సాగర్‌ రోడ్డుపై మట్టి టిప్పర్‌ టెర్రర్‌

– నిబంధనలు బేఖాతర్‌ చేస్తున్న మట్టి మాఫియా కేటుగాళ్లు
– చోద్యం చూస్తున్న సంబంధితాధికారులు
– రోడ్‌ ఎక్కాలంటేనే జంకుతున్న వాహనాదారులు
– అనుమతులకు మించి వాహనాలను నడుపుతున్న మట్టి మాఫియా
– ఓవర్‌ లోడుతో హల్‌చల్‌
– పట్టించుకోని ఆర్డీఏ అధికారులు
– మ్యామ్యాలకు అలవాటు పడి మట్టి మాఫియాను ప్రోత్సహిస్తున్నారని ఆరోపణ
– టిప్పర్లపై చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్‌
నవతెలంగాణ-యాచారం
నాగార్జునసాగర్‌ రోడ్డుపైన ఆరు నెలలకు పైగా మట్టి మాఫియా టిప్పర్లు ఓవర్‌ లోడ్‌తో దడ పుట్టిస్తున్నాయి. మట్టిని తరలించడానికి అనుమతులున్న మట్టి మాఫియా కేటుగాళ్లు మాత్రం నిబంధనలను బేఖాతర్‌ చేస్తున్నారు. మట్టి టిప్పర్లు ఓవర్‌ లోడుతో పదుల సంఖ్యలో వెళ్తూ సాగర్‌ రహదారి పైన సమయ వేళలు పాటించకుండా ఇతర వాహనాదారులకు ఇబ్బంది కలిగిస్తున్నాయి. టిప్పర్లు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నడవాలని నిబంధన ఉన్న రాత్రి సమయంలో కూడా నడుపుతూ వాహనదారులను భయాందోళనకు గురి చేస్తున్నారు. మట్టి తరలింపు రెవెన్యూ, పోలీస్‌ అధికారుల కనుసన్నలోనే యదేచ్చగా నడుస్తుందని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ శాఖలకు సంబంధించి కిందిస్థాయి అధికారుల నుంచిపై స్థాయి అధికారుల వరకు పెద్ద ఎత్తున ముడుపులు అందుతున్నాయని విమర్శలు వస్తున్నాయి. మట్టి మాఫియా కేటుగాళ్ల ఆటలను కట్టడి చేయడంలో సంబంధిత అధికారులు పూర్తిగా విఫలమయ్యారన్న విమర్శలు వెలివేస్తున్నాయి. మట్టి టిప్పర్ల ఆగడాలను అరికట్టడంలో రెవెన్యూ, పోలీసు, ఆర్టిఏ అధికారులు నిమ్మకు నీరేత్తనున్నట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. టిప్పర్ల ఆగడాలని అరికట్టడంలో ఆర్టిఏ అధికారులు చోద్యం చూస్తున్నారని వాహనాదారులు విమర్శిస్తున్నారు. స్థానికంగా ఉన్న అధికారుల అండదండలతో మట్టి మాఫియా టిప్పర్లు చలామణి అవుతున్నాయని అంటున్నారు. సాగర్‌ రహదారి ఎక్కాలంటేనే వాహనాదారులు జంక్కుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు మట్టి మాఫియా టిప్పర్ల ఆగడాలను అరికట్టి చట్టపర్యమైన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

మట్టి టిప్పర్ల యజమానులు ఎలాంటి అనుమతుల పత్రాలు సమర్పించలేదు
మట్టి తరలించే టిప్పర్ల యజమానులు ఎలాంటి అనుమతి పత్రాలు మాకు సమర్పించలేదు. అనుమతి ఉందో లేదో కూడా తెలియదు. మట్టి టిప్పర్లు ఉదయం, రాత్రి వేళల్లో నడుస్తున్నాయన్న అంశంపై మాకు సమాచారం ఉంది. మట్టి తరలించే అనుమతి మాకు తెలియదు. మట్టి టిప్పర్లపై ఆర్టిఏ అధికారులు చర్యలు చర్యలు తీసుకోవాలి. టిప్పర్ల యజమానులు మా దగ్గర నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. పై అధికారులు మట్టి తరలింపునకు అనుమతిచ్చారని సమాచారం ఉంది. అనుమతి లేదని తెలిస్తే టిప్పర్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. అనుమతి ఉన్నంతవరకే మట్టి టిప్పర్లు నడిపించుకోవాలి. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు.
– అయ్యప్ప తహసీల్దార్‌ యాచారం మండలం