కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాటం

– యూనియన్‌ నాయకులు తిరుపతి
నవతెలంగాణ-మనోహరాబాద్‌

కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్న సంఘం సీఐటీయూను ఆదరించాలని సీఐటీయూ నాయకులు తిరుపతి కోరారు. 54వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మనోహరాబాద్‌ మండలంలోని రామయపల్లి గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న ఇండస్‌ మెడికేర్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో జెండావిష్కరణ కార్యక్రమాన్ని యూనియన్‌ నాయకులు తిరుపతి ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్‌ నాయకులు తిరుపతి మాట్లాడుతూ కార్మికుల ఐక్యత పోరాటం దిశగా 1970 మే 30న కార్మికుల హక్కుల కోసం సీఐటీయూ ఆవిర్భవించిందన్నారు. ప్రపంచ కార్మికులను ఐక్యం చేస్తూ కార్మిక వర్గాన్ని కాపాడుతూ కార్మిక వర్గం హక్కులు కాపాడడంలో సిఐటియు ముందు నిలిచి పనిచేస్తుందని తెలిపారు. అన్ని రకాల దోపిడీల నుంచి సమాజం విముక్తి చేయడం కోసం కార్మిక వర్గం రాజ్యాధికారాన్ని స్థాపించడం ద్వారానే కార్మిక వర్గంపై జరుగుతున్న దోపిడీని అంతం చేయవచ్చని సీఐటీయూ విశ్వసిస్తుందన్నారు. 1990లో తీసుకు వచ్చిన నయా ఉదార విధానాల వలన పెట్టుబడిదారీ విధానం ద్వారా కార్మిక ప్రయోజనాలు దెబ్బతీయడం యాజమాన్యాలకు లాభాలు పెంచి పోషించడం జరుగుతుందని తెలిపారు. మనదేశంలో మోడీ ప్రభుత్వ విధానాలు కార్మికులు రైతులు ఇతర శ్రామికుల వర్గానికే కాదు దేశానికి కూడా నిరుద్యోగం యువతలో తీవ్ర స్థాయిలో చేరుకుందని, శాశ్వత ఉద్యోగాలు బాగా తగ్గిపోయాయన్నారు. ఎలాంటి ఉద్యోగ భద్రత సామాజిక బాధ్యత కార్మిక హక్కులు లేకుండా పోయాయన్నారు. ప్రస్తుతం ఉన్న 29 కేంద్ర కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవడం ద్వారా మోడీ ప్రభుత్వం కార్మిక ప్రాథమిక హక్కులను కాలరాయడం సామాజిక ఉద్యోగ భద్రత లేకుండా చేయడమేనన్నారు. కార్మికులను బానిసత్వంలోకి నెట్టడానికి నాలుగు లేబర్‌ కోడ్‌లను తీసుకువచ్చి ఆమోదం చేసింది. ఈ విధానం వలన కార్మిక వర్గం తీవ్ర నష్టదాయకంలోకి వెళ్లే పరిస్థితి ఉందన్నారు. కార్మిక చట్టాలను మొత్తం రద్దు చేసిందన్నారు. అందుకే కార్మిక వర్గం అంతా తన తక్షణ కర్తవ్యాలైన పర్మినెంటు, కనీస వేతనాలు, పిఎఫ్‌, ఈఎస్‌ఐ, గ్రాడ్యూటీ, ఉద్యోగ భద్రత కొరకు నిరంతరం పోరాటాల ద్వారానే కార్మికుల హక్కులు సాధ్యమని తెలిపారు ఈ కార్యక్రమంలో బాలాజీ, ఏ శ్రీనివాస్‌, సుధాకర్‌, ఎల్‌ శ్రీనివాస్‌, ఉపేందర్‌, గిరి, గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు.