– పశు సంవర్థకశాఖ సీఈఓ, ఓఎస్డీల అరెస్ట్
– మాజీ మంత్రి తలసాని వద్ద ఓఎస్డీగా పని చేసిన కల్యాణ్
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి :
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో వెలుగు చూసిన కోట్ల రూపాయల గొర్రెల స్కామ్ కేసులో మరో ఇద్దరు అధికారులను ఏసీబీ శుక్రవారం అరెస్ట్ చేసింది. అరెస్టయినవారిలో పశుసంవర్ధక శాఖకు చెందిన సీఈఓ రామచందర్, అప్పటి ఈ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వద్ద ఓఎస్డీగా పని చేసిన కల్యాణ్‌లు ఉన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం యాదవ, కురుమలను ఆర్థికంగా పరిపుష్టం చేయటానికి వారికి భారీ సబ్సిడీతో గొర్రెల పెంపకం పథకాన్ని అమలు చేసింది.
అయితే, ఈ స్కీంలో అసలు లబ్దిదారులకు బదులు బినామీలు భారీ మొత్తంలో లబ్ది పొందేలా కోట్ల రూపాయల స్కామ్ చోటు చేసుకున్న వైనం గతేడాది నవంబర్‌లో వెలుగు చూసింది. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ఆ సమయంలోనే నలుగురు పశుసంవర్ధక శాఖకు చెందిన అధికారులను అరెస్ట్ చేశారు. ఈ దర్యాప్తును ముందుకు కొనసాగించిన ఏసీబీ.. ఈ కేసులో ఇదే శాఖకు చెందిన సీఈఓ రాంచందర్, కల్యాణ్‌ల పాత్ర కూడా ఉన్నట్టు తెలిసింది. దాదాపు రూ.2 కోట్లకు పైగా జరిగిన స్కామ్‌లో వీరిద్దరి పాత్ర కూడా ఉన్నట్టు తేల్చి ఏసీబీ అధికారులు.. కేసులో నిందితులుగా పేర్కొంటూ అరెస్ట్ చేశారు. వీరిద్దరిని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపర్చి న్యాయమూర్తి ఆదేశాల మేరకు చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతున్నదని ఏసీబీ డైరెక్టర్ జనరల్ సి.వి ఆనంద్ తెలిపారు.