2023-24లో జీడీపీ 8.2 శాతం వృద్ధి

2023-24లో జీడీపీ 8.2 శాతం వృద్ధి– క్యూ4లో 7.8 శాతంగా నమోదు
న్యూఢిల్లీ : దేశంలో నిరుద్యోగం పెరుగుదల, పెట్టుబడుల్లో స్తబ్దత, ప్రజల ఆదాయాలు పడిపోతున్నప్పటికీ ఆర్థిక వ్యవస్థ మాత్రం ఆశ్చర్యకరంగా పరుగులు పెట్టింది. నిపుణుల అంచనాలు మించి గడిచిన ఆర్థిక సంవత్సరం 2023-24లో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 8.2 శాతం వృద్ధి చెందింది. 2022-23లోని 7 శాతంతో పోల్చితే మెరుగైన వృద్ధి చోటు చేసుకుందని శుక్రవారం గణంకాల మంత్రిత్వ శాఖకు చెందిన కేంద్ర గణంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌ఒ) ఓ రిపోర్ట్‌లో పేర్కొంది. అంతర్జాతీయ ఆర్ధిక వ్యవస్థ ఒడిదుడుకులకు గురైనప్పటికీ భారత్‌ మంచి జీడీపీని సాధించిందని తెలిపింది. తయారీ రంగం ప్రోత్సాహకర వృద్ధి నమోదు చేయడంతో మెరుగైన జీడీపీ గణాంకాలు సాధ్యమయ్యాయని పేర్కొంది. 2023-24లో తయారీ రంగం ఏకంగా 9.9 శాతం పెరిగింది. గనుల రంగం 7.4 శాతం, విద్యుత్‌ 7.5 శాతం, నిర్మాణ రంగం 9.9 శాతం చొప్పున వృద్ధిని నమోదు చేశాయని గణంకాల శాఖ వెల్లడించింది. 2023-24లో జనవరి నుంచి మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం (క్యూ4)లో జీడీపీ 7.8 శాతం పెరుగుదల చోటు చేసుకుందని ఎన్‌ఎస్‌ఓ పేర్కొంది. ఆర్‌బీఐ అంచనా వేసిన 7 శాతం కంటే వృద్ధి ఎక్కువగా ఉండటం విశేషం. 2023-24లో వ్యవసాయ రంగం వృద్ధి 1.4 శాతానికి పరిమితమయ్యింది. ఇంతక్రితం ఏడాది ఈ రంగం 4.7 శాతం వృద్ధిని కనబర్చింది. ఏప్రిల్‌లో కీలక రంగాలు 6.2 శాతం వృద్ధి ప్రస్తుత ఏడాది ఏప్రిల్‌లో కీలక రంగాలు 6.2 శాతం వృద్ధిని నమోదు చేశాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. విద్యుత్‌, నాచురల్‌ గ్యాస్‌, బొగ్గు, స్టీల్‌, రిఫైనరీ, ముడి చమురు, సిమెంట్‌ తదితర ఎనిమిది కీలక రంగాలు మార్చిలో 6 శాతం పెరిగాయి. 2023 ఏప్రిల్‌లో ఈ రంగాల్లో 4.6 శాతం పెరుగుదల ఉంది.