గొంతులేని అడవులు అగ్నికీలల్లో భస్మమౌతూ
ఓ నగ సత్యాన్ని ప్రపంచ పటం మీద
నిజాయితీగా వదిలిపెడుతున్నప్పుడు
బహుళజాతుల్లో మాటల యుద్ధం
ప్రాణవాయువుతో చెలగాటంగా మారాయి
మట్టి కాలినా! మనిషి కాలినా!
స్పర్శించని ఆ వ్యాపార చేతులు
భూమండలం నుండి అదశ్య మౌతున్న
ప్రాణ వాయువును ఏ దోసిట్లతో ఆపగలరు?
ప్రశ్నిస్తే? రాజకీయ శబ్దాలు లేచి
ఆ అగ్నికీలల్లో సమాధానాన్ని వెతుక్కుంటున్నాయి
ఇప్పుడు ధరిత్రి నిప్పుమీద ప్రయాణిస్తూ
శవపేటికలను తయారు చేసుకుంటున్నప్పుడు
వాటికి మూలాలను అందిస్తున్నది
అపార కుబేర హస్తాలే అన్నది
జీర్ణించుకోలేని సత్యం
కాలి బూడిదౌతున్న హరిత వనాలను
నిశ్శబ్దంగా మౌనమవుతున్న జంతుజాలాన్ని
సమాధి రెక్కలను తొడిగిస్తూ
నిబ్బరంగా పబ్బం గడుపుకుంటున్న
మేనిఫెస్టో లేని రాజకీయాలు
ఓజోన్ పొరను చిల్లు పడడానికే సహకరిస్తున్నాయి
స్వార్థం తారాస్థాయికి లేచినపుడు
మనిషి-మనిషికే శత్రువుగా నిలిచి
కాలుష్యం పడగ విప్పటానికి పరోక్షంగా సహకరిస్తున్నప్పుడు
పర్యవరానికి చితీ సహగమనమే
ముప్పును గ్రహించని ప్రపంచం
‘మాల్’లో ఆనందాన్ని వెతుక్కుంటూ
రక్షణ వలయాల నీడకోసం
ఎంత డబ్బును పారదోలినా
కరిగి పోతున్న ‘ఓజోన్’ పొరను
మూయలేరనేది వాస్తవం
దినదినం పెరుగుతున్న కఠిన వేడిమితో
మనిషి పెనం మీద నిలబడుతూ
తాత్కాలిక ఉపశమనాన్ని కోరుకుంటున్నాడు
కనుమరుగవుతున్న ప్రకతిలో
మనిషి ఆలోచనలు చీకటి వస్త్రంలో కప్పబడితే
అది శ్వాస కోల్పోయిన శరీరంతో సమానమే
– మహ్మద్ నసీరుద్దీన్, 9440237804