– ఏటీఎఫ్ ధర 6.5 శాతం తగ్గింపు
– వాణిజ్య సిలిండర్‌పైనా రూ.69 కోత
న్యూఢిల్లీ : సామాన్యులపై అధికంగా భారం పడే పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపునకు మీనమేషాలు లెక్కించే కేంద్ర ప్రభుత్వం.. సంపన్నులు ప్రయాణించే విమానాలకు కావాల్సిన ఇంధనంపై పదేపదే ధరలను తగ్గిస్తోంది. తాజాగా ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) 6.5 శాతం తగ్గించింది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో లీటర్ ఏటీఎఫ్ ధర రూ.6,673.87 లేదా 6.5 శాతం తగ్గింపుతో రూ.94,969.01లకు చేర్చుతూ.. కేంద్ర చమురు సంస్థలు నోటిఫికేషన్లో తెలిపాయి. గత నెల ఒకటో తేదీన ఎటిఎఫ్పై స్వల్పంగా 0.7 శాతం లేదా రూ.749.25 పెంచగా.. ఈ దఫా ఏకంగా భారీగా తగ్గించడం విశేషం. మహారాష్ట్ర రాజధాని ముంబయిలో ఎటిఎఫ్ ధర రూ.95,173.70 నుంచి రూ.88,834.27లకు తగ్గింది. ప్రతి నెలా కేంద్ర ప్రభుత్వ చమురు సంస్థలు అంతర్జాతీయ మార్కెట్లో ఫ్యుయల్ ధరలు, విదేశీ మారక ద్రవ్యం నిల్వలకు అనుగుణంగా ఏటీఎఫ్ ధరలను సవరిస్తుంటాయి.
ఏటీఎఫ్ సహ వాణిజ్య గ్యాస్ సిలీండర్లపై ధర తగ్గించింది. హోటళ్లు, రెస్టారెంట్లలో వినియోగించే వాణిజ్య సిలిండర్ (19కిలోలు) ధర రూ.69 తగ్గి రూ.1676కు చేర్చింది. వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర తగ్గడం వరుసగా మూడో నెల. ఈ ఏడాది జనవరి తర్వాత తొలిసారి గత ఏప్రిల్‌లో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ.30.5 తగ్గిస్తే, గత నెల ఒకటో తేదీన రూ.19 తగ్గించాయి. అయితే కుటుంబాలు వినియోగించే 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ధర రూ.803 యధాతథంగా కొనసాగుతోంది.