నవతెలంగాణ-శాయంపేట
ఒక్కరిని కాదు.. ఇద్దరినీ కాదు.. మొత్తం 14 మందిపై పిచ్చి కుక్క దాడి చేసి గాయపర్చింది. ఈ ఘటన హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలో శనివారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి.. తెల్లవారుజామున 3 గంటల సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఉక్కపోత వల్ల ఇంట్లో నుంచి బయటకు వచ్చిన మాచర్ల విజయకుమార్‌పై మొదటగా పిచ్చికుక్క దాడి చేసి గాయపరిచింది. ఆ తర్వాత తై బజార్లో మామిడి పండ్లు విక్రయించడానికి వచ్చిన సాదు సమ్మక్కను, మాచర్ల రేణుక, కడారి నర్మద, గడ్డం సాంబ, కూతురు మల్లయ్య, దండబోయిన బుచ్చమ్మ, కందగట్ల కళ్యాణి, రాచర్ల శారద, రాజును కరిచింది. దాంతో గ్రామపంచాయతీ సిబ్బంది ఆ కుక్కను చంపేశారు. గాయపడిన వారిలో 9 మంది స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లగా డాక్టర్ సాయికృష్ణ వ్యాక్సిన్లు వేశారు. మరో ఐదుగురు వ్యక్తులు వరంగల్ ఎంజీఎం వెళ్లి చికిత్స చేసుకున్నట్టు డాక్టర్ తెలిపారు. గ్రామంలో కుక్కల బెడద ఎక్కువగా ఉందని.. చిన్నపిల్లల వెంట, వాహనాల వెంట పడుతున్నాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించి కుక్కల బెడద నుంచి కాపాడాలని కోరుతున్నారు.