– నియామకాల్లో నిబంధనలకు తూట్లు?
– మెరిట్ అభ్యర్థులకు అన్యాయం
– అనర్హులకు పోస్టింగ్‌లు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీలో చోటు చేసుకుంటున్న అవకతవకలకు సంబంధించిన ఆరోపణలు కొనసాగుతూనే ఉన్నాయి.. రాష్ట్రంలో సర్కారు మారినా… టీశాక్స్ లో మాత్రం పాత పోకడలే కనిపిస్తున్నాయి. తమకు నచ్చిన వారికి పోస్టింగ్ ఇప్పించుకునేందుకు నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారని ఉద్యోగుల్లో జోరుగా చర్చ జరుగుతున్నది. అధికారుల పక్షపాత ధోరణి కారణంగా ప్రతిభావంతులైన అభ్యర్థులకు అన్యాయం జరిగి, అనర్హులు పోస్టింగ్‌లు దక్కించుకుంటున్నారు.
ఇటీవల నియమించిన ఏఆర్టీ సెంటర్ మెడికల్ ఆఫీసర్ నియామకంలో నిబంధనలు పాటించలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జనగామ జిల్లా ఆస్పత్రి ఏఆర్టీ సెంటర్‌లో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ఈ పోస్టును భర్తీ చేసినట్టు తెలుస్తున్నది. గతేడాది ఆగస్టు నెలలో ఈ పోస్టు భర్తీ కోసం శాక్స్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇద్దరు మెడికల్ ఆఫీసర్లను నియమించారు. అయితే ఇతర కారణాలతో వారు రాజీనామాలు చేయడంతో మళ్లీ భర్తీ చేయాల్సి వచ్చింది. దీంతో నియామక ప్రక్రియ ప్రకారం… ఆ తర్వాత మెరిట్ స్థానంలో ఉన్న వారిని పిలవాల్సి ఉంటుంది. ఒకవేళ వారు ఫోన్ కాల్స్‌లో అందుబాటులో లేకపోయినా…ఈమెయిల్ ద్వారా సమాచారం ఇవ్వాలని నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ నిబంధనలు చెబుతున్నాయి. అయితే ఇవేమి పాటించకుండా మెరిట్‌లో లేని డాక్టర్‌ని తీసుకువచ్చి హడావుడీగా రాటిఫికేషన్ ఫైల్‌ను శాక్స్ డైరెక్టర్‌కు పంపించి మెరిట్‌లో లేని డాక్టర్‌ను నియమించినట్టు తెలుస్తున్నది. దీనిపై నియామక ప్రక్రియలో మెరిట్ కనబరిచిన ఇద్దరు అభ్యర్థులు హైదరాబాద్‌లో టీశాక్స్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుపై ఇప్పటికే ప్రాజెక్ట్ డైరెక్టర్ జేడీ (సీఎస్టీ)ని వివరణ కోరినట్టు విశ్వసనీయ సమాచారం. తరచూ వివాదాస్పద నిర్ణయాలతో అసలు లక్ష్యం మరుగున పడుతున్నది. హెచ్‌ఐవి ప్రబలకుండా చూడటం, ఆ వ్యాధిగ్రస్తులకు మెరుగైన సేవలందించాలనే ఉదాత్తమైన లక్ష్యంతో ఏర్పడిన టీశాక్స్ మెరుగ్గా పని చేయాలంటే పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. టీశాక్స్‌ను ప్రక్షాళన చేస్తే తప్ప పూర్వ వైభవం వచ్చే అవకాశం కనిపించడం లేదు.