పాఠ్యపుస్తకాలు వచ్చేశాయి..

– ఆరంభంలోనే అందించేలా కసరత్తు
– ఈ ఏడాది కూడా రాత పుస్తకాల పంపిణీ
– తగ్గనున్న తల్లిదండ్రుల ఆర్థిక భారం
నవతెలంగాణ – పెద్దవంగర
సర్కారు పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా అందించే పాఠ్యపుస్తకాలు మండలానికి చేరాయి. 2024-25 విద్యా సంవత్సరానికి గాను పాఠశాలల ఆరంభంలోనే విద్యార్థులకు సకాలంలో అందించేలా అధికారులు చర్యలు చేపట్టారు. మండల వ్యాప్తంగా మొత్తం 30 ప్రభుత్వ పాఠశాలలు ( కేజీబీవీ, టీఎస్ఎంజేపీటీబీసీ గురుకుల పాఠశాల) తో కలిపి ఉన్నాయి. వీటిలో ఒకటి తరగతి నుండి పదవ తరగతి వరకు దాదాపుగా 1997 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. ఈ నెల 12 న పాఠశాలలు పున ప్రారంభం కానున్నాయి. గత రెండు రోజుల క్రితమే 5222 పాఠ్యపుస్తకాలు మండల విద్యా వనరుల కేంద్రానికి చేరుకున్నాయి. విద్యార్థులు పాఠశాలకు వచ్చిన మొదటి రోజే పుస్తకాలు అందించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.

ఇంకా రావాల్సిన పుస్తకాలు..
మండలానికి మొదటి విడతగా 5222 పుస్తకాలు వచ్చాయి. ఇంకా తొమ్మిది టైటిల్ పుస్తకాలు రావాల్సి ఉంది. వాటిలో రెండవ తరగతి తెలుగు టైటిల్, ఆరవ తరగతి ఇంగ్లిష్ టైటిల్, ఏడవ తరగతి ఇంగ్లిష్,  ఎనిమిదో తరగతి తెలుగు, ఇంగ్లిష్ టైటిల్, తొమ్మిదవ తరగతి హింది, బయోలాజికల్ సైన్స్ టైటిల్, పదో తరగతి హింది, ఇంగ్లిష్ టైటిల్స్ రావాల్సి ఉంది. ఇంకా రావాల్సిన పుస్తకాలు రెండో విడత లో రానున్నాయి. వీటి సరఫరా కోసం కూడా అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు.
పుస్తకాలతో పాటు రాత పుస్తకాలు కూడా..
రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది నుండి సర్కారు పాఠశాలలో చదివే విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలతో పాటుగా, రాత పుస్తకాలను కూడా అందజేస్తుంది. అందులో భాగంగానే ఈ ఏడాది మండలానికి మొత్తం 8922 రాత పుస్తకాలు వచ్చాయి. వీటిలో వైట్ రాత పుస్తకాలు 6469, సింగిల్ రోల్ రాత పుస్తకాలు 2453 ఉన్నాయి. గతేడాది 6,7 వ తరగతుల విద్యార్థులకు 6, 8 వ తరగతి విద్యార్ధులకు 7 రాత పుస్తకాలు, 9,10 వ తరగతి విద్యార్ధులకు 14 రాత పుస్తకాలు ఇచ్చారు. ఈ ఏడాది కూడా విద్యార్థులకు సరిపడా రాత పుస్తకాలు పంపిణీ చేయనున్నారు. ప్రభుత్వమే విద్యార్థులకు రాత పుస్తకాలు పంపిణీ చేస్తుండడం వల్ల తల్లిదండ్రులకు ఆర్థిక భారం తగ్గనుంది. దీంతో ప్రభుత్వ పాఠశాలలకు ఆదరణ మరింత పెరిగే అవకాశం ఉంది.
మొదటి రోజే పుస్తకాలు పంపిణీ
విద్యార్థులకు ఆరంభంలోనే పాఠ్యపుస్తకాలు అందజేయడం వల్ల ఒత్తిడి ఉండదు. ఈ విద్యాసంవత్సరంలో పుస్తకాలను సకాలంలో పంపిణీ చేయడానికి అన్ని చర్యలు చేపట్టాం. విద్యార్థులు పాఠశాలకు వచ్చిన మొదటి రోజే పుస్తకాలు అందజేస్తాం. పుస్తకాలు పక్క దారి పట్టకుండా జాగ్రత్తలు తీసుకుంటాం.
            – కళాధర్ (ఎంఎన్ఓ-పెద్దవంగర)