసేందుకు మోడీ ప్రభుత్వం మిలటరీ, పోలీసు వ్యవస్థలను ప్రయోగించి 765 మంది అన్నదాతల చావుకు కారణమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కార్మిక, శ్రామిక వర్గానికి నష్టం చేకూర్చేలా చట్టాలను మారుస్తూ నాలుగు లేబర్‌ కోడ్లను తీసుకొచ్చిందని గుర్తు చేశారు. కార్పొరేట్‌ శక్తులకు భూములను అప్పగించాలని, కొన్ని రాష్ట్రాల్లో కులం మతం అడ్డుపెట్టుకొని ప్రజల మధ్య విభేదాలు సృష్టించి ఘర్షణలకు కారకులయ్యారని విమర్శించారు. అలాంటి ఘటనే మణిపూర్‌లో జరిగితే కనీసం పార్లమెంటులో చర్చించే దమ్ము ప్రధానికి లేకపోయిందన్నారు ప్రతి వస్తువుపై జీఎస్టీ భారం మోపుతూ ప్రజలను ఆర్థికంగా నష్టాల్లోకి నెట్టారన్నారు. పార్లమెంటులో ప్రతి సంవత్సరం కనీసం 130 నుంచి 150 రోజులపాటు ప్రజా సమస్యలపై చర్చించాల్సిన సమావేశాలను కేవలం 50 రోజులు కూడా నడపలేదని తెలిపారు. కార్మిక రంగంలో సంఘటితంగా పోరాటాలు చేసే పరిస్థితి లేకుండా చేశారన్నారు.
దేశ సంపద కొందరి చేతుల్లోనే పోగయ్యేలా ఆర్థిక దోపిడీకి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ పాలనలో దేశ ప్రజలంతా విసుగు చెందారన్నారు. దాని ఫలితంగానే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పారని, ఇండియా బ్లాక్‌ అధికారంలోకి రాబోతుందని అన్నారు. ఈ క్రమంలో వామపక్ష భావజాలం కలిగిన పార్టీలను కలుపుకొని సీపీఐ(ఎం) ప్రజల తరపున నిరంతరం ఉద్యమాలు చేపడుతుందని తెలిపారు. నాయకులు పుట్ట ఆంజనేయులు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండీ.జబ్బార్‌ తదితరులు పాల్గొన్నారు.